ఆధ్యాత్మిక సేవలో చెరగని సంతకం
తిరుమలకు వంద కోట్ల విరాళం అందించిన రాజు వేగేశ్న ఫౌండేషన్ డైరెక్టర్ ఆనందరాజు కన్నుమూత.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-07-08 01:30 GMT
ధార్మిక కార్యక్రమాలకు ప్రధానంగా తిరుమలకుదాత రాజు వేగేశ్న ఫౌండేషన్ డైరెక్టర్ ఆనందరాజు వంద కోట్ల విరాళం ఇచ్చారు. అన్నదాన సత్రం నిర్మాణం, నీటి శుద్ధి ప్లాంటు ఏర్పాటు ద్వారా ధార్మిక కార్యక్రమాలతో మమేకమైన ఆనందరాజు (62 ) తుది శ్వాస విడిచారు.
అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని పెదవాల్తేర్ డాక్టర్స్ కాలనీలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
వేగేశ్న ఫౌండేషన్ నిర్వహణలో ఆనందరాజు కీలకంగా వ్యవహరిస్తూ.. దాని ద్వారా దేశంలోని వివిధ ఆలయాల్లో భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు రూ. కోట్ల రూపాయలు వెచ్చించారు.
తిరుమల అన్నదాన సత్రం నిర్మాణం. యాత్రికులకు శుద్ధనీరు అందించడంలో ఫౌండేషన్ ద్వారా ఆనంద రాజు కీలక పాత్ర పోషించారు. విశాఖపట్నం పెదవాల్తేరు డాక్టర్స్ కాలనీలో కనుమూసిన ఆయనకు తిరుమల తో పాటు తెలంగాణలోని యాదాద్రి తో కూడా అనుబంధం ఉంది.
వేగేశ్నఫౌండేషన్ డైరెక్టర్ ఆనంద్ రాజు మరణం పై సీఎం ఎన్ చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ట్విట్టర్ వేదికగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు.
***
ఇది కూడా చదవండి
తిరుమలపై చెరగని సంతకం
తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రంలో వేగేశ్న ఫౌండేషన్ డైరెక్టర్ ఆనందరాజు అందించిన సేవలను, దాతృత్వాన్ని వేమన విజ్ఞాన కేంద్రం స్మరించుకుంది.
"ఆనంద్ రాజు సేవలు చిరస్మరణీయం. ఆయన అందించిన సేవల్లో సజీవంగా ఉంటారు" అని వేమన విజ్ఞాన కేంద్రం ప్రతినిధి మల్లారపు నాగార్జున సంతాపం తెలిపారు.
తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం వేగేశ్న ఫౌండేషన్ ద్వారా అనేక సామాజికహిత కార్యక్రమాలు నిర్వహించడంలో ఆనందరాజు కీలక పాత్ర పోషించారు. అందులో అత్యంత ప్రధానమైనది. అన్నదాన సత్రం
"తిరుమలలోని శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన సత్రం" నిర్మించడంలో వేగేశ్న ఫౌండేషన్ ద్వారా ఆనంద్ రాజు ప్రధాన పాత్ర పోషించారు. 77 కోట్లతో నిర్మించిన ఈ అన్నదాన సత్యాన్ని మాజీ రాష్ట్రపతి ప్రతిభాసింగ్ పాటిల్ ప్రారంభించారు.
తిరుమలలో యాత్రికులకు మంచినీరు అందించడంలో కూడా వేగ్నేశ ఫౌండేషనఖ ప్రధాన పాత్ర పోషించింది. శుద్ధి చేసిన నీటిని యాత్రికులకు అందించడానికి వీలుగా 27 కోట్ల రూపాయలతో నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ నిర్వహణ కోసం ప్రతి సంవత్సరం ఫౌండేషన్ ద్వారా 1.50 కోట్లు ఇస్తున్నారు.
షిర్డీలో కూడా
మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయం వద్ద కూడా వేగేశ్న ఫౌండేషన్ ద్వారా నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా తిరుపతి, చిన్న తిరుపతి గా పరిగణించే ద్వారకా తిరుమలలో కూడా నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయడంలో వేగేశ్న ఫౌండేషన్ డైరెక్టర్ ఆనందరాజుదే ప్రధాన పాత్ర. ఈ కేంద్రాల్లో ఆసుపత్రులు కూడా నిర్వహించడం ద్వారా అత్యవసర సేవలు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
పేదలకు గూడు
సామాజిక సేవా కార్యక్రమాలలో మమేకమైన ఆనందరాజు ధార్మిక లోకంలో చరగని ముద్ర వేసుకున్నారు. ఎక్కడ ఎన్ని సేవలు చేసిన, పురిటిగడ్డకు చేసిన సేవలు మిగిల్చే ఆనందం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన ఆనందరాజు తన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో ఆరు ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. ఆ స్థలంలో పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం ద్వారా అక్కడి పేదలకు ఆయన దేవుడయ్యారు.
యాదాద్రిలో..
వేగేశ్న ఫౌండేషన్ సేవలు కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితం కాలేదు. తెలంగాణలో కూడా ధార్మిక కార్యక్రమాలకు దాతృత్వాన్ని విస్తరించారు.
తిరుమల తర్వాత యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం వద్ద ఆనందరాజు రూ.25 కోట్లతో అన్నదాన సత్రం నిర్మించారు. తద్వారా ఆధ్యాత్మిక క్షేత్రాల వద్ద ఈ ఫౌండేషన్ ద్వారా అవసరమైనన్ని సేవా కార్యక్రమాలతో యాత్రికులకు మంచి వస్తువులు అందుబాటులోకి తీసుకువచ్చారు.
సుదూర ప్రాంతాల నుంచి ఆలయాల సందర్శనకు వచ్చే యాత్రకు ఇబ్బంది లేకుండా ఆ ప్రదేశాల్లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్ ల వద్ద కూడా వసతులు కల్పనకు వేగేశ్న ఫౌండేషన్ ద్వారా ఆనంద రాజు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారనేది సర్వత్రా వినిపించే మాట.
విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ, ద్వారకా బస్టాండ్ లోనూ సౌకర్యాలు కల్పించారు. పేదలు, ఆపదలో ఉన్న కుటుంబాల్లో పిల్లల చదువుకు అవసరమైన నిధులు సమకూర్చారు.
"వేగేశ్న ఫౌండేషన్ ద్వారా ఆనందరాజు.విశాఖ, హైదరాబాద్లో ఉంటూనీ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ వచ్చారు" అని టీటీడీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, వేమన విజ్ఞాన కేంద్రం ప్రతినిధి మల్లారపు నాగార్జున గుర్తు చేశారు.
"మానవ సేవలో మాధవుణ్ణి చూస్తున్న శ్రీమంతులు వేగేశ్న ఆనందరాజు. వారి కుటుంబానికి మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను" అని మల్లారపు నాగార్జున నివాళులర్పించారు.