రాష్ట్ర సచివాలయంలోని మంత్రి సత్యకుమార్ ఛాంబరులో మంత్రి, అసోసియేషన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. ప్రభుత్వ బకాయిలను వన్ టైం కింద చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. ఆశా ప్ర‌తినిధుల‌నుద్దేశించి మంత్రి మాట్లాడుతూ...." ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడుతో స‌మ‌స్య‌ల ప‌రిష్కారం గురించి ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చించాను. వ‌న్ టైం చెల్లింపు విధానంలో స‌మ‌స్య శాశ్వ‌త ప‌రిష్కారానికి సిఎం సిద్ధంగా ఉన్నారు. వ‌న్ టైం చెల్లింపు విధానం అమ‌ల్లోకొచ్చేలోగా మ‌రో రూ.250 కోట్లు చెల్లించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటా. యూనివర్శల్ హెల్త్ పాలసీ కింద తీసుకునే నిర్ణయాల్లో సంఘం ప్రతినిధులను భాగస్వాములను చేస్తా. పెండింగులో ఉన్న ఆసుపత్రుల బిల్లుల పరిశీలనలకు యుద్ధప్రతిపాదికన సుమారు 50 మంది వైద్యులను నియమిస్తున్నాం. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున రోగుల ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ను దృష్టిలో ఉంచుకుని వెంటనే వైద్య సేవలను కొనసాగించాలి " అని తెలిపారు.
2 విడతల్లో ఇప్పటికే రూ.488 కోట్లు చెల్లింపు
బకాయిలను వెంటనే వెల్లించాలని కోరుతూ అక్టోబరు 10 నుంచి డాక్ట‌ర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు సేవలు నిలిపివేశాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు మంత్రి శ్రీ సత్యకుమార్ చొరవతో ప్రభుత్వం రెండు విడతల్లో కలిపి రూ.488 కోట్లు విడుదలచేసింది. మరో విడత కింద రూ.250 కోట్లు చెల్లించేందుకు చ‌ర్య‌లు మొద‌లయ్యాయి. . మిగిలిన బ‌కాయిల‌ను నెట్వ‌ర్క్ ఆసుప‌త్రుల‌కు ప్ర‌భుత్వం బ్యాంకుల నుండి పొందిన రుణాల ద్వారా వ‌న్ టైం విధానంలో చెల్లించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.
కూటమి ప్రభుత్వం చెల్లించిన మొత్తం రూ. 4,143 కోట్లు
కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినప్పట్నించి ఇప్పటివరకు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు తరపున ఆసుపత్రులకు రూ. 4,143 కోట్లు చెల్లింపులు జరిగాయి. ఇందులో గత వైకాపా ప్రభుత్వ బకాయిలు రూ.2,403.92 కోట్లున్నాయి. అలాగే కూట‌మి ప్ర‌భుత్వం హ‌యంలో ట్ర‌స్టు ద్వారా జ‌రిగిన వైద్య సేవ‌ల‌కైన మొత్తంలో రూ. 1739.28 కోట్లు చెల్లించింది. ప్ర‌స్తుతానికి చెల్లించాల్సిన బ‌కాయిల విలువ రూ.2,500 కోట్ల వ‌ర‌కు ఉంది. మంత్రితో ఆశా ప్ర‌తినిధులు జ‌రిపిన చ‌ర్చ‌ల్లో డాక్ట‌ర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్ర‌స్టు సిఇఓ దినేష్ కుమార్ పాల్గొన్నారు.