రానున్నది ఏఐ ఇండస్ట్రియల్‌ రివల్యూషన్‌!

ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ ద్వారా మనం ఎదుర్కొంటున్న ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని ఐటీ, మానవ వనరుల శాఖామంత్రి నారా లోకేష్‌ అన్నారు.;

Update: 2025-08-29 12:22 GMT
మాట్లాడుతున్న మంత్రి లోకేష్‌

విశాఖపట్నంలో శుక్రవారం ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌కు సంబంధించిన రెండు వేర్వేరు కార్యక్రమాల్లో మంత్రి నారా లోకేష్‌ పాల్గొన్నారు. మధురవాడ చంద్రంపాలెం జెడ్పీ హైస్కూలులో సెయింట్‌ ఏఐ ల్యాబ్స్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం విశాఖ రాడిసన్‌ బ్లూ హోటల్‌లో ఐటీ సంస్థ సెయింట్‌ ఫైండేషన్‌ రూ.8 కోట్లతో విశాఖ జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఏఐ ల్యాబ్స్,ఓబోటిక్స్‌ ల్యాబ్స్, స్టెమ్‌లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఏమన్నారంటే?


విద్యార్థులతో ముచ్చటిస్తున్న లోకేష్‌

‘రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ) ఇండస్ట్రియల్‌ రివల్యూషన్‌ రాబోతోంది. మనం ఎదురొంటున్న ఏ సమస్యకైనా ఏఐ పరిష్కార మార్గం చూపుతుంది. ఈ ఏఐ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలి. మిమల్ని (బడి పిల్లలను) చూస్తుంటే నా స్కూల్‌ డేస్‌ గుర్తుకొస్తున్నాయి. నేను కూడా మీలా రౌడీనే. మీలో ఎవరెవరు ఇంజినీర్లు, డాక్టర్లు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, టీచర్లు, రాజకీయ నేతలు కావాలనుకుంటున్నారో చేతులెత్తండి. ఎంతమంది ఎంట్రప్రెన్యూర్స్‌ కావాలనుకుంటున్నారు? ఎంట్రప్రెన్యూర్స్‌ అంటే ఉద్యోగాలిచ్చే వ్యక్తి. ఈ రోజు మనం ఇక్కడ సమావేశం కావడానికి కారణం బీవీ మోహన్‌రెడ్డి. గురువు గారు నన్ను చిన్నప్పట్నుంచి చూవారు. నా అల్లరి పనులనూ చూశారు. 1991లో సెయింట్‌ అనే కంపెనీకి ఆనాడు ఇన్ఫోటెక్‌ అనే పేరుండేది. బీవీ మోహన్‌రెడ్డిని అందరూ ఇన్ఫోటెక్‌ మోహన్‌రెడ్డి అనే పిలిచేవారు. 1991లో ఇప్పుడున్న సెయింట్‌ కంపెనీని స్థాపించి ఈ రోజు 16 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. కేవలం మన దేదశంలోనే కాకుండా 22 దేశాల్లో ఆయన ఈ కంపెనీని నడుపుతున్నారు. ఆయన కంపెనీ సీఎస్సార్‌ నిధుల నుంచి రూ.8 కోట్లు కేటాయించి 50 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశారు. పాఠశాల విద్య బలోపేతానికి అడ్వైజరీ కౌన్సిల్‌కు మోహన్‌రెడ్డి చైర్మన్‌గా ఉండాలని కోరుతున్నాను.

ఏఐ ల్యాబ్‌ను ఆవిష్కరిస్తున్న లోకేష్, సెయెంట్‌ చైర్మన్‌ మోహన్‌రెడ్డి తదితరులు 

విద్యార్థులే మన భవిష్యత్తు..
విద్యార్థులే మన భవిష్యత్తు, ఆస్తి, సంపద. ఏఐ వల్ల మనకేంటి ఉపయోగం అని అందరూ అనుకోవచ్చు. గతంలో పారిశ్రామిక విప్లవం వల్ల అనేక మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఐటీ వల్ల దేశం, ప్రపంచంలో తెలుగు వారికి మెరుగైన అవకాశాలు లభించాయి. ఇకపై ఏఐలోనూ ఇండస్ట్రియల్‌ రివల్యూషన్‌ రాబోతోంది. మారుతున్న కాలానికనుగుణంగా మన కరిక్యులంలోనూ, ల్యాబ్స్‌లోనూ మార్పులు రావాలి. అందుకే ప్రభుత్వం పాఠ్య పుస్తకాల నుంచి పరీక్షా విధానం వరకు అనేక సంస్కరణలను తీసుకొచ్చింది. ఇండస్ట్రీ రివల్యూషన్‌లో ప్రింటింగ్‌ప్రెస్‌ కీలక పాత్ర పోషించింది. ఎలక్ట్రిసిటీ, ఆటోమోటివ్, విమానాలు, వ్యాక్సిన్లు రావడం వంటి అనేక పరిణామాల వల్ల మనం ముందుకెళ్లే పరిస్థితి. అలాంటి టెక్నాలజీ ఈరోజు మనకు చూపిస్తోంది.
ఏఐతో మొక్కలకు నీరందించిన విద్యార్థులు
ఏఐని వినియోగించి నీటిని మొక్కలకు ఎలా అందించవచ్చో మంత్రి లోకేష్‌ సమక్షంలో విద్యార్థులు చూపించారు. ఈ సందర్భంగా ఈ విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ జీవితంలో అందరూ ఓ లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని సాధించడానికి అహర్నిశలు కృషి చేయాలని సూచించారు. లక్ష్యాన్ని సాధించలేకపోతే బాదపడకూడదన్నారు. ఓటమి మనలో కసిని పెంచాలని, అనుకున్నది సాధించే వరకు విశ్రమించరాదని హితవు పలికారు. ‘2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాను. ఆరోజు నాకు బాధ, ఆవేదన కలిగింది. రెండో రోజు నుంచి నాలో కసి పెరిగింది. ఐదేళ్లు అక్కడే కష్టపడి 91 వేల ఓట్ల మెజార్టీతో గెలిచాను. విద్యాశాఖ వద్దని చాలామంది నాకు చెప్పారు. కానీ ఆ శాఖ తీసుకుని మార్పు తీసుకొస్తానని చెప్పా. నేను మంత్రి అయ్యేనాటికి విద్యాశాఖలో సరైన సమాచారం కూడా లేదు. ఎన్ని స్కూల్స్‌ ఉన్నాయో? ఏ టీడరు ఏ స్కూలులో పాఠాలు చెబుతున్నారో, ఎంతమంది ఏ స్కూలులో చదువుతున్నారో కూడా తెలియదు. ఆ స్థితి నుంచి ప్రభుత్వ విద్యలో ఎన్నో సంస్కరణల స్థాయికి తీసుకొచ్చాం. ఉపాధ్యాయుల సహకారంతోనే సంస్కరణలు తీసుకురాగలిగాం. దక్షణాదిలో లెర్నింగ్‌ అవుట్‌కమ్స్‌ సగటులో ఏపీ దిగువన ఉంది. దీనిని పెంచాల్సిన అవసరం ఉంది.’ అని వివరించారు.
కొత్త టీచర్లు సెప్టెంబరులో విధుల్లోకి..
డీఎస్సీ ద్వారా ఎంపికైన టీచర్లు సెప్టెంబరు నాటికి విధుల్లో చేరతారు. మెగా పీటీఎం కూడా నిర్వహించాం. డిసెంబరులో రెండో పీటీఎం కూడా నిర్వహిస్తాం. పిల్లలకు ఇచ్చే పుస్తకాల్లో ఎక్కడా రాజకీయ నేతల ఫోటోలు లేవు. పాఠశాల అనేది పవిత్రమైన ఆలయం. వాటిని రాజకీయాలకు దూరంగా ఉంచాలనేదే మా లక్ష్యం. బాగా చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నా. సమాజంలో మార్పు సాధించేందుకు వీరు రాజకీయాల్లోకి రావాలి’ అని ఆకాంక్షించారు.
Tags:    

Similar News