ఆ ఐపీఎస్‌ల సస్పెన్షన్ లను పొడిగించిన కూటమి ప్రభుత్వం

ముంబాయి సినీ నటి కాదంబరి జెత్వాని వేధింపుల కేసులో ఇప్పటికే వీరు సస్పెన్షన్‌లో ఉన్నారు.;

By :  Admin
Update: 2025-03-12 13:56 GMT

కూటమి అధికారంలో వచ్చిన తర్వాత కొంత మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను టార్గెట్‌ చేసుకుని వారి మీద చర్యలకు ఉపక్రమించింది. దీని కోసం ముంబాయి సినీ నటి కేసును తెరపైకి తెచ్చింది. ముంబాయి సినీ నటి కాదంబరి జెత్వానిని వేధింపులకు గురి చేశారని కేసులు నమోదు చేశారు. అందులో భాగంగా ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను సస్పెండ్‌ చేశారు. అందులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో విజయవాడ పోలీసు కమిషనర్‌గా పని చేసిన కాంతి రాణా టాటాతో డీసీపీగా పని చేసిన విశాల్‌ గున్నీలు ఉన్నారు. వీరితో పాటుగా మరో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, నాడు నిఘా విభాగం అధిపతిగా పని చేసిన అదనపు డీజీ ర్యాంకులో ఉన్న పీ సీతారామాంజనేయులు కూడా సస్పెండ్‌ అయిన ఐపీఎస్‌ అధికారుల జాబితాలో ఉన్నారు.

మరో సారి వీరి సస్పెన్షన్‌ తాజాగా తెరపైకి వచ్చింది. వీరి సస్పెన్షన్‌ పొగించాలని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ ముగ్గురు అధికారుల సస్పెన్షన్‌ను మరో ఆరు నెలలు పాటు పొడిగించారు. గతంలో సస్పెండ్‌ చేసిన గడువు ముగియడంతో వీరి సస్పెన్షన్‌ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు 25 వరకు వీరి సస్పెన్‌ను పొడిగిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తప్పుడు కేసులో ముంబాయి సినీ నటి కాదంబరి జెత్వానిని అరెస్టు చేసి, వేధింపులకు గురి చేశారనే అభియోగాలతో పాటు అఖిల భారత సీర్వసు నిబంధనలను ఈ ముగ్గురు అధికారులు ఉల్లంఘించారనే అభియోగాల మీద ఏర్పాటు చేసిన రివ్యూ కమిటీ ఇచ్చిన సిఫార్సు మేరకు ఈ ముగ్గురు ఐపీఎస్‌ అధికారుల సస్పెన్షన్‌లను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే మరో సీనియర్‌ అధికారి పీవీ సునీల్‌ కుమార్‌ మీద కూడా దృష్టి పెట్టింది. జగన్‌ ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్‌గా పని చేసిన పీవీ సునీల్‌ కుమార్‌ను కూటమి ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. నాటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు హత్యాయత్నం కేసులో తనను అరెస్టు చేసే సమయంలోను, విచారణ సమయంలోను తన పట్ల సునీల్‌ కుమార్‌ కీలక పాత్ర పోషించారని గుంటూరు నగరపాలెం పోలీసు స్టేషన్‌లో రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు సునీల్‌కుమార్‌ మీద కేసు నమోదు చేశారు.
దీంతో పాటుగా డీజీ ఫైర్‌ సర్వీసెస్‌లో కూడా అక్రమాలకు పాల్పడ్డారని సునీల్‌ కుమార్‌ మీద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా అఖిల భారత సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారని, అనుమతులు లేకుండా విదేశాల పర్యటనలకు వెళ్లారని దీనిని నిగ్గు తేల్చాని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఆర్‌పీ సిసోడియా నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అఖిల భారత సర్వీసు నిబంధలకు విరుద్ధంగా పీవీ సునీల్‌ కుమార్‌ వ్యవహరించారని తేల్చింది. ఆ మేరకు ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా పీవీ సునీల్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నలుగురు ఐపీఎస్‌ అధికారులు వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో జగన్‌కు అనుకూలంగా పని చేశారని, చంద్రబాబు, లోకేష్‌తో పాటు ఇతర టీడీపీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేసిందనే కారణంతో కూడా వీరి మీద కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందనే వాదన కూడా పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పీ సీతారామాంజనేయులు, పీవీ సునీల్‌కుమార్, కాంతి రాణా టాటా, విశాల్‌ గున్నీలను సస్పెండ్‌ చేసిందనే చర్చ కూడా పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది.
Tags:    

Similar News