తాళ్లపాక అనగానే గుర్తుకు వచ్చేది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కీర్తించిన పద కవితాకుతామహుడు అన్నమయ్య. తాళ్లపాక గ్రామంలో ఆయన ఆరాధించిన శ్రీదేవి, భూదేవి, సమేత చెన్నకేశవస్వామి తోపాటు సిద్దేశ్వరస్వామి ఆలయం కూడా ఉంది.
తాళ్లపాకలోని చెన్నకేశవ స్వామి ఆలయం తలుపులు తెరుచుకోని కారణంగా సోమవారం పూజలకు నోచుకోని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడి ఆలయ ఇన్స్పెక్టర్, సెక్యూరిటీ గార్డ్ నిర్లక్ష్యానికి ఇది సాక్ష్యంగా నిలిచిందని తాళ్లపాక గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం రాజంపేట నుంచి వచ్చిన కొందరు భక్తులు పూలదండలు, పూజాసామాగ్రితో వచ్చారు. ఆలయ సన్నిధిలోని మూలవిరాట్టు ఉన్న తలుపులు తెరవని కారణంగా పూజలు చేయడానికి ఆస్కారం లేకుండా పోయింది.
కడప జిల్లా రాజంపేట డివిజన్ కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తాళ్లపాక గ్రామంలో చారిత్రిక ఆనవాళ్లు అనేకం ఉన్నాయి. తాళ్లపాక గ్రామంలో సిద్దేశ్వర, చెన్నకేశవ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. తాళ్లపాక అన్నమాచార్యులు ఈ ఆలయాల్లో పూజలు చేసినట్టు కూడా చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి.
తిరుమల శ్రీవారిని కీర్తించిన అన్నమయ్య పురిటి గడ్డ తాళ్లపాకను తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి చేసింది. ఇక్కడి సిద్దేశ్వర, శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఆలయం తో పాటు, చక్ర తల్వార్ ఆలయం ఏర్పాటు చేయడంతో పాటు, గ్రామాన్ని ఆధ్యాత్మిక వాతావరణం లో తీర్చిదిద్దడానికి అవసరమైన అభివృద్ధి పనులను చేయడంలో టిటిడి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. తాళ్లపాక గ్రామంలోని సిద్దేశ్వర, శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఆలయాల బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తుంది.
తాళ్లపాక లో ఏం జరిగింది..
రాజంపేట పట్టణానికి సమీపంలో ఉన్న తాళ్లపాక గ్రామంలో అన్నమాచార్యులు ఆరాధించిన ఆలయాలతో పాటు, అక్కడి టీటీడీ భవనాల పర్యవేక్షణ కోసం టెంపుల్ ఇన్స్పెక్టర్ను టిటిడి నియమించింది. సెక్యూరిటీ గార్డును కూడా ఏర్పాటు చేసింది.
ఉమ్మడి కడప జిల్లాలోని తాళ్లపాక గ్రామంలోని ఆలయాలతో పాటు కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం, దేవుని కడప శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా టిటిడి ఆధీనంలోనే ఉన్నాయి. తిరుమల తరహాలోనే ఈ ఆలయాల్లో కూడా ఆగమ శాస్త్రానికి అనుగుణంగా పూజలు, విశేష పర్వదినాలు నిర్వహించడానికి టిటిడి వేద పండితులను ఆయా సందర్భాల్లో ఆలయాలకు వెళుతూ ఉంటారు. టీటీడీ చైర్మన్, ఈవో తో పాటు అనేకమంది అధికారులు కూడా ప్రత్యేక సందర్భాలలో ఆలయాల వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
తిరుపతి లేదా తిరుమలలో ఉండే టీటీడీ అధికారులు తరచూ టిటిడి అనుబంధ ఆలయాలు ప్రధానంగా పొరుగు ప్రాంతాల్లోని ఆలయాలను తనిఖీ చేయకపోవడం వల్ల సిబ్బంది తీరు ఇష్టాను రాజ్యాంగ ఉందనే విషయం మరోసారి బయటపడింది.
పూజలకు దూరమైన చెన్నకేశవుడు
తాళ్లపాక గ్రామంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి ఆలయంలో నిత్య పూజలు నిర్వహించాలి.. దీనికోసం అర్చకులను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడి కార్యక్రమాలను పర్యవేక్షించడానికి టెంపుల్ ఇన్స్పెక్టర్, భద్రత కోసం సెక్యూరిటీ గార్లు కూడా నియమించారు
చెన్నకేశవ స్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం పూజలు, యాత్రికుల సందర్శన తర్వాత అర్చకుడు తాళం వేసి వెలుపలికి వచ్చారు. తలుపులకు వేసిన తాళానికి సంబంధించిన డిజిటల్ తాళం ఆలయంలోపలే పెట్టి అర్చకుడు మర్చిపోయి వచ్చాడని తెలిసింది. ప్రధాన ద్వారం తాళం తీయడానికి అవకాశం లేకపోవడంతో తలుపులు తెరుచుకోలేదని తెలిసింది. దీంతో చిన్న కేశవ స్వామి ఆలయంలో సోమవారం ఎక్కువగా జమనుంచి పూజలు ఆగిపోయినట్లు సమాచారం అందింది. ఈ చర్యతో తాళ్లపాక గ్రామస్తుల తో పాటు రాజంపేట పట్టణం నుంచి రోజు ఆలయానికి వెళ్లే యాత్రికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాళ్లపాక ఆలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.