దటీజ్ సీఎం..దుబాయ్ లో ఉన్నా తన మనసంతా ఏపీపైనే
యూఏఈ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై అక్కడ నుంచే సమీక్షలు చేస్తూ దిశా నిర్థేశం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం యూఏఈ పర్యటనలో ఉన్నా.. ఆయన మనసంతా ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. పెట్టుబడుల రాబట్టడం కోసం ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నా.. వన్ టు వన్ కలుస్తున్నా ఇక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. మంత్రులు, అధికారులకు డైరెక్షన్లు ఇస్తూనే ఉన్నారు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం మీటింగ్ లతో అక్కడ అంత బిజీ బిజీగా ఉన్నా సమయం దొరకబుచ్చుకుని టెలీకాన్ఫరెన్సులు నిర్వహిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు. కన్నీళ్లు పెట్టించే కర్నూలు ఘోర రోడ్డు ప్రమాదంపైన, ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాల మీద ఆయన ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి దిశా నిర్థేశాలు చేస్తూనే ఉన్నారు.
కర్నూలు ప్రమాదంపైే ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. హోంమంత్రి, రవాణా శాఖ మంత్రి, డీజీపీ, డీఐజీ, జిల్లా కలెక్టర్, ఎస్‌పీలతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని, మృతదేహాలను త్వరితగతిన గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించాలని, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు. అధికారులు, మంత్రులు దగ్గరుండి పర్యవేక్షించాలని, ఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వం గాయపడినవారికి, ప్రభావిత కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
అంతకుముందు సంఘటన జరిగిన తక్షణమే స్పందించారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమై మృతి చెందిన ఈ దారుణ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం తెలిపారు. అధికారులను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని, క్షతగాత్రులకు, బాధితులకు సహకారం అందించాలని ఆదేశించారు. మృతుల సంఖ్య పెరగకుండా అవసర చర్యలు తీసుకోవాలని సూచించారు.
అంతకుముందు గురువారం ఏపీ వాతావరణ పరస్థితులపైన, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలుపైన కూడా దుబాయి నుంచే సమీక్షించారు. అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కురుస్తున్న తీవ్ర వర్షాల నేపథ్యంలో మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఆర్‌టిజీఎస్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. వర్షప్రభావిత నెల్లూరు, ప్రకాశం, కడప, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు తదితర జిల్లాల్లో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తీవ్రంగా ప్రభావితమైన నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున, మిగతా వర్షప్రభావిత జిల్లాలకు రూ.1 కోటి చొప్పున అత్యవసర నిధులు మంజూరు చేయాలని ఆదేశించారు. కడప, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాలకు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, నెల్లూరులో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు తక్షణం మొహరించాలని నిర్దేశించారు.
ఎక్కడా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, రహదారులు, భవనాలు, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భారీ వర్షాలతో నీటమునిగిన లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆహారం, పిల్లలకు పాలు వంటి పదార్థాలు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్లు తెలిపారు. కాలువలు, చెరువు గట్లకు గండ్లు పడకుండా బలహీన చోట్ల పటిష్ట పరచాలని, అంటువ్యాధులు వ్యాపించకుండా వైద్య శిబిరాలు నడపాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని, పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహాలతో చెరువులు నింపేందుకు అవసర చర్యలు చేపట్టాలని కూడా సూచించారు.