తండ్రే ఆ కొడుకుకు నడకయ్యాడు..

కూలీ పనులే ఆ భార్యభర్తలకు ఆధారం. కొడుకులను చదివించాలనేది వారి కోరిక. నడవలేని ఓ బిడ్డకు ఆ తండ్రి నడకయ్యాడు.

Update: 2024-08-09 05:50 GMT

చిన్నప్పుడు చేయి చిటికెన వేలు పట్టుకుని కొడుకును నడిపించాలని అనుకున్నాడు. తప్పటడుగులు సరిచేయాలని అనుకున్నాడు. విధివారితో నాటకం ఆడింది. ముగ్గురు కొడుకుల్లో ఒకరికి కాళ్లుచచ్చుబడ్డాయి. నడవలేని 14 ఏళ్ల ఆ కొడుకును భుజాలపై మోస్తున్న ఆ తండ్రే నడకగా మారాడు. బడికి కూడా అలాగే మోసుకుని వెళుతున్నాడు. రెక్కాడితే కానీ, డొక్క నిండని ఓ భవన నిర్మాణ కూలి కొడుకును చదవించడానికి సాగిస్తున్న జీవనపోరాటం ఇది.



కర్నూలు జిల్లి అస్పరి మండలం ముతుకూరుకు చెందిన వడ్డి రాజు, రంగమ్మ దంపతులు పనుల కోసం వలస వచ్చి, తిరుపతిలో ఉంటున్నారు. వైకుంఠపురం ఆర్చికి సమీపంలోని బాలాజీ డెయిరీ వద్ద అద్దె ఇంటిలో జీవిస్తున్నారు. వారి ముగ్గురు కుమారుల్లో అశోక్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. రెండో కొడుకు హనుమంతు, రాజేష్ తొమ్మిదో తరగతి చదువుతున్నారు. కొడుకులను రాజు దంపతులు కూలీ పనులు చేసుకుంటూనే చదవిస్తున్నారు. ఇందులో ప్రత్యేకత ఏమి లేదు. వారిలో రెండో కొడుకు హనుమంతుకు వైకల్యం. ఇద్దరు మనుషులు పట్టుకుంటేనే నడవగలడు. చదువుకోవాలని హనుమంతుకు.. చదవించాలని తండ్రి రాజుకు మనసులో బలమైన కోరిక ఉంది.


తమలాగే పిల్లలు ఇబ్బంది పడకూడదని రాజు దంపతులు కోరుకుంటున్నారు. కూలి పనులతో వచ్చే సొమ్ములో పిల్లలను చదివించడానికి శ్రద్ధ తీసుకుంటున్నారు. విభిన్న ప్రతిభావంతుడైన కుమారుడు హనుమంతు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. భుజాలపై మోసుకుంటూ, తిరుపతి ఎంజీఎం స్కూల్ లోని భవిత పాఠశాలలో వదులుతున్నాడు. రోజూ ఇలా తీసుకురావడం, మళ్లీ మోసుకుని వెళ్లడం భారం కదా! అంటే రాజు చెప్పిన సమాధానం..


"చెట్టుకు కాయ భారమవుతుందా" అనే ఒకే మాట. గుండెలో ముల్లు గుచ్చుకున్నట్లు అనిపించింది. రోజూ ఉదయం కొడుకును బడిలో వదిలే రాజు ఆ తరువాత పనికి వెళతాడు. సాయంత్రం రాజు భార్య రంగమ్మ కొడుకును ఇంటికి తీసుకుని వెళ్లడం జీవితంలో భాగంగా మార్చుకున్నారు. దీనిపై వారు ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడుతూ వారు ఏమన్నారంటే..
"మాది కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం అస్పరి మండలం ముతుకూరు. మాకు సేద్యం చేయడానికి పొలాలు లేవు. అక్కడ పనులకు కష్టంగా ఉంది" అందుకే తిరుపతికి వచ్చి, పనులు చేసుకుని బతుకుతున్నాం" అని రాజు, రంగమ్మ దంపతులు చెప్పారు.
"మేము కూలి పనులతో జీవించిన, మా కొడుకులు అట్ట కాకూడదు సార్. అందుకనే వాళ్లను చదివించడానికి కష్టపడుతున్నాం" అంటున్నారు. నడవలేని మా కొడుకు హనుమంతుకు గవర్నమెంటు రూ. ఆరు వేలు పింఛన్ ఇస్తోంది. మా కొడుకు చదువు బాగా సాగడానికి ఏదైన హాస్టల్ ఉన్న బడిలో చేర్పించడానికి సాయం చేయించండి సార్" అని రాజు కోరుతున్నాడు.
పెద్దకొడుకు అశోక్ డిగ్రీ చదువుతున్నాడు. రెండో కొడుకు హనుమంతు, మూడో కొడుకు రాజేష్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. హనుమంతుకు శస్ర్తచికిత్స చేయించడం వల్ల రెండేళ్లు చదువులో వెనకబడ్డాడు. తమ్ముడు రాజేష్ తోపాటు హనుమంతు కూడా తొమ్మిదో తరగతిలో ఉన్నాడని వారి తండ్రి రాజు వివరించారు.
ఈ తండ్రి ఆలోచన గొప్పది...
ఏ తండ్రి అయిన బిడ్డల ఉన్నతి కోరుకుంటాడు. ఇందుకు పేద, ధనిక అనే కొలమానాలు ఉండవు. అయితే ప్రయోజకులు అయ్యాక తల్లిదండ్రులను ఎలా ఆదరిస్తారనేది ఎన్నో సంఘటనలు సాక్ష్యంగా ఉన్నాయి. ఇక్కడ మాత్రం కూలి పనులు చేసే తండ్రి కష్టం ఊరికేపోదు అని డిగ్రీ చదువుతున్న రాజు కుమారుడు అశోక్ అంటున్నాడు.
"నేను ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ చదివి పాసయ్యా సార్. ఇప్పుడు నేను చెప్పిన మాటలు నా నాయన రాజు వినడం లేదు. నేను ఇంగ్లీషులో చదవాలనేది ఆయన కోరిక. నన్ను బలవంతంగానే ప్రయివేటు డిగ్రీ కాలేజీలో చేర్పించాడు" అని అశోక్ ఫెడరల్ ప్రతినిధితో అన్నారు. "ఇంకా ఫీజు కట్టలేదు. దీనికోసం ఆలోచన చేయొద్దు అని మా నాన్న అంటున్నారు" ప్రభుత హాస్టల్లోనే ఉంటున్నా, డిగ్రీ పాసవుతా. ఉద్యోగం సాధిస్తా. మా అమ్మానాన్నను కష్టపడకుండా చూసుకుంటా" అని అశోక్ చెబుతున్నాడు.
ఆరోగ్యంలో పురోగతిలో ఉంది..
ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ప్రభుత్వం సహిత విద్య అందుబాటులో ఉంది. ఆ బడికి వెళుతున్న హనుమంతు ఆరోగ్య, మానసిక స్థితిని తిరుపతి ఎంజీఎం స్కూల్ లోని భవిత పాఠశాల సహితవిద్య టీచర్ కే. భవానీ ఏమంటున్నారంటే...
"మా పాఠశాలకు సమీప ప్రాంతాల్లో సర్వే చేశాం. అందులో హనుమంతును గుర్తించాం. అతను సెలబ్రిల్ పాలసీ అనే వ్యాధి వల్ల నడవడానికి కష్టంగా ఉన్నట్లు గుర్తించాం. అతని తల్లదండ్రులు రాజు, రంగమ్మకు కౌన్సెలింగ్ ఇచ్చాం" అని భవానీ తెలిపారు. పిల్లలను చదివించాలనే కోరిక వారికి బలీయంగా ఉంది. అందుకే వారి ఉన్న ప్రదేశంలో రమేష్ అనే విద్యార్థి కూడా భవిత పాఠశాలకు వస్తున్నాడు. అని వివరించారు.
" హనుమంతు కాళ్లకు ఫిజియోథెరపీ ఇస్తున్నాం. మాటలు చక్కగా రావడానికి స్పీచ్ థెరపీ కూడా ఇచ్చాం. ప్రస్తుతం అతనికి శారీరక ఆరోగ్యం చదువుకు బాగా సహకరిస్తోంది. చక్కగా రాయడమే కాదు. చదవగలడు" అని ఆమె స్పష్టం చేశారు. "రాష్ట్రంలో మా సహితవిద్య పాఠశాల ప్రథమస్థానంలో ఉంది" అని భవానీ చెప్పారు. ప్రస్తుతం ఇక్కడ 60 మంది పిల్లలు ఉన్నారు. అందరూ బాగా చదవగలిగే స్థాయికి తీర్చిదిద్దాం" అని వివరించారు.
Tags:    

Similar News