అతి వేగం నలుగురి ప్రాణాలు తీసింది
జాతీయ రహదారి నుంచి సర్వీసు రోడ్డులోకి పల్టీలు కొట్టిన కారు ప్రమాదంలో నలుగురు యువకులు మరణించారు.
ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకరంగా మారాయి. ప్రతి రోజు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వ్యక్తులు మరణిస్తూనే ఉన్నారు. నిండు నూరేళ్లు బతకాల్సిన వ్యక్తులు అతివేగం, నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ వల్ల అర్థాంతరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో కూడా అలాంటి ప్రమాదమే చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి ఉయ్యూరు వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి జాతీయ రహదారి నుంచి సర్వీసు రోడ్డులోకి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు మరణించారు.
ఈ ప్రమాదంలో విజయవాడ, కుందేరు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. మృతులు నలుగురు కారులో ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను పరిశీలన చేశారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కారు డ్రైవర్ అదుపు కోల్పోవడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంతో రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ ఆటంకం ఏర్పడింది.