అందుకే నక్సలైట్లు నాపై అలిపిరిలో దాడి చేశారు

మా ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పేదానిలో మంచి ఉంటే పాటించండి అని సీఎం చంద్రబాబు జిల్లా ఎస్పీలకు సూచించారు.;

Update: 2025-09-13 14:46 GMT

ఉమ్మడి రాష్ట్రంలో రౌడీయిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని, నక్సలిజాన్ని అంతం చేశానని, లా అండ్‌ ఆర్డర్‌ పట్ల నాడు అంత కఠినంగా ఉన్నాను కాబట్టే అలిపిరిలో తనపై దాడి చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. జిల్లాల ఎస్పీల బదిలీ నేపథ్యంలో శనివారం వారితో సీఎం సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతలు సహా పలు అంశాలపై ఎస్పీలకు దిశా నిర్ధేశం చేశారు. కొందరు ఎస్పీలు నేరుగా సమావేశానికి హాజరు కాగా... మరికొన్ని జిల్లాల ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ తనకు అత్యంత ప్రాధాన్యమైన అంశమని.. ఈ విషయంలో రాజీ అనేది లేదని లా అండ్‌ ఆర్డర్‌ బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి. ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. రాష్ట్ర గ్రోత్‌ రేట్‌ పెరుగుతుంది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే నా విధానం అని సీఎం అన్నారు. రాజకీయ ముసుగులో నేరాలను ఉపేక్షించకండి. నేరాల తీరు మారింది. కొత్త తరహా నేరాలు.. కొత్త తరహా నేరస్తులు వచ్చారు. ఈ విషయంలో పోలీసులు కూడా అప్‌ డేట్‌ కావాలి. అప్పుడే శాంతి భద్రతలను పటిష్టంగా కొనసాగించగలం అని సీఎం అన్నారు.

అన్నీ ఆలోచించే మీకు అవకాశం ఇచ్చాను
అన్ని కోణాల్లో ఆలోచించి మీకు ఎస్పీలుగా అవకాశం ఇచ్చాను. బెస్ట్‌ పనితీరు చూపించడంతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి. తొలిసారి సీఎం అయినప్పటి నుంచి నా ఫోకస్‌ లా అండ్‌ ఆర్డర్‌ మీదే ఉండేది. ఫ్యాక్షనిజం, నక్సలిజం, రౌడీయిజం, మత ఘర్షణలు వంటి వాటి విషయంలో చాలా కఠినంగా ఉండేవాడిని. ఫ్యాక్షన్‌ను అణిచివేత కోసం మా పార్టీ ప్రజా ప్రతినిధులను కూడా అరెస్టు చేసిన సందర్భాలు రాయలసీమలో ఉన్నాయి. అంత కఠినంగా ఉండడం వల్లనే నాడు దానిని దూరం చేయగలిగాం. ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లలను ఎన్టీఆర్‌ మెమోరియల్‌ స్కూల్‌లో చదివించాను. వారు మళ్లీ అటువైపు వెళ్లకుండా చర్యలు తీసుకున్నాను.
నాడు తెలంగాణలో నక్సల్‌ విషయంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఉండేవి. తెలంగాణ పల్లెల నుంచి హైదరాబాద్‌ సరిహద్దు జిల్లాల వరకు నక్సలైట్లు ఉండేవాళ్లు. దీంతో చాలా మంది తెలంగాణ నేతలు ఎన్నికల సమయంలో తప్ప గ్రామాలకు వెళ్లే వాళ్లు కాదు. ఒకసారి పోలీస్‌ స్టేషన్‌ పేల్చివేస్తే పోలీసులు వెళ్లడానికి భయపడ్డారు. నేను స్వయంగా వెళ్లి పోలీసుల్లో స్థైర్యాన్ని నింపాను. తరువాత గ్రేహౌండ్స్‌ వంటి విభాగాలను తెచ్చాం. దీంతో నక్సలిజాన్ని అణిచి వేశాం. నాడు ఉప ప్రధానిగా ఉన్న అద్వానీని ఆహ్వానించి ఈ కార్యక్రమాలు వివరించాను అని సీఎం చంద్రబాబు అన్నారు. బెజవాడలో రౌడీ వ్యవహారాలు ఎక్కువగా ఉండేవి. సమర్థులైన అధికారులతో ఇక్కడ రౌడీయిజం లేకుండా చేశాం. నాడు కఠినంగా వ్యవహరించడం వల్లనే హైదరాబాద్‌కు పెట్టబడులు వచ్చాయి. నేడు బ్రాండ్‌ అయ్యింది. మనం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో అనేక మార్పులకు కారణం అవుతాయి అని చంద్రబాబు అన్నారు.
రాజకీయ ముసుగులో చేసే నేరాలను కట్టడి చేయండి
ఒకప్పుడు రాజకీయ నాయకులు అవసరానికి రౌడీలను, క్రిమినల్స్‌ను వాడుకునే వాళ్లు. అయితే నేడు రాజకీయాల ముసుగులో నేరాలు చేస్తున్నారు. పాలిటిక్స్‌ను క్రిమినలైజ్‌ చేశారు. వివేకా హత్య విషయంలో ఏం జరిగిందో ప్రతి పోలీసు అధికారి స్టడీ చేయాలి. ఒక దారుణ హత్యను గుండెపోటు అన్నారు. తరువాత హత్య అన్నారు. తరవాత నాపై నెట్టారు. సీబీఐ కావాలి అన్నారు. తర్వాత వద్దు అన్నారు. ఇలా ఒక్కటి కాదు. దేశంలో మరే కేసులోనూ ఇన్ని మలుపులు ఉండవు. పోలీసు అధికారులకు ఇదొక పెద్ద కేస్‌ స్టడీ. ఇదొక్కటే కాదు... మొన్న మన ప్రభుత్వంలో సింగయ్య మృతి ఉదంతాన్ని గమనించే ఉంటారు. వాళ్ల కారు కింద పడి వాళ్ల కార్యకర్త చనిపోతే కూడా పట్టించుకోలేదు. దాన్ని దాచి పెట్టారు. రెండు రోజుల తరువాత వీడియో బయటపడకపోతే ఘటన ఎలా జరిగిందో కూడా తెలిసేది కాదు. ఈ విషయంలో పోలీసు అధికారులు తప్పుడు ప్రచారాన్ని నమ్మారు. అంటే వాళ్ల క్రిమినల్‌ పాలిటిక్స్‌ ఎలా ఉంటాయో మీరు అర్థం చేసుకోవాలి. అలాంటి వాళ్లు ఉన్న రోజుల్లో మనం ప్రభుత్వాలు నడుపుతున్నామనేది మీరంతా గుర్తుంచుకోవాలి అని ముఖ్యమంత్రి వివరించారు.
టెక్నాలజీని వాడుకోండి
నేడు నేరాల తీరు మారింది. అంటే మీ దర్యాప్తు తీరు కూడా మారాలి. టెక్నాలజీని 100 శాతం ఉపయోగించుకోండి. సీసీ టీవీలు లేకపోతే పాస్టర్‌ ప్రవీణ్‌ మృతిని ప్రభుత్వానికి చుట్టేవాళ్లు. ప్రవీణ్‌ మృతి విషయంలో వాస్తవాలను టెక్నాలజీతో స్పష్టంగా చెప్పగలిగాం. సోషల్‌ మీడియా సైకోలను కట్టడి చేయండి. మహిళల వ్యక్తిత్వ హననం చేసే వాళ్లను ఉపేక్షించకండి. ప్రజా ప్రతినిధులతో సామరస్యంగా, సమన్వయంతో పని చేయండి. తప్పు చేస్తే మాత్రం ఏ పార్టీ వాళ్లను అయినా శిక్షించండి. ఈ విషయంలో రాజీలేదు. మా ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పేదానిలో మంచి ఉంటే పాటించండి. తప్పు ఉంటే చేయమని చెప్పను. మా పార్టీ వాళ్లు చెప్పరు. ఇది కూటమి విధానమని సీఎం అన్నారు.
రియాక్ట్, రీచ్, రెస్పాండ్, రిజల్ట్‌ విధానంపై దృష్టి పెట్టండి
పోలీసు అధికారులు, సిబ్బంది రియాక్ట్‌ రీచ్, రెస్పాండ్, రిజల్ట్‌ అనే విధానంలో పనిచేయాలని సీఎం సూచించారు. ఏదైనా తీవ్రమైన ఘటన జరిగిన వెంటనే కిందిస్థాయి సిబ్బందిపై వదిలేయకుండా వెంటనే రియాక్ట్‌ అవ్వండి. అవసరమైన మేరకు క్రై మ్‌ స్పాట్‌ కు రీచ్‌ కావాలి. సాక్ష్యాధారాల సేకరణ, దర్యాప్తులో అవసరమైన చర్యలు చేపట్టండి. మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా లేక సమాచార లోపంతో జరిగే ప్రచారంపై వెంటనే రెస్పాండ్‌ అవ్వండి. పై స్థాయి నుంచి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ వరకూ రియాక్ట్‌ , రీచ్, రెస్పాండ్‌ , రిజల్ట్‌ విధానాలను అవలంబిస్తే మనది...బెస్ట్‌ పోలీసింగ్‌ అవుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
నిరసనల పేరుతో జరిగే కుట్రలను సహించొద్దు
రాజకీయ ముసుగులో కొందరు అలజడులు చేయాలని చూస్తున్నారు. ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదు. ప్రతిపక్షాలు పర్యటనలు చేసుకోవచ్చు. కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. నేను వాటికి వ్యతిరేకం కాదు. అయితే చట్ట విరుద్దంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదు. ఈ విషయంలో జిల్లా అథికారులు కూడా స్పష్టంగా ఉండాలి. ప్రూవ్‌ చేసుకోండి  అంటూ సీఎం చంద్రబాబు ఎస్పీలకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.
Tags:    

Similar News