నడిపించిన నాన్నకు కొడుకు నజరానా!
కుమారుడి కోసం ఉద్యోగాన్నే వదులుకున్న తండ్రి. కసితో ప్రయోజకుడైన వైజాగ్ కుర్రాడు. ఆసక్తి రేపుతున్న యువ క్రికెటర్ కాకి నితీష్‌కుమార్‌రెడ్డి బయోగ్రఫీ.;
Byline : బొల్లం కోటేశ్వరరావు
Update: 2024-12-29 12:39 GMT
‘నా సూర్యుడివి.. నా చంద్రుడివి.. నా దేవుడివి నువ్వే..
నా కన్నులకు నువ్వు వెన్నలవి..
నా ఊపిరివి నువ్వే.. నువ్వే కదా.. నువ్వే కదా?
సితారల కలకి.. నాన్నా నువ్వు నా ప్రాణమని.. సరిపోదట అని ఆ మాట..
నిజాన్నెలా. అనేదెలా? ఇవాళ నీ ఎదుట..
నీ చేతులలో .. నీ భుజములపై తలవాల్చుకుని.. ఆ పండగ నాకెప్పుడూ
ఏ కానుకలు నీ లాలనతో.. సరితూగవు ఇది నిజము..’
అంటూ ఓ సినీకవి రాసిన పాట భారత జట్టు యువ క్రికెటర్ కాకి నితీష్‌కుమార్‌రెడ్డికి అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఎందుకంటే?
అతని విజయ ప్రస్థానం వెనక ఆ తండ్రి చేసిన త్యాగం అంతటిది మరి!
నితీష్‌కుమార్‌రెడ్డి..! కొద్దిరోజులుగా విశాఖపట్నంలోనే కాదు.. దేశం యావత్తూ మార్మోగిపోతోంది. ఇంతకీ ఎవరీ నితీష్? ఎక్కడ నుంచి వచ్చాడీ కుర్రాడు? అంటూ క్రికెటర్లలోనే కాదు.. క్రికెట్ అభిమానుల్లోనూ ఒక్కటే చర్చ! దీనికంతటికీ ఆ యువ ఆటగాడి ప్రతిభే ఇంతటి చర్చకు కారణం. క్రికెట్‌లో దిగ్గజాలుగా చెప్పుకునే ఆస్ట్రేలియాపై జరిగిన తన తొలి టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ సాధించడమే కాదు.. భారత్ జట్టును ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు. అతి పిన్న (21 ఏళ్ల) వయసులోనే ఆసీస్‌పై సెంచరీ (105) చేసిన మూడో ఆటగాడిగానూ నిలిచాడు. అందుకే మన నితీష్ ఒక్కసారిగా అంత పాపులరయ్యాడు. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఈ కుర్రాడి క్రికెట్ ప్రస్థానం ఎంతో ఆసక్తికరం. అదేమిటో చూద్దాం..
అల్లరి చేస్తున్నాడని ఆటకు పంపిస్తే..
విశాఖపట్నం జిల్లా గాజువాక సమీపంలోని తుంగ్లాం గ్రామానికి చెందిన కాకి ముత్యాలరెడ్డి హిందుస్థాన్ జింక్ కర్మాగారంలో ఉద్యోగి. ఈయనకు కుమార్తె, కుమారుడు. చిన్న వాడైన నితీష్‌కుమార్‌రెడ్డి చిన్నప్పుడు అల్లరి పిడుగు. ఆ అల్లరిని భరించలేక తల్లి ఏదైనా ఆటకు తీసుకెళ్లండని భర్తకు చెప్పడంతో జింక్ ప్రాంగణంలోని క్రీడా మైదానానికి తీసుకెళ్లేవారు. అలా అక్కడ ఐదో ఏటనే ఓ ప్లాస్టిక్ బాల్‌తో క్రికెట్ ఆడటం మొదలెట్టాడు నితీష్. కబడ్డీ ఆటగాడైన తండ్రి ముత్యాలరెడ్డి కబడ్డీ ఆడుతుంటే.. నితీష్ ప్లాస్టిక్ బాల్‌తో క్రికెట్ ఆడేవాడు. అప్పట్లో అతని ఆసక్తి, ఆటతీరును చూసిన గాంధీ అనే కోచ్ ఆటలో మెళకువలు నేర్పారు. అలా అంచెలంచెలుగా ఆయన వివిధ స్థాయిల్లో క్రికెట్‌లో రాణిస్తున్నాడు. ఓసారి జింక్ జట్టు ఓటమి పాలైంది. ‘నితీష్ లేకపోవడం వల్లే మన జట్టు ఓడింది’ అంటూ కోచ్ చెప్పిన మాటలు విన్న తండ్రికి తన కొడుకు టాలెంట్ తెలిసొచ్చింది. దీంతో ఏటా వేసవి సెలవులకు అమ్మమ్మ గారి ఊరు ప్రకాశం జిల్లా చెరుకుపాలేనికి పంపే కొడుకుని ఇక ఆపేశారు. చదువా? క్రికెట్టా? ఏది కావాలో ఎంచుకోమన్నారు. క్రికెట్ ఆడుతూ చదువుకూ న్యాయం చేస్తానన్నాడు. కొడుకు క్రికెట్‌లో రాణిస్తాడన్న నమ్మకం కుదిరిన తండ్రి దానిపై ఫోకస్ పెట్టారు. క్రమంగా నితీష్ ఆడే మ్యాచ్‌లు విజయాల ఖాతాల్లో చేరడం మొదలయ్యాయి.
కొడుకు కోసం ఉద్యోగం వదిలి..
అండర్–14 జట్టుకు ఆడటానికి ముందు తండ్రి ముత్యాలరెడ్డిని యాజమాన్యం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు బదిలీ చేసింది. తాను అక్కడకు వెళ్తే కొడుకు కెరీర్ ఏమవుతుందోనని బెంగ పడ్డారాయన. తన ఉద్యోగంకంటే తనయుడి క్రీడా భవిష్యత్తే ముఖ్యమనుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి గుడ్‌బై చేప్పేశారు. ‘ఆయన’ నిర్ణయానికి భార్య మానస కూడా సై అన్నారు. కొన్నాళ్లు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెరవక ఇక అప్పట్నుంచి నితీష్ క్రికెట్‌లో ఎదుగుదలకే ప్రాధాన్యమిస్తూ వచ్చారు. తండ్రి అనుక్షణం కనిపెట్టుకుని ఉండేవారు. డ్రైవర్‌ను జీతమిచ్చే స్థోమతు లేక గ్రౌండ్‌లో ప్రాక్టీసుకి తానే డ్రైవరుగా కారులో తీసుకెళ్లేవారు. కొడుకే జీవితంలా నడిచారు. అలా అండర్–14, 16 జట్లకు ఎంపికవుతూ వచ్చాడు. వీటిలో తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు. అండర్–16లో నాగాలాండ్ టీమ్‌పై 441 రికార్డు స్కోర్ సాధించి.. ఎవరీ కుర్రాడు? అంటూ ప్రపంచ క్రికెట్ దిగ్గజాల కళ్లలో ఒక్కసారిగా మెరిశాడు. ఆ తర్వాత అండర్–19లోనూ రాణించాడు. 2024 ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ జట్టు నితీష్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ ఆయనకు ఆడే అవకాశం రాలేదు. అయితే ఇతర టీ–20 మ్యాచ్‌ల్లో దూసుకుపోతున్న నితీష్ ప్రతిభను గుర్తించి భారత జట్టులోకి తీసుకున్నారు. గతంలో రూ.20 లక్షలకే కొనుగోలు చేసిన ఎస్‌ఆర్‌హెచ్ ఇప్పుడు 2025 ఐపీఎల్‌కు రూ.6 కోట్లు వెచ్చించింది. తాజాగా అస్ట్రేలియాలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఎనిమిదో ఆటగాడిగా దిగిన నితీష్ సెంచరీ చేసి భారత జట్టును ఫాల్ ఆన్ గండం నుంచి గట్టెక్కించి దేశంలోని క్రికెట్ లెజండ్ల పాటు ఇతర దేశాల ప్రముఖ క్రికెటర్ల దృష్టినీ ఆకర్షించాడు. దీంతో ఇప్పుడు దేశంలోని క్రికెట్ ప్రియుల్లో హాట్ టాపిక్ అయ్యాడు. ‘నితీష్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్‌లో సమయానుకూలంగా ఆడి ఇండియా జట్టును గట్టెక్కించాడు. తన హీరో విరాట్ కోహ్లి నుంచి క్యాప్ తీసుకుని అద్భుతంగా రాణించాడు. ఇండియా జట్టులో మంచి స్థానానికి వెళ్తాడు’ అని క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ కితాబునిచ్చాడు.
పుత్రోత్సాహం తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు.. జనులా
పుత్రుని గనుకొని పొగడగ
పుత్త్స్రోహంబు నాడు పొందుర సుమతీ!
అన్నట్టు కొడుకు కెరీర్ కోసం తన ఉద్యోగాన్నే త్యాగం చేసి ప్రోత్సహించిన ఆ తండ్రి ఇప్పుడు అలాంటి పుత్రోత్సాహాన్నే పొందుతున్నారు. క్రికెట్‌లో రాణిస్తే చాలనుకున్న తండ్రి ఇప్పుడు తన బిడ్డ అనూహ్యంగా భారత జట్టులోకి ఎంపిక కావడం, తొలి అడుగులోనే సంచలనాలు సృష్టిస్తుంటే ఉప్పొంగిపోతున్నారు. ఒకప్పుడు క్రికెట్ సెలబ్రిటీలతో ఫోటోలు దిగడానికి, ఆటోగ్రాఫ్‌లు పెట్టించుకోవడానికి విఫలయత్నం చేసిన కొడుకే ఇప్పుడు ఓ సెలబ్రిటీగా మారడంతో ఆనంద పరవశులవుతున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ కొడుకు ఆడుతున్న మ్యాచ్‌లను గ్యాలరీ నుంచి వీక్షిస్తూ తన్మయత్వానికి లోనవుతున్నారు. ఒకప్పుడు ముత్యాలరెడ్డి కొడుకు నితీష్ అనేవారు.. ఇప్పుడు నితీష్‌రెడ్డి తండ్రి అంటున్నారు’ అంటూ ఆ తండ్రి గర్వపడుతున్నారు. కొడుకు కెరీర్ కోసం ఉద్యోగాన్ని ఫణంగా పెట్టిన తండ్రిని, అందుకు ప్రోత్సహించిన తల్లి మానసను బంధువులు కొందరు తప్పుబట్టారు. ఇప్పుడు కొడుకు తన నమ్మకాన్ని వమ్ము చేయలేదంటూ మురిసిపోతున్నారు. నాడు తప్పుబట్టిన వారే ఇప్పుడు వేనోళ్ల కొనియాడుతున్నారు.
మెడిసిన్ చేయించాలనుకుంటే..
నితీష్‌రెడ్డి తల్లి మానస తన ఇద్దరు పిల్లలను మెడిసిన్ చదివించాలనుకునే వారు. కానీ కుమారుడు నితీష్‌కు క్రికెట్‌పై ఉన్న మక్కువతో మనసు మార్చుకున్న మానస కుమార్తెను మాత్రమే వైద్య విద్యకు పంపారు. కొడుకు క్రికెట్ గ్రౌండ్‌లోను, ఇతరులతోను, పెద్దలతోనూ ఎలా మెలగాలో చెబుతుంటారు. తనయుడూ ‘మానస’ పుత్రుడిలానే మసలుకుంటాడు. నీ కోసం మీ డాడీ ఉద్యోగాన్ని వదులుకున్నారు.. క్రికెట్‌లో రాణించి మీ నాన్న తలెత్తుకునేలా ఎదగాలి’ అని చెబుతుండేదాన్ని. అలాగే కష్టపడి ఎదిగాడు నితీష్’ అని అంటారు తల్లి మానస. ‘నితీష్ మంచి క్రికెట్ ప్లేయర్ అవుతాడనుకునే వాడిని. కానీ భారత్ జట్టుకు ఆడతానని ఊహించలేదు. కానీ దేవుడి దయ, కొడుకు కృషి, పట్టుదలతో ఇండియా జట్టుకు ఎంపికై రాణిస్తున్నాడు’ అని నితీష్ తండ్రి ముత్యాలరెడ్డి అంటారు. నాన్న త్యాగం, అమ్మ ప్రోత్సాహం తనను ఇంతటి వాడిని చేసిందంటాడు నితీష్!
షూ కొనే స్థోమతు లేక..
నితీష్‌రెడ్డికి విరాట్ కోహ్లి వీరాభిమాని. కోహ్లి వాడేలాంటి షూ వేసుకోవాలని కోరిక ఉండేది నితీష్‌కి. కానీ అంత వెచ్చించే ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో ఆ సంగతి తెలుసుకున్న నితీష్ మేనమామ సురేందర్‌రెడ్డి ఆ షూతో పాటు ఎంఆర్‌ఎఫ్ బ్యాటును గిఫ్టుగా కొనిచ్చాడు.
నితీష్ పుట్టుకే మిరాకిల్?
ఇక నితీష్ తల్లి కడుపులో ఏడో నెల బిడ్డగా ఉన్నప్పుడు ఆస్పత్రికి వెళ్లారు. కడుపులో ఉన్న ఏ బిడ్డ అని డాక్టర్‌ను అడిగితే నిబంధనల దృష్ట్యా చెప్పలేదు. అయితే పదేపదే ఆరా తీస్తే మరో మహాలక్ష్మి పుడితే అదృష్టమే కదా? అన్న డాక్టర్ సమాధానంతో రెండో సంతానమూ ఆడ బిడ్డే అనుకున్నారు. తీరా ప్రసవం తర్వాత పుట్టింది మగబిడ్డ కావడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అందుకే మా నితీష్ పుట్టుక కూడా ఓ మిరాకిల్ అంటారు ఈ దంపతులు.
సొంతూరు తుంగ్లాంలో సంబరాలు.
నితీష్ అస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించి భారత్ పరువు నిలిపిన విషయం మీడియాలో పెద్ద సంచలమైంది. దీంతో ఒక్కసారిగా నితీష్ పేరు మారుమోగిపోయింది. నితీష్ స్వగ్రామం విశాఖలోని తుంగ్లాంలో శనివారం రాత్రి ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఊరంతా సంబరాలు చేసుకున్నారు. బ్యాండ్ బాజాలు, డప్పుల మోతతో హోరెత్తించారు. వీధుల్లో కుర్రకారు పాటలతో డ్యాన్స్‌లు చేశారు. నితీష్ కుటుంబీకులు కేక్ కట్ చేశారు. అందరికీ మిఠాయిలు పంచారు. ‘మా నితీష్ సౌమ్యంగా, పెద్దల పట్ల గౌరవంగా ఉంటాడు. భారత క్రికెట్ జట్టులో ఎంపికై చిన్న వయసులోనే రాణించి విశాఖ జిల్లాకు, ఆంధ్రప్రదేశ్‌కే కాదు.. దేశానికే పేరు తేవడాన్ని మా అందరికీ గర్వకారణం’ అని నితీష్ పెదనాన్న, జీవీఎంసీ కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో తన ఆనందాన్ని పంచుకున్నారు.