భవిష్యత్‌ అంతా గ్రీన్‌ ఎనర్జీదే

విద్యుత్‌ సరఫరా, పెట్టుబడులు, ఛార్జీల భారం తగ్గింపు తదితర అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.;

Update: 2025-08-13 12:51 GMT

ప్రస్తుతం పునరుత్పాదక విద్యుత్‌ వేగంగా విస్తరించి జన జీవనంలోకి వచ్చేసిందని.. ఇక భవిష్యత్‌ అంతా గ్రీన్‌ ఎనర్జీదేనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ గా ఏపీని తీర్చిద్దిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ మారుతున్న డైనమిక్స్‌ కు అనుగుణంగా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యుత్‌ సరఫరా పరిస్థితి, విద్యుత్‌ ప్రాజెక్టులు, పెట్టుబడులు, విద్యుత్‌ ఛార్జీల భారం తగ్గింపు తదితర అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎస్‌ కే.విజయానంద్, ఏపీ ట్రాన్స్‌ కో, జెన్‌ కో అధికారులు హాజరయ్యారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో వ్యయం ఎలా తగ్గించాలన్న అంశంపై అధ్యయనం చేసి ప్రజలకు ఆ ప్రయోజనాలను అందించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వచ్చే రెండు మూడేళ్లలో రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం మరో 8.9 శాతం మేర పెరిగే అవకాశముందన్న సీఎం అందుకు అనుగుణంగా గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు చేసుకోవాలన్నారు. అలాగే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ లాంటి సాంకేతికతను వినియోగించి గ్రీన్‌ ఎనర్జీలో అతితక్కువ వ్యయంతో విద్యుత్‌ ఉత్పత్తి చేసే మార్గాలను అన్వేషించాలని అన్నారు. మరోవైపు రాష్ట్రంలోని వినియోగదారులపై విద్యుత్‌ ఛార్జీల భారం మోపేందుకు వీల్లేదని సీఎం అధికారులకు తేల్చి చెప్పారు. నాన్‌ టారిఫ్‌ ఆదాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. ప్రస్తుతం ఏపీ ట్రాన్స్‌ కో వేసిన ఫైబర్‌ ఆప్టిక్‌ నెట్వర్క్‌ ను లీజుకు ఇవ్వటం ద్వారా అదనపు ఆదాయాన్ని సాధించాలని సూచించారు. ఈ మార్గం ద్వారా దాదాపు రూ.7 వేల కోట్ల వరకూ ఆదాయం వచ్చే అవకాశముందని సీఎం అన్నారు.

రాష్ట్రంలో 9 శాతంగా ఉన్న విద్యుత్‌ పంపిణీ నష్టాలు గణనీయంగా తగ్గాల్సి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వీటిని తగ్గించేందుకు ఫీడర్లను సమర్ధంగా నిర్వహించటంతో పాటు ఆయా కేటగిరీల వారిగా విభజించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ ను స్థానికంగానే వినియోగించుకునేలా చేయటం ద్వారా ట్రాన్స్‌ మిషన్‌ నష్టాలను తగ్గించుకునేందుకు ఆస్కారం ఉంటుందని ముఖ్యమంత్రి సూచించారు. ట్రాన్స్‌ మిషన్‌ లైన్లను ఆధునీకరించి సరైన నిర్వహణ చేపడితే పంపిణీ నష్టాలు గణనీయంగా తగ్గించుకోవచ్చని అన్నారు. గతంలో ఎనర్జీ ఆడిటింగ్‌ ద్వారా విద్యుత్‌ చౌర్యం, పంపిణీ నష్టాలను వెలుగులోకి తెచ్చామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యుత్‌ ఆడిటింగ్‌ చేపట్టిన తర్వాతే ఉత్పత్తి, సరఫరా, పంపిణీలను సమర్ధంగా నిర్వహించగలిగామని వెల్లడించారు. ప్రస్తుతం విద్యుత్‌ వినియోగంపై లోతైన అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే బహిరంగ మార్కెట్‌ లో విద్యుత్‌ కొనుగోళ్లను గణనీయంగా తగ్గించాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రతీ యూనిట్‌ కొనుగోలు వ్యయాన్ని రూ.4.80 పైసలకు తగ్గించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎస్‌ విజయానంద్‌ ముఖ్యమంత్రికి వివరించారు. మరోవైపు సెన్సార్లు, డ్రోన్లు ఇతర సాంకేతిక పరికరాల సాయంతో ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితుల్ని అంచనా వేసి అవసరమైన మేరకు విద్యుత్‌ ఉత్పత్తిని పెంచుకునేందుకు ఆస్కారం ఉందని సీఎం స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చి– ఏప్రిల్‌ నెలల్లో విద్యుత్‌ వినియోగం 270 మిలియన్‌ యూనిట్ల వరకూ పెరిగిందని.. వ్యవసాయానికి కూడా విద్యుత్‌ వినియోగం పెరిగినట్టు అధికారులు సీఎంకు వివరించారు. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి 2026 మార్చి నెలల మధ్య కూడా 12,700 మెగావాట్లకు విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. దీనిపై స్పందించిన సీఎం విద్యుత్‌ డిమాండ్‌ కు తగినట్టుగా ఉత్పత్తి పెంచుకోవాలని ఆదేశించారు. కొనుగోళ్లను తగ్గించేందుకు పవర్‌ స్వాపింగ్‌ లాంటి విధానాలను అనుసరించాలని సూచించారు.
విద్యుత్‌ ఉత్పత్తి వ్యయం పై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు అవకాశమున్న ప్రాంతాలను అన్వేషించాలని సూచించారు. విండ్‌ పొటెన్షియల్‌ ఉన్న ప్రాంతాల్లో ఆయా ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తే పెద్ద మొత్తంలో విద్యుత్‌ ఉత్పత్తి సాధ్యమని తద్వారా వ్యయాన్ని తగ్గించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ప్రస్తుతం థర్మల్‌ విద్యుత్‌ ప్రతీ యూనిట్‌ కు రూ.5–6 మేర వ్యయం అవుతోందని.. పవన విద్యుత్‌ కేవలం రూ4.6 కే యూనిట్‌ ఉత్పత్తి అవుతోందని అన్నారు. ఏపీలో 65 గిగావాట్ల పవన విద్యుత్‌ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని అన్నారు. అటు పంప్డ్‌ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు రాయలసీమలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పునరుత్పాదక విద్యుత్‌ రంగంలో 2024 జూన్‌ నుంచి ఇప్పటి వరకూ రూ.3.19 లక్షల కోట్ల ప్రాజెక్టులు గ్రౌండ్‌ అయ్యాయని అధికారులు వివరించారు.
రాష్ట్రంలో పీఎం– సూర్యఘర్‌ సోలార్‌ రూఫ్‌ టాప్‌ ప్రాజెక్టు ప్రస్తుత పురోగతిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఎస్సీ, ఎస్టీ బీసీలతో పాటు ఇతర వర్గాలకు సోలార్‌ రూఫ్‌ టాప్‌ కింద ఎన్ని యూనిట్లు ఏర్పాటు చేశారన్న అంశాన్ని ఎప్పటికప్పుడు తెలియచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ పురోగతిపై ప్రతీ నెలా తానే స్వయంగా సమీక్షిస్తానని తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలో కనీసం 10 వేల ఇళ్లకు సోలార్‌ రూఫ్‌ టాప్‌ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టామని, దీనికి అనుగుణంగా కార్యాచరణ చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా వ్యవసాయానికి స్మార్ట్‌ మీటర్లు పెట్టవద్దని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అన్ని విద్యుత్‌ సంస్థలు అందించే పౌర సేవల్ని వాట్సప్‌ మన మిత్ర ద్వారా అందించాలని పేర్కొన్నారు.
ఏపీ జెన్కో థర్మల్‌ యూనిట్లకు అవసరమైన బొగ్గు సేకరణలోనూ కేంద్ర నుంచి సహకారం కోరాలని సూచించారు. మరోవైపు విద్యుత్‌ ప్రమాదాలు, లో వోల్టేజి సమస్యలు, లీకేజీలు రాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని స్పష్టం చేశారు. పాత పడిన విద్యుత్‌ లైన్లను కూడా ఏఐ ద్వారా విశ్లేషించి వాటిని మార్చాలని సీఎం సూచించారు. దీని కోసం ప్రిడిక్టివ్‌ మెయింటెనెన్స్‌ సాంకేతికతను ఉపయోగించాలని సీఎం పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా జరగాలని ముఖ్యమంత్రి విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు.
Tags:    

Similar News