అప్పుడే సమరానికి సై అంటున్నారు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమరానికి సై అంటోంది. ఇప్పటికే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
Byline : G.P Venkateswarlu
Update: 2024-06-14 06:56 GMT
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించి ఒక్క రోజు గడిచింది. ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులైంది. ఏ ప్రభుత్వమైనా పరిపాలన ప్రారంభించి కనీసం ఆరు నెలలు గడిస్తే పాలన తీరు ఎలా ఉంటుందో చెప్పగలం. అలా కాకుండా పది రోజుల్లోనే ఆందోళనలకు సిద్దం కావాలని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఇతర నేతలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ పిలుపు నివ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఇందుకు వైఎస్సార్‌సీపీ వారు చెబుతున్న కారణాల్లో ప్రధానమైనది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు. టీడీపీ అధికారంలోకి వచ్చిందని ప్రకటన రాగానే పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇండ్ల వద్దకు వెళ్లి రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం, పలువురు కార్యకర్తలను బట్టలు విప్పదీసి మోకాళ్లపై కూర్చోబెట్టి దారుణంగా హింసించడం వంటి సంఘటనలు జరిగాయని, జరుగుతున్నాయని, దీనిని ఎదుర్కొనేందుకు వెంటనే సిద్ధం కావాలని జగన్ పిలుపు నిచ్చారు. జగన్ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీలోని నాయకులు, కార్యకర్తలు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ప్రతి నియోజక వర్గంలోను ఓడి పోయిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు బాధితులను పరామర్శించి భరోసా ఇచ్చారు. అక్కడే మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అరాచకాలను సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. మరో పక్క మేధావులు, రాజకీయ విశ్లేషకులు పట్టుమని పది రోజులు కాకుండానే జగన్ ఈ విధమైన పిలుపు నివ్వడం సరైంది కాదని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇప్పటి వరకు జగన్‌పై ఒక ముద్ర ఉంది. అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజల మధ్యకు వెళ్లలేదు. పైగా ఎమ్మెల్యేలు, మంత్రులకు సకాలంలో అపాయింట్‌మెంట్స్ కూడా ఇవ్వలేదు. ఏదైనా సమావేశాలకు వెళ్లాలంటే భారీ బందోబస్తు మధ్య గ్రామాల్లో ప్రజలు ముఖ్యమంత్రిని చూసే అవకాశం కూడా లేకుండా చేయడం ఏమిటనేది ప్రశ్న. ఎన్నికలకు ముందు జరిగిన సభల్లో పలువురు వ్యాదిగ్రస్తులను కలిసి వారికి వైద్య సాయం అందించేందుకు చర్యలు తీసుకున్నారు.
ప్రభుత్వం చివరి దశలో ఉందనంగా ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో ఉన్న ప్రైవేట్ వైద్యశాలల్లో బకాయిలు చెల్లించకుంటే వైద్యం చేసేది లేదని సమ్మెకు దిగారు. ఇటువంటి అంశాలను పరిష్కరించడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది.
శుక్రవారం జగన్ ఇంట్లో ఏర్పాటు చేసిన ఎంపీలు, రాజ్యసభ సభ్యుల సమావేశంలోనూ ఆందోళన బాట పట్టాల ఉద్బోధ చేశారు. ప్రస్తుత ప్రభుత్వానికి కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే పరిస్థితులు ఉన్నాయని, ఈ పరిస్థితులు ఉపయోగించి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని ఎంపీలకు సూచించారు. ఇకపై ఐదేళ్ల కాలం ప్రజల్లోనే ఉండాలని వారిని కార్యోన్ముఖులను చేశారు. గత ఐదేళ్ల కాలంలో వారిని ప్రజల వద్దకు ఎందుకు పంపించలేదనే చర్చ కూడా మొదలైంది. నాకు ఇంకా వయసు అయిపోలేదు. సత్తువ ఉంది. 14 నెలల పాటు గతంలో పాదయాత్ర చేశా. కార్యకర్తలకు మనోధైర్యం ఇచ్చేందుకు వారిని వెంటనే కలవాలి. ప్రజల్లోనే ఉంటూ వారితో కలిసి పోరాడాలని జగన్ తన పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులకు పిలుపు నిచ్చారు.
ప్రత్యేక హోదా రావాలంటే ఇదే సరైన సమయమని, దీన్ని ఉపయోగించుకొని ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించొచ్చని సమావేశంలో జగన్ అన్నారు. మన వంతు పాత్రగా ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో గళం విప్పాలని రాజ్య సభ సభ్యులు, ఎంపీలకు పిలుపునివ్వడం విశేషం. బీజేపీకి కేవలం 240 సీట్లు మాత్రమే వచ్చినందున ప్రతిపక్షాల అవసరం చాలా వరకు ఉంటుందని ఇటువంటి సమయంలో ఆచి తూచి అడుగులు వేసి కావలసిన ప్రత్యేక హోదా సాధించుకునేందుకు పోరాటమే శరణ్యమన్నారు.
ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులను ఒక్కొ క్కరిగా పలకరిస్తూ వారికి ధైర్యం చెప్పే కార్యక్రమాన్ని చేపట్టారు. ఐదేళ్ల తర్వాత తిరిగి మన ప్రభుత్వమే వస్తుందని, ఈ ఐదేళ్లు ప్రజల మధ్యనే ఉంటూ కార్యకర్తలను కాపాడుకోవడం మన విధిగా పెట్టుకోవాలని నాయకులకు సూచించారు. విచిత్రమేమిటంటే ఒక్కరి ముఖంలో కూడా సంతోషం కనిపించ లేదు. ఎక్కడి లేని బాధ వారిలో కనిపించింది. ఓటమి పాలైన తర్వాత ఈ పది రోజుల నుంచి జగన్‌ను కలవడానికి ఎవ్వరూ సాహసించ లేదు. గురు, శుక్ర వారాల్లో జగన్ ఆహ్వానం మేరకు తాడేపల్లిలోని జగన్ ఇంటికి ఓటమి పాలైన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్య సభ సభ్యులు ఒక్కొక్కరుగా కలిశారు.