జగన్ ను చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోంది
వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నాజనం ప్రభజనం సృష్టించారన్నభూమన;
By : V V S Krishna Kumar
Update: 2025-07-10 11:20 GMT
మామిడి రైతులకు అండగా నిలిచేందుకు, వారి సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జగన్ బంగారుపాళ్యం వస్తే, కూటమి ప్రభుత్వం భయపడిపోయిందని వైసీపీ నేత ,టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.జగన్ పర్యటనను అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం అన్ని విధాలా ప్రయత్నించిందని, భయానక వాతావరణం సృష్టించిందని ఆయన ఆరోపించారు.
"మా నాయకులకు నోటీసులు ఇచ్చారు. పలువురిని గృహ నిర్బంధం చేశారు. బంగారుపాళ్యం వెళ్లే అన్ని దారుల్లో అడ్డంకులు సృష్టించారు. అయినా జగన్ అంటే జనం అని మరోసారి నిరూపితమైంది. గుట్టలు, కొండలు దాటుకుని ప్రజలు, రైతులు జగన్‌ను చూసేందుకు తరలివచ్చారు. ఈ జన ప్రవాహం చూశాక కూటమి ఓటమి ఖరారైంది" అని భూమన పేర్కొన్నారు.జగన్ పర్యటనలో ప్రభుత్వం హిట్లర్ కాలం నాటి నాజీ పాలనను తలపించేలా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వ తీరుకు నిరసనగా రైతులు రోడ్లపై మామిడికాయలు పారబోసి తమ కడుపుమంటను వెళ్లగక్కారని భూమన తెలిపారు.మామిడి రైతులకు అండగా నిలవడానికి జగన్ పర్యటన ఖరారైన తరువాతనే ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. కిలో మామిడికి 6రూపాయలు అదనంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని కరుణాకర్ రెడ్డి అన్నారు. జగన్ పర్యటన ఒక సెట్టింగ్ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను భూమన ఖండించారు.రైతులపై కూడా పోలీసులు లాఠీచార్జ్ చేయడం దారుణమని వ్యాఖ్యానించారు.