మత్స్యకారుల ఉద్యమం సరైందే..అభ్యంతరాలూ సమంజసమైనవే
కాలుష్యం వెదజల్లి మనుషుల ప్రాణాలు బలిగొనే బల్క్ డ్రగ్ పార్క్ ను ఉపసంహరించుకోవాలి అని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ప్రభుత్వాన్ని కోరారు.
By : The Federal
Update: 2025-10-25 10:38 GMT
బల్క్ డ్రగ్స్ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్నఉద్యమం, మత్స్యకారులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు సమంజసమైనవి అని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అభిప్రాయపడ్డారు. దగ్గరిలో ఉన్న హెటిరో డ్రగ్స్ కంపెనీ, పరిసర ప్రాంతాల్లో వెదజల్లుతున్న కాలుష్యం గురించి ప్రజలు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా, అధికారులు స్పందించకపోతే, వారు జాతీయ హరిత ట్రిబ్యునల్ ను ఆశ్రయించవలసి వచ్చింది అని పేర్కొన్నారు. ఆ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుల చేశారు. అందులో శర్మ ఏమన్నారంటే..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బల్క్ డ్రగ్స్ ప్రాజెక్ట్ ఆవిష్కరణ చేసిన సందర్భంలో, కేంద్రాన్ని అటువంటి ప్రోజెక్టుల వలన కలిగే కాలుష్య సమస్యల గురించి 2025 జనవరి 10వ తారీఖున హెచ్చరించడం జరిగింది. 2025 ఆగస్టు లో, అభ్యంతరాలు వ్యక్తం చేయడం కోసం కొంతమంది స్థానికులు ప్రయత్నించడానికి ప్రయత్నం చేసినప్పుడు, అధికారులు బలం ఉపయోగించి వారిని అడ్డుకోవడం చేశారు. ఆ సందర్భంగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి, అదే రోజున, ప్రజలందరికీ ఆ విధంగా అభ్యంతరాలు వ్యక్తపరిచే హక్కు ఉందని, గుర్తు చేయడం జరిగింది.
నక్కపల్లి ప్రాంతంలో ప్రజలు , ముఖ్యంగా మత్స్యకారులకు, రాజ్యాంగంలో 21వ ఆర్టికల్ కింద, వారి జీవితాలకు హాని కలిగించే ప్రోజెక్టుల విషయంలో, వారి ఉద్దేశాలను, అభ్యంతరాలను వ్యక్తపరిచే ప్రాథమిక హక్కు ఉందని ప్రభుత్వం గుర్తించాలి. విశాఖ, అనకాపల్లి ప్రాంతంలో, కాలుష్యం కలిగించి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఫార్మా కంపెనీల మీద చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (APPCB) ఏ విధంగా విఫలమయిందో, ఆ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల భద్రతను కాపాడటంలో, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏ విధంగా విఫలమయ్యారో, అందరికీ తెలిసిన విషయం.
కార్మికులు ప్రాణాలు కోల్పోయినా, తీవ్ర గాయాలకు గురి అయినా, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగినా, ప్రభుత్వం పరిశ్రమల యజమానులు మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజలలో అటువంటి పరిశ్రమలను ప్రభుత్వం చిత్తశుద్ధితో నియంత్రణ చేయగలదా అనే సందేహాన్ని కలిగిస్తున్నది. బల్క్ డ్రగ్స్ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రాజయ్యపేట మత్స్యకారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వం బల్క్ డ్రగ్స్ ప్రాజెక్ట్ ప్రతిపాదన నుంచి విరమించుకోవాలని నా విజ్ఞప్తి చేస్తున్నట్లు ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు.