TTD | ఆ.. సభ్యుడు రాజీనామా చేయాల్సిందే...

టీటీడీ బోర్డు సభ్యుడి బూతు పురాణంపై నిరసన వ్యక్తం అవుతోంది. ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని కూడా సంఘం నేతలు డిమాండ్ చేశారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-02-19 08:00 GMT

తిరుమల శ్రీవారి ఆలయ మహద్వారం దాటగానే గేటు తీయలేదనే ఆగ్రహంతో టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ ఉద్యోగులను పరుష పదాలతో దూషించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి టిటిడి పాలకమండలం సభ్యుడిగా ప్రాతినిత్యం వహిస్తున్న నరేష్ కుమార్ తీరుతో యాత్రికులు కూడా అవాక్కయ్యారు.


తిరుమల ఆలయ మహాద్వారం.. గొల్ల మండపానికి మధ్యన ఉన్న గేటు తెరవలేదనే ఆగ్రహంతో ఉద్యోగులపై నరేష్ కుమార్ తీవ్రస్థాయిలో దూషించారు. దీంతో అక్కడ ఉన్న ఉద్యోగుల సర్దిచెప్పడానికి విఫలయత్నం చేశారు. అయినా ఏమాత్రం తగ్గని బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ నోటి దురుసును ప్రదర్శించారు.

భక్తి, సేవా భావంతో మెలగాల్సిన పాలకమండలి సభ్యుడు అనుసరించిన తీరుపై టిటిడి ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు.
" ఆలయం చెంత క్రమశిక్షణ పాటించాల్సిన బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలి"అని టీటీడీ ఎంప్లాయిస్ బ్యాంకు అధ్యక్షుడు, ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్
అసోసియేట్ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర CPS ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకుడు చీర్ల కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయం లోకి వెళ్లడానికి మహా ద్వారం ముందు ఇత్తడి తో చేసిన కంచె ఉంటుంది. ప్రతిరోజు ఉదయం అర్చకులు, టీటీడీ ఈవో, అదనపు ఈవో, సీఎం, ప్రధాని, అంతర్జాతీయ రాజకీయ ప్రముఖులు, వివిఐపీలు, ప్రోటోకాల్ ఉన్న అధికారులు, రాజకీయ ప్రముఖులు వచ్చినప్పుడు మాత్రమే ఈ గేటు తెరిచి అనుమతించడం ద్వారా గౌరవం ఇస్తారు.
తిరుమలలో ఏం జరిగింది

https://twitter.com/i/status/1892125174662644057

శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాత కర్ణాటకకు చెందిన టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ మహాద్వారం నుంచి కుటుంబ సభ్యులతో కలిసి వెలుపలికి వచ్చారు. ఎడమవైపు తిరిగితే సాదాసీదాగా మాడవీధుల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. దర్శనానంతరం కూడా వివిఐపీలే కాదు. సామాన్య భక్తులు కూడా అలాగే నడిచే వెలుపలికి వస్తారు. కానీ,
టిటిడి బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ మహాద్వారం దాటగానే ఎదురుగా ఉన్న గేట్లు తెరవలేదని కారణంతో అక్కడ విధినిర్వహణలో ఉన్న టీటీడీ ఉద్యోగి బాలాజీ పై తిట్ల పురాణం మొదలుపెట్టారు. సమీపంలో ఉన్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గేటు తెరవడానికి మాకు అనుమతి లేదు అని చెబుతున్న ఏమాత్రం వినిపించుకోకుండా,
"అసలు నిన్ను ఇక్కడ పెట్టింది ఎవరు. థర్డ్ క్లాస్ వ్యక్తులను ఎవరు ఉంచారు. వాడి పేరేంటి? " అనడమే కాకుండా తీవ్రస్థాయిలో బూతులు తిట్టారు. దీంతో టీటీడీ సిబ్బంది తీవ్ర కలత చెందుతున్నారు. ఒక దశలో ఆగ్రహం పట్టలేని టిటిడి బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ ఓ దశలో దాడి చేయడానికి కూడా ప్రయత్నించినట్లు ఆరోపిస్తున్నారు.
సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా..
మహా ద్వారం వద్ద బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ చిందులు తొక్కుతున్న తీరును చూసి స్వామివారి దర్శనానికి వెళుతున్న భక్తులే కాకుండా వెలుపలికి వస్తున్న వారు కూడా ముక్కున వేలేసుకున్నారు. ఇక్కడ జరుగుతున్న తీరును కమాండ్ కంట్రోల్లోని సీసీటీవీలో గమనించిన సిబ్బంది వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. మహద్వారం వద్ద ఉన్న సిబ్బంది కూడా అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో మాహద్వారం వద్దకు చేరుకున్న టీటీడీ వీజీవో సురేంద్ర, శ్రీవారి పోటు ఏఈఓ మునిరత్నం తీవ్ర ఆగ్రహంతో చిందులు తొక్కుతున్న బోర్డు సభ్యుడు నరేష్ కుమార్కు సర్ది చెప్పడానికి విఫ్రయత్నం చేశారు. అయినా ససేమిరా అనడంతో, గత్యంతరం లేని స్థితిలో ఆ గేటు తెరవడం ద్వారా నరేష్ కుమార్ ను సముదాయించి వెలుపలికి తీసుకువచ్చారు. టిటిడి బోర్డు సభ్యుడు అనుసరించిన తీరుపై ఆలయం వద్ద ఉన్న సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాలకమండలి సభ్యుడు నరేష్ కుమార్ పద్ధతి ఏమి మాత్రం బాగా లేదని టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులు మండిపడుతున్నారు.

ఈ ఘటనపై ఆ తర్వాత కూడా బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ స్పందించారు. "టీటీడీలో కొందరు ఉద్యోగులు తమ స్థాయికి కూడా గౌరవం ఇవ్వడం లేదు. దురుసుగా ప్రవర్తిస్తున్నారు" అని ఆగ్రహ వ్యక్తం చేశారు. దేవుడి ముందు అందరూ సమానులే. యాత్రికులకు సేవల అందించడమే బోర్డు సభ్యుల ప్రధమ కర్తవ్యం అనే విషయాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తున్నారంటూ టిటిడి ఉద్యోగులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. "ఆధ్యాత్మికత. క్రమశిక్షణ. సేవా భావంతో మెలగాల్సిన చోట బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ వ్యవహరించిన తీరు ఏమాత్రం బాగాలేదు" అని టిటిడి కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చీరల కిరణ్ కుమార్ నిరసన వ్యక్తం చేశారు. "సభ్యత మరిచి ప్రవర్తించిన బోర్డు సభ్యుడు తన పదవికి రాజీనామా చేయలి" అని కూడా ఆయన డిమాండ్ చేశారు
చీర్ల కిరణ్ ఏమంటున్నారంటే..
టీటీడీ ఉద్యోగి బాలాజీ శ్రీవారి ఆలయం ముందు ఉన్న మహాద్వారం వద్ద విధులు నిర్వహిస్తున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ను అడ్డుకోలేదు. ఆక్షన్ వెంట ఉన్నఅటెండర్ జనార్దనరెడ్డి తో "మహాద్వారం నుంmr ఎవరిని పంపించకూడదు అని ఉన్నతాధికారులు ఆదేశించిన విషయం మీకు తెలుసు కదా అన్న" చెప్పారని వివరించారు.
"అప్పటికే అక్కడకు చేరుకున్న బోర్డు మెంబెర్ కోసం టీటీడీ ఉద్యోగి బాలాజీ మహాద్వారం గేట్ తీశారు. నిమిషం కూడా ఒపికపట్టని బోర్డు మెంబర్ నరేష్ ఉద్యోగి బాలాజీని అసభ్యకరంగా దుషించారు" అని కిరణ్ చెబుతున్నారు. సాక్షాత్తు శ్రీవారి ఆలయం చెంత భక్తుల ముందే, మీడియా చూస్తుండగా, టీటీడీ ఉద్యోగిని ఈ విధంగా భూతులు తిట్టడం ఎంత వరకు న్యాయం అని ప్రశ్నించారు.
"ఉద్యోగుల మనోదైర్యాని టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ ఉద్యోగి బాలాజీ, టీటీడీ సిబ్బందికి క్షమాపణలు చెప్పాలి. గౌరవంగా టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేయాలి" అని టీటీడీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున డిమాండ్ చేస్తున్నాం. అని తెలిపారు.

Similar News