మరణ గంటలు మోగుతున్న తురకపాలెం
ఆగని మరణాల వెనుక ఏముందో నెలల తబడి పట్టించుకోని వైద్య సిబ్బంది.;
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని గుంటూరు రూరల్ మండలం తురకపాలెం.. ఒకప్పుడు పచ్చని పొలాలు, పశువుల సందడితో కళకళలాడిన చిన్న గ్రామం. మూడు నెలల్లో 45 మందికి పైగా మరణాలు సంభవించడంతో ఈ గ్రామం మరణ గంటలు మోగుతున్న భయానక స్థలంగా మారిపోయింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, కేంద్ర వైద్య నిపుణుల బృందం, ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రజా సంఘాలు గ్రామాన్ని సందర్శించినా, మరణాల మిస్టరీ ఇంకా వీడలేదు. ఇది కేవలం వ్యాధి సమస్య కాదు.. ప్రభుత్వ నిర్లక్ష్యం, పరిశుభ్రత లోపాలు, సామాజిక అలవాట్లు కలిసిన విషాద ఫలితం.
మొత్తం జనాభా : 2,517
పురుషులు : 1,255 మంది
మహిళలు : 1,248 మంది
కుటుంబాలు : 827
14 బృందాలు సర్వే చేసిన కుటుంబాలు: 712
సేకరించిన తాగునీటి నమూనాలు: 16
ఎక్కడెక్కడ అంటే.. బోరు బావులు, రిజర్వాయర్ లు, ఆర్వో ప్లాంట్లు.
తురకపాలెం గ్రామం
మృతులంతా 50 ఏళ్ల లోపు వారే...
వైద్య బృందాలు ‘మెలియోడోసిస్’ను ప్రధాన అనుమానిత వ్యాధిగా భావిస్తున్నాయి. ఈ బ్యాక్టీరియా కలుషిత నీరు, దుమ్ము ద్వారా వ్యాపిస్తుంది. గ్రామ సమీపంలోని స్టోన్ క్రషర్లు, క్వారీలు ధూళిని పెంచి, తాగునీటి చెరువులను కలుషితం చేస్తున్నాయి. మృతుల్లో ఎక్కువ మంది పురుషులు. (సగటు వయసు 50), 80 శాతం మందికి మద్యం అలవాటు ఉంది. ఇది డయాబెటిస్, హైపర్ టెన్షన్ వంటి సమస్యలను తీవ్రతరం చేసి, ఇన్ఫెక్షన్‌కు ఆజ్యం పోస్తుందని వైద్యులు చెబుతున్నారు.
చికిత్స తర్వాత ఇంటికి వచ్చిన 20 రోజుల్లోపు మరణాలు సంభవించడం గమనార్హం. "బాగా తిరుగుతున్నవారు ఉన్నట్టుండి జ్వరం పాలై చనిపోతున్నారు" అని స్థానికులు వాపోతున్నారు. భయంతో రాత్రి 8 తర్వాత బయటకు రావడం లేదు, చుట్టాలు కూడా ఊరికి దూరమవుతున్నారు. కరోనా సమయంలో ఎంతటి భయంతో జనం వణికి పోయారో అవే పరిస్థితులు తురకపాలెంలో ఏర్పడ్డాయి.
తురకపాలెంలో పరిశుభ్రత, అవగాహన క్యాంపులు, సురక్షిత నీటి సరఫరా అవసరం. ప్రభుత్వం, సమాజం కలిసి పనిచేస్తేనే ఈ మరణ మృదంగాన్ని ఆపవచ్చు. తురకపాలెం గ్రామంలో సంభవించిన మరణాలకు ప్రధాన కారణం మెలియోడోసిస్ (Melioidosis) అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని వైద్య బృందాలు అనుమానిస్తున్నాయి. ఇది బుర్క్‌హోల్డేరియా సూడోమాలీ (Burkholderia pseudomallei) అనే బ్యాక్టీరియా వల్ల సంభవిస్తుందని, ఈ బ్యాక్టీరియా నేల, నిల్వ నీరు, తేమతో కూడిన ప్రాంతాల్లో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్
మెలియోడోసిస్ (Melioidosis) వల్ల ఆర్గానిక్స్ ఫెయిల్యూర్
ఈ బ్యాక్టీరియా వల్ల జ్వరం, దగ్గు, కీళ్ల నొప్పులు సంభవిస్తాయని, దీనివల్ల రోగనిరోధక శక్తి క్షీణించి ఆర్గాన్ ఫెయిల్యూర్‌కు దారితీస్తాయని వైద్యులు చెబుతున్నారు. డయాబెటిస్, కిడ్నీ, లివర్ సమస్యలు ఉన్నవారు, మద్యపానం అలవాటు ఉన్నవారు ఎక్కువ ప్రమాదంలో ఉంటారంటున్నారు. రక్త నమూనాలు సేకరించి పరీక్షలు జరుపుతున్నామని, ఫలితాలు 72 గంటల్లో వస్తాయని వైద్య విద్యా డైరెక్టర్ డా. రఘునందన్ తెలిపారు. ఇప్పటి వరకు 29 నమూనాలు పరీక్షించగా, రెండు కేసుల్లో మెలియోడోసిస్ ధృవీకరణ అయిందన్నారు. ఎటువంటి భయం అవసరం లేదు, IV యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తున్నామని వారు చెప్పారు.
వైద్యశాఖ ఉన్నతాధికారులతో తురకపాలెం మృతుల విషయమై చర్చిస్తున్న సీఎం చంద్రబాబు
అంతర్జాతీయ వైద్యుల సాయం తీసుకోండి: సీఎం
ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘ఎయిమ్స్ సహా కేంద్ర వైద్య బృందాలు రప్పించండి...అవసరమైతే అంతర్జాతీయ వైద్యుల సాయం తీసుకోండి... పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి, భూమి ద్వారా బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఉంది. అప్రమత్తంగా వ్యవహరించండి. తురకపాలెంలో అందరికీ సురక్షిత తాగునీరు అందించండి. పరిశుభ్రమైన వాతావరణం, ఆహారంపై అవగాహన కల్పించండి. ప్రతీ రోగిని వైద్య పర్యవేక్షణలో ఉంచాలి. హెల్త్ ప్రొఫైల్ నిరంతరం పర్యవేక్షించాలి. కొత్త కేసులు ఏమాత్రం నమోదుకాకూడదు. పరిస్థితులు నియంత్రణలోకి రావాలి... స్థానికుల్లో నమ్మకాన్ని పెంచాలి. జ్వరంతో బాధపడుతున్నవారి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి.’ అని సీఎం సూచించారు.
తురకపాలెం మృతులపై వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబుతో మాట్లాడుతున్న మంత్రి సత్యకుమార్
వైద్య మంత్రి ఏమన్నారు?
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గ్రామాన్ని సందర్శించి, జూలై నుంచి ఇప్పటి వరకు 23 మరణాలు సంభవించాయని అధికారికంగా ప్రకటించారు. కలుషిత నీరు కారణమని వివిధ కోణాల్లో చర్చలు జరుగుతున్నాయని, బ్యాక్టీరియా గురించి సమాచారం లేదని తెలిపారు. ఫీల్డ్ స్థాయి వైద్య సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకపోవడం దురదృష్టకరమని, వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. IAS అధికారి డా. అట్టడా సిరి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి, వైఫల్యాలు పరిశీలించి సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. గుంటూరు GGHలో బాధితులకు పూర్తి చికిత్స అందిస్తున్నామని చెప్పారు.
తురకపాలెంలో అసాధారణంగా నమోదైన మరణాల వివరాలను ఉన్నతాధికారులకు తెలియజేయడంలో జరిగిన సమాచార లోపంపై సమగ్ర విచారణ చేయిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు. కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎమ్మెల్యే రామాంజనేయులుతో కలిసి బాధితులను పరామర్శించారు. కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, వైద్య, ఆరోగ్య శాఖ ఆర్డీ డా.శోభారాణి, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డా.పద్మావతి, డీఎంహెచ్‌వో విజయలక్ష్మి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా.సుందరాచారి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.రమణ లు ఉన్నారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామంలో పర్యటించి బాధితులను పరామర్శించారు. తక్షణ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అధికారులతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు
ముఖ్యమంత్రికి అధికారులు ఏమి చెప్పారు...
తురకపాలెంలో ప్రస్తుతం ఉన్న కేసులను పరిశీలిస్తే ‘మెలియోయిడోసిస్’ లక్షణాలు ఉన్నట్టు వైద్యాధికారులు అనుమానం వ్యక్తం చేశారు. బ్లడ్ శాంపిల్స్ ల్యాబులకు పంపడం జరిగిందని... 72 గంటల్లో రిపోర్టులు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు అధికారులు చెప్పారు. పశుపోషణ పైనా ఎక్కువ మంది ఆధారపడటంతో పశువుల నుంచి ఏమైనా బ్యాక్టీరియా వ్యాప్తి చెందవచ్చనే కోణంలోనూ పరిశీలన జరుపుతున్నామన్నారు. తురకపాలెంలో డయాబెటిస్, హైపర్ టెన్షన్, కార్డియాక్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాధులు ఎక్కువుగా ఉన్నాయని... అలాగే అక్కడ ఆల్కహాల్ వినియోగం అధికంగా ఉందని, స్టోన్ క్రషర్లు ఆ ప్రాంతంలో ఎక్కువుగా ఉండటంతో వాతావరణ నాణ్యతను కూడా చెక్ చేస్తున్నామని వివరించారు. మొదట జ్వరం, దగ్గు, తర్వాత ఊపిరితిత్తులు దెబ్బతినడం వంటి లక్షణాలు ఎక్కువ మందిలో సాధారణంగా కనిపిస్తున్నాయని అధికారులు చెప్పారు. యాంటిబయాటిక్స్ ఆరు వారాలు నిరంతరాయంగా వాడటం వల్ల వ్యాధి నియంత్రణలోకి వస్తోందని చెప్పారు. దీనిపైన మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నామన్నారు. మైక్రోబయాలజీ డిపార్ట్‌మెంట్ కూడా పరిశోధన చేస్తోందని తెలిపారు.
బాధితులతో మాట్లాడుతున్న మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రఘునందన్
మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఏమన్నారు...
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు డిఎంఈ డాక్టర్ రఘునందన్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరాచారి, గుంటూరు డిఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, స్థానిక వైద్య నిపుణులు డాక్టర్ కళ్యాణ్ తురకపాలెం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మరణించినవారి కుటుంబ సభ్యుల్ని కూడా పరామర్శించారు.
తురకపాలెంలో డాక్టర్ రఘునందన్ విలేకరులతో మాట్లాడారు. '' ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య ఐదుగురు మరణించారు. ఏప్రిల్‌లో 2, మేలో 3, జూన్‌లో 2, జులైలో 10, ఆగస్టులో 10 చొప్పున మరణాలు నమోదయ్యాయి. ఈ నెలలో ఇప్పటి వరకు 3 మరణాలు జరిగినట్లు నమోదయ్యాయ్యాయని తెలిపారు. అంటే రఘునందన్ తెలిపిన ప్రకారం 35 మంది మరణించారు. వీరిలో ఏడుగురు వేర్వేరు సమయాల్లో గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. బీపీ, షుగర్, కిడ్నీల పనితీరు మందగించడం వంటి వ్యాధులు ఉన్న వారు మరణించిన వారిలో ఉన్నారు. 80 శాతం మంది వీరిలో పురుషులు. చనిపోయిన వారి సగటు వయస్సు 55 సంవత్సరాలు ఉంటుంది. ‘ఓ ప్రైవేట్ ఆసుపత్రి వారు రోగుల నుంచి సేకరించిన రక్త నమూనాలను పరీక్షించగా ఇద్దరు ‘మెలైడియోసిస్’ బారిన పడినట్లు గుర్తించారని మా దృష్టికొచ్చింది’ అని రఘునందన్ చెప్పారు.
గత నెలలో వేర్వేరు తేదీల్లో ఈ రెండు కేసులు వచ్చాయి. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ల్యాబ్ లో జరిగే పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాం. తురకపాలెం గ్రామంలో గత నెల 29 నుంచి వైద్య శిబిరం కొనసాగుతోంది. గ్రామ జనాభా 2,500 కాగా, వీరిలో ఇప్పటి వరకు 1,200 మందికి పరీక్షలు చేశాం. బుధవారం 42 మంది పరీక్షలు చేయించుకోగా వీరిలో ఎక్కువ మందిలో జ్వర పీడితులున్నారు. వీరు ఇళ్ల వద్దనే చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎక్కువ మందికి దగ్గు, కీళ్ల నొప్పులున్నాయి. స్థానికుల్లో 30 ఏళ్లు దాటిన వారిలో బీపీతో 30 శాతం, షుగర్ తో 10 శాతం మంది బాధపడుతున్నారు. ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ లో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉంది" అని డీఎంఈ డాక్టర్ రఘునందన్ వెల్లడించారు.
ప్రతిపక్షం ఏమని విమర్శించింది?
వైఎస్సార్ సీపీ నాయకులు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని బలంగా విమర్శించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు TDP నేతృత్వంలోని ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మరణాలు జరిగాయని ఆరోపించారు. కలుషిత తాగునీరు ప్రధాన కారణమని చెప్పారు. YSRCP డాక్టర్ల బృందం సందర్శించిందని, క్వారీ పిట్ల నుంచి వచ్చిన కలుషిత నీరు తీవ్ర ఇన్ఫెక్షన్లు, మల్టీ-ఆర్గాన్ ఫెయిల్యూర్‌కు దారి తీశాయని నిర్ధారించారు.
APCC అధ్యక్షురాలు YS షర్మిల కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంపై ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ నాయకులు అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ మృతుల కుటుంబాలను పరామర్శించి, స్థానికులతో మాట్లాడి కారణాలు అడిగి తెలుసుకున్నారు.
బాధితులతో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర నాయకులు బాబురావు
సీపీఎం బృందం పర్యటన
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు నేతృత్వంలో సీపీఎం ప్రతినిధి బృందం గుంటూరు జిల్లాలోని తురకపాలెం గ్రామాన్ని సందర్శించింది. గత మూడు నెలల్లో 50 మందికి పైగా వ్యాధులతో మరణించినట్లు తెలుస్తోందన్నారు. స్థానికులతో సీపీఎం బృందం సభ్యులు మాట్లాడారు. గ్రామంలో ఆందోళనకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మరణాలకు కారణాన్ని ఇంకా నిర్ధారించలేదని, ఇది భయాన్ని, అనిశ్చితిని సృష్టిస్తుందని బాబురావు అన్నారు.
గుంటూరు రూరల్ మండలంలోనే...
వైద్య రంగంలో గుంటూరు అభివృద్ధి చెందిన నగరం అయినప్పటికీ, తురకపాలెం గ్రామీణ ప్రాంతం కావడం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సరైన వైద్య సేవలు అందడం లేదు. ఫీల్డ్ స్థాయి వైద్య సిబ్బంది మరణాల గురించి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకపోవడం, సర్వేలు నిర్వహించకపోవడం ప్రధాన కారణాలు. మూడు వారాల ముందు ప్రైవేట్ ఆసుపత్రిలో మెలియోడోసిస్ ధృవీకరణ జరిగినా, ప్రభుత్వం స్పందించలేదు. గ్రామంలో పరిశుభ్రత లోపం, కలుషిత నీరు వంటి సమస్యలు తీవ్రమవడంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి.
ప్రైవేట్ ఆస్పత్రులను ఎందుకు ఆశ్రయించారు?
స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసం లేక, సరైన సమాచారం లేకపోవడం వల్ల ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించారు. చాలామంది ఆసుపత్రికి తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయిందని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో మెలియోడోసిస్ ధృవీకరణ జరిగినా, ప్రభుత్వ స్పందన ఆలస్యమైంది. వైద్యం చేయించుకుని తగ్గిందని భావించిన తరువాత ఇంటికి చేరుకున్న 20 రోజుల్లో మృతి చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారు?
ఇప్పటి వరకు గ్రామంలో ఎటువంటి వైద్య సేవలు అందాయి?
ఆగస్టు 29 నుంచి హెల్త్ క్యాంపుల ఏర్పాటు చేసి 1,200 మందికి స్క్రీనింగ్ టెస్ట్ లు చేశారు. 14 వైద్య బృందాలు ఏర్పాటై రక్తం, నీరు, మట్టి నమూనాలు సేకరించారు. GGHలో ఇద్దరు బాధితులకు చికిత్స జరుగుతోంది. AIIMS మంగళగిరి నిపుణుల సహాయం తీసుకుంటున్నారు.
హెల్త్ ఎమర్జెన్సీ
హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి, సెప్టెంబర్ 6-7న అందరికీ 42 పరీక్షలు చేసి హెల్త్ ప్రొఫైల్ తయారు చేశారు. అనారోగ్యంతో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించడం, సురక్షిత తాగునీరు సరఫరా, పరిశుభ్రతపై అవగాహన. నీరు, గాలి, మట్టి, ఆహారం పరీక్షలు సెంట్రల్ టీమ్ సహాయంతో జరుగుతున్నాయి.
స్థానికులను వీడని భయం
స్థానికులు భయంతో ఉన్నారు. "మా ఊరికి చుట్టాలు కూడా రావడానికి భయపడుతున్నారు. బాగా తిరుగుతున్నవారు ఉన్నట్టుండి జ్వరం పాలై మరణిస్తున్నారు" అని తురక దాసు చెప్పారు. రాత్రి 8 తర్వాత ఎవరూ బయటకు రావడం లేదు. గ్రామం మిస్టరీగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తురక సుబ్బారావు (మృతుడు బంధువు) మాట్లాడుతూ "మా అన్నయ్య ఆసుపత్రిలో చేరిన రెండు రోజుల్లో చనిపోయాడు. జ్వరం, దగ్గు, కీళ్ల నొప్పులతో బాధపడ్డాడు. డాక్టర్లు ఏం చెప్పలేదు. సరైన చికిత్స లేదు." అని బాధను వ్యక్తం చేశాడు. సుబ్బారావు వ్యాఖ్యలు ప్రభుత్వ ఆసుపత్రులపై స్థానికులకు విశ్వాసం లేదని తెలియజేస్తున్నాయి. వైద్య సేవల్లో లోపాలను సూచిస్తున్నాయి. చికిత్స ఆలస్యం, సరైన రోగ నిర్ధారణ లేకపోవడం మరణాలకు కారణమై ఉండవచ్చు.
రాము (స్థానిక రైతు) మాట్లాడుతూ "మా గ్రామంలోకి డాక్టర్లు రాక చాలా సంవత్సరాలైంది. ఏదైనా జబ్బు వస్తే గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తాం. ఇక్కడ PHCలో ఎవరూ సరిగ్గా చూడరు." అని తెలిపారు. దీనిని బట్టి రాము వ్యాఖ్యల ప్రకారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC) నిర్వహణలో లోపాలను, స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రులపై ఆధారపడటాన్ని తెలియజేస్తున్నాయి. గుంటూరు సమీపంలో ఉన్నప్పటికీ, గ్రామీణ వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం గమనార్హం.