పిలుపు కోసం.. ఆవావహుల నిరీక్షణ..
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ప్రమాణస్వీకారం గడువు సమీపిస్తోంది. మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఎవరి పరిధిలో వారు లాబీయింగ్ ప్రారంభించారని సమాచారం.
By : SSV Bhaskar Rao
Update: 2024-06-09 07:16 GMT
ఎన్నికలు ముగిశాయి. ప్రమాణస్వీకారమే ఇక మిగిలి ఉంది. రాయలసీమ జిల్లాల్లో గెలిచిన సీనియర్లు తక్కువ. కొత్తగా గెలిచిన వారే ఎక్కువ మంది ఉన్నారు. రాష్ర్ట మంత్రివర్గంలో ఎవరికి అవకాశం దొరుకుతుందో చర్చలు అప్పుడే ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా కొందరు టీడీపీ చీఫ్ ఎన్. చంద్రబాబు, చినబాబు నారా లోకేష్ కు టచ్ లోకి వెళ్లడానికి తాపత్రయపడుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో 52 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో వైఎస్ఆర్ సీపీ గెలుచుకుంటే, టీడీపీ అత్యధికంగా 41 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. తిరుపతి లో ఆరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరు రిజర్వుడు స్థానం నుంచి అరవ శ్రీధర్, జమ్మలమడుగు నుంచి సీ. ఆదినారాయణరెడ్డి, అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి బీజేపీ జాతీయ కార్యదర్శి ఏ.సత్యకుమార్, కర్నూలు జిల్లా ఆదోని నుంచి పార్థసారథి విజయం సాధించారు. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ అసలు ఖాతా కూడా తెరవలేదు.
చిత్తూరులో ఎవరికి?
చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఎన్. చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాలో 14 స్థానాలు ఉంటే 12 సెగ్మెంట్లలో టిడిపి విజయం సాధించింది. ఇందులో చంద్రబాబుతో సహా నలుగురు కమ్మ సామాజికవర్గం వారు కాగా, నలుగురు రెడ్డి, ముగ్గురు ఎస్సీలు, ఒకే ఒక ముస్లిం అభ్యర్థి మదనపల్లె నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఈ జిల్లాలో పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమరనాథరెడ్డి సీనియర్. ఆరంభం నుంచి టిడీపీలో ఉన్న ఈయన వైఎస్ఆర్ సీపీ నుంచి 2014 ఎన్నికల్లో విజయం సాధించినా, ఆ తరువాత టిడిపిలో చేరడం ద్వారా మంత్రి పదవి దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈయనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే విషయంలో జిల్లాలో చర్చ జరుగుతోంది. మదనపల్లె నుంచి షేక్ షాజహాన్, సత్యవేడు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి కోనేటి ఆదిమూలం రెండోసాగి గెలిచిన వారిలో ఉన్నారు. పూతలపట్టు, కాళహస్తి, చంద్రగిరి, గంగాధర నెల్లూరు, పీలేరు, నగరి, చిత్తూరు నుంచి మొదటిసారి గెలిచిన వారే. కాగా, తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి ఆరణి శ్రీనివాసులు జనసేన నుంచి విజయం సాధించిన వారిలో ఉన్నారు. వారిలో ఒకనాటి తన సన్నిహిత సహచరుడు బొజ్జల గోపాల క్రిష్ణారెడ్డి కుమారుడు శ్రీకాళహస్తి నుంచి సుధీర్ రెడ్డి విజయం సాధించారు. ఈయనకు మంత్రి పదవి దక్కే అవకాశాలను పార్టీవర్గాలు తోసిపుచ్చడం లేదు. అలాగే నగరిలో మాజీ మంత్రి ఆర్కే. రోజాను ఓడించడంతో పాటు రాజకీయ నేపథ్యం ఉన్నకుటుంబం, మాజీ మంత్రి గాలి ముద్దు క్రిష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్ కు ఉన్న అవకాశాలను కూడా తోసిపుచ్చడం లేదు. కులాల సమీకరణలు పరిశీలిస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెడ్డి సామాజికవర్గం, ఎస్సీల్లో ఒకరికి అవకాశం లభించవచ్చని భావిస్తున్నారు.
కడప ఖిల్లాలో..
తాజా మాజీ సీఎం వై.ఎస్. జగన్ మోహనరెడ్డి సొంత జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే, టీడీపీ ఏడు నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగుర వేసింది. వారిలో నంద్యాల వరదరాజుల రెడ్డి (82) జిల్లాలోనే సీనియర్ ఎమ్మెల్యే. ఇప్పటికి ఆయన ప్రొద్దుటూరు నుంచి 1985 నుంచి 2009 వరకు ఆయన అయిదుసార్లు గెలిచి రికార్డు సాధించారు. 2009 మొదటిసారి ఓటమి చెందారు. ఆ తరువాత టీడీపీలో చేరిన వరదరాజులరెడ్డి గత రెండు ఎన్నికల్లో ఓటమి చెందిన ఆయన 2024 ఎన్నికల్లో విజయం సాధించారు. కడప నుంచి 30 ఏళ్ల తరువాత కడప అసెంబ్లీ స్థానం నుంచి ముస్లిమేతర వ్యక్తి, ఓ మహిళ ఆర్. మాధవిరెడ్డి విజయం సాధించి, రికార్డు సాధించారు. ఈమెతో పాటు కమలాపురంలో సీఎం వైఎస్. జగన్ మేనమామను ఓడించిన పుత్తా చైతన్యరెడ్డి, రాయచోటిలో మండిపల్లి రాంప్రసాదరెడ్డి, మైదుకూరు పుట్టా సుధాకరయాదవ్ మొదటిసారి విజయం సాధించిన వారే. జమ్మలమడుగు నుంచి బీజేపీ నుంచి గెలిచిన సీ. ఆదినారాయణరెడ్డి గతంలో టీడీపీలో చేరినప్పడు మంత్రిగా పనిచేశారు. రైల్వేకోడూరు నుంచి జనసేన పార్టీ నుంచి అరవ శ్రీధర్ కూడా మొదటిసారి విజయం సాధించారు. ఇదిలావుండగా, మాజీ సీఎం వైఎస్. జగన్ కు చెక్ పెట్టే దిశగా చంద్రబాబు నాయుడు ఆలోచన ఉంటుందనడంలో సందేహం లేదు. అందులో ప్రధానంగా పులివెందులలో వైఎస్. జగన్ తో అలుపెరగని పోరాటం సాగిస్తున్న బీ.టెక్ రవికి ప్రొటోకాల్ పదవి ఇచ్చే అవకాశం లేకపోలేదు. గతంలో కూడా ఆర్. సతీష్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయడంతో పాటు మండలిలో డెప్యూటీ చైర్మన్ చేయడం, ఎన్.టీ. రామారావు కాలంలో కూడా ఎన్. తులసిరెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం ద్వారా కూడా అప్పట్లో ఎన్.టీ.ఆర్. పులవెందులో వైఎస్. రాజశేఖరెడ్డికి చెక్ పెట్టడానికి వ్యూహం అమలు చేశారు. తాజాగా కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం లేకపోలేదనేది టీడీపీ వర్గాల విశ్లేషణ. అందువల్ల కడప జిల్లాలో మైదుకూరు మినహా టీడీపీ అభ్యర్థులు గెలిచిన నాలుగు స్థానాల్లో రెడ్డి సామాజికవర్గం వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వారిలో నంద్యాల వరదరాజులరెడ్డి లేదా మాధవీరెడ్డికి అవకాశం ఉంటుందని ఆ జిల్లా పార్టీ నేతల ద్వారా ఈ సమాచారం. ఎన్నికల వేళ రాయలసీమలో ట్రబుల్ షూటర్ గా పనిచేసిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది.
బీజేపీలో.. జనసేనలో ఎవరు..?
రాయలసీమ ప్రాంతంలో బీజేపీ నుంచి కడప జిల్లా జమ్మలమడుగు నుంచి ఆదినారాయణరెడ్డి, అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి బీజేపీ జాతీయ కార్యదర్శి ఏ. సత్యకుమార్ విజయం సాధించారు. మిత్రధర్మాన్ని పాటించి ఆ పార్టీకి మంత్రివర్గంలో అవకావం కల్పిస్తే సత్యకుమార్ కు ఛాన్స్ ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. జనసేన నుంచి చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి అందరి అంచనాలను తలకిందులు చేసి, టీడీపీ, బీజేపీ నేతల సమష్టి పనితీరు వల్ల ఆరణి శ్రీనివాసులు విజయం సాధించారు.
అనంతలో ..
అనంతపురం జిల్లాలో 14 స్థానాలను టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ జిల్లాలో రాప్తాడు అసెంబ్లీ స్థానం నుంచి మాజీ మంత్రి పరిటాల సునీతమ్మ విజయం సాధించారు. ఈమెతో పాటు ఉరవకొండ నుంచి సీనియర్ పయ్యావుల కేశవ్, రాయదుర్గం నుంచి కాలువ మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు... వీరిలో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందనే విషయంలో జోరుగా చర్చ జరుగుతోంది.
కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే టీడీపీ 12 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. వారిలో నంద్యాల నుంచి ఎన్ఎండీ. ఫరూఖ్, ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ సీనియర్లు , మాజీ మంత్రులు కూడా. వారిద్దరి విషయంలో పీటముడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ. జనార్థనరెడ్డి, డోన్ నుంచి విజయం సాధించిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాశరెడ్డి పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
ముస్లింలో ఎవరికి...
ఈ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి ముగ్గురు మాత్రమే ముస్లిం సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వారిలో కర్నూలు జిల్లా నంద్యాల నుంచి ఎన్.ఎం.డీ ఫరూఖ్, చిత్తూరు జిల్లా మదనపల్లె నుంచి షేక్ షాజహాన్, గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి నాసిర్ విజయం సాధించారు. వారందరిలోకి ఫరూఖ్ సీనియర్. మంత్రిగా, ఉమ్మడి రాష్ర్టంలో డిప్యూటీ స్పీకర్ గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. కానీ, కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఫరూఖ్, భూమా అఖిలప్రియ మధ్య వైరుధ్యం ఉందనే విషయం టికెట్ల కేటాయింపులోనే బట్టబయలైంది. ఈ పంచాయతీకి చంద్రబాబు చెక్ పెట్టేవిధంగా ఎలాంటి చతురత పాటిస్తారనేది వేచిచూడాలి. ముస్లిం మైనారిటీలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇవ్వక తప్పదు. మొదటిసారి ఒక సీనియర్క్ ఇవ్వడం ద్వారా మళ్లీ మార్పులకు అశకాశం ఉంటుందనే భావన వ్యక్తం అవుతోంది.
నెల్లూరు జిల్లాలో సీనియర్, మాజీ మంతులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి మంత్రి రేసులో ఉంటే, పట్టుబట్టి టికెట్ సాధించడంతో పాటు ఎట్టకేలకు చిరకాల రాజకీయ ప్రత్యర్థి కాకాణి గోవర్థనరెడ్డిపై విజయం సాధించిన సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, నెల్లూరు రూరల్ నుంచి విజయం సాధించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా క్యూలో ఉన్నట్టు సమాచారం. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో 11 ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో తొమ్మది మంది టీడీపీ అభ్యర్థులే. ఒకరు జనసేన నుంచి విజయం సాధించారు. వారందరిలో రెండు సార్లు గెలిచిన వారిలో కోనేటి ఆదిమూలం (సత్యవేడు) సీనియర్. వారిలో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందనే విషయంలో ఉత్కంఠ ఏర్పడింది.