అందుకే.. ఏపీలో నో ఎగ్జిట్‌ పోల్స్‌

ఏడు దశల్లో ఎన్నికల నిర్వహణ. ఏపీలో పూర్తి అయినా దేశ వ్యాప్తంగా కొనసాగుతోన్న ప్రక్రియ. పూర్తి అయిన తర్వాతే ఎగ్జిట్‌ పోల్స్‌.

Update: 2024-05-16 12:07 GMT

ఆంధ్రప్రదేశ్‌లో అందరి చూపులు ఎగ్జిట్‌ పోల్స్‌పైనే. కానీ వాటిని ఇప్పట్లో ప్రకటించ కూడదు. ఎందుకంటే దేశ వ్యాప్తంగా ఎన్నికలు పూర్తి అయ్యేంత వరకు ప్రకటించ కూడదని ఎన్నికల సంఘం ఇది వరకే ఆదేశించింది. దీంతో ఎన్నికల నిర్వహణ కంప్లీట్‌ అయినా స్పష్టమైన అంచనాలతో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడి పోతారు అనే అంశాలపై ఖచ్చితంగా చెప్ప లేక పోతున్నారు. పెరిగిన ఓటింగ్‌ ఎవరికి అనుకూలం, ఎవరికి అననూకూలం తదితర అంశాలతో కేవలం విశ్లేషణలు, ఊహా గానాలతో మాట్లాడుతున్నారే కానీ క్లారిటీ ఇవ్వ లేక పోతున్నారు. దానికి కారణం ఎగ్జిట్‌ పోల్స్‌కు అనుమతులు లేక పోవడమే.

ధీమా ఉన్నా లోపల టెన్షన్‌
ఎన్నికలు నిర్వహించిన ప్రతి సారి పోలింగ్‌ అయిపోయిన రెండు, మూడు గంటల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటించే వారు. రకరాల సంస్థలు, వారు జరిపిన సర్వేల ఆధారంగా ఎగ్జిట్‌ పోల్స్‌ వివరాలు విడుదల చేసే వారు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడి పోతారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి వంటి వివరాలను ఎగ్జిట్‌ పోల్స్‌ ద్వారా వెల్లడించే వారు. దీంతో రాష్ట్రంలో ఎవరు గెలుపు ఓటములపైన ఒక అంచనా వచ్చేవారు. కానీ ఈ సారి పరిస్థితి అలా లేదు. ఎగ్జిట్‌ పోల్స్‌కు అనుమతులు లేక పోవడంతో మూడు రోజుల క్రితమే ఎన్నికలు పూర్తి అయినా గెలుపు ఓటములపై ఎవ్వరూ స్పష్టత ఇవ్వ లేక పోతున్నారు. ఎవరికి వారు ధీమాగా ఉన్నా లోపల మాత్రం టెన్షన్‌తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల్లోను ఉత్కంఠ నెలకొంది.
జూన్‌ 1తో ప్రక్రియ పూర్తి
ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఎన్నికలు పూర్తి అయ్యాయి. కానీ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇంకా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు దశలు మాత్రమే పూర్తి అయ్యాయి. ఏప్రిల్‌ 19న తొలి విడత ఎన్నికలు నిర్వహించారు. ఏప్రిల్‌ 26న రెండో విడత, మే 7న మూడో విడత, మే 13న నాలుగో విడత, మే 20న ఐదు, మే 25న ఆరు, జూన్‌ 1న ఏడో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఏడు దశల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం తదితర రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణతో పాటు మరో 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పార్లమెంట్‌ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి దశ కింద 21 రాష్ట్రాల్లోని 102 లోక్‌ సభ స్థానాలకు, రెండో దశ కింద 13 రాష్ట్రాల్లోని 89, మూడో దశ కింద 12 రాష్ట్రాల్లోని 94, నాలుగో దశ కింద 10 రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించారు. ఐదో దశ కింద 8 రాష్ట్రాల్లోని 49 లోక్‌ సభ స్థానాలకు, ఆరో దశ కింద 7 రాష్ట్రాల్లోని 57, ఏడో దశ కింద 8 రాష్ట్రాల్లోని 57 పార్లమెంట్‌ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
మొత్తం ఏడు దశల్లో ఎన్నికల నిర్వహణ పూర్తి అయిన తర్వాత మాత్రమే ఎగ్జిట్‌ పోల్స్‌కు ఎన్నికల సంఘం అనుమతులిచ్చింది. అంటే తొలి దశ కింద ఏప్రిల్‌ 19న ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్‌ ఏడో దశ కింద జూన్‌ 1న సాయంత్రం 6 గంటలతో ముగుస్తుంది. అప్పటి వరకు ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం విధించింది. అంటే ఆరోజు సాయంత్రం ఆరున్నర గంటల వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించకూడదని గడువు విధించింది. మధ్యలో ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల చేసే అది తర్వాత దశలో జరిగే ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లపై ప్రభావం చూపించే చాన్స్‌ ఉందనే ఉద్దేశంతో ఎగ్జిట్‌ పోల్స్‌ను నిషేధించింది.
ఒక వేళ ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించి ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల చేస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. దీని ప్రకారం జ్యోతిష్యులతో పాటు రకరకాల పద్దతుల్లో గెలుపు, ఓటమలుపై అంచనాలు వేసి వారితో కూడా ముందస్తు ఊహగానాలు కూడా వెల్లడించడం కూడా నిషేధమే.
Tags:    

Similar News