దాంతో నా జన్మ సార్థకమైంది

వైసీపీ నిర్వాకం వల్ల రూ. 25 కోట్లు జరిమానా కట్టాల్సి వచ్చిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

Update: 2025-09-19 13:14 GMT

కుప్పంకు నీళ్లు తీసుకెళ్లి జలహారి ఇవ్వడంతో తన జన్మ సార్థకమైందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం రెండో అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. డిసెంబరు 25 నాటికి పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు వెల్లడించారు. నీటిని సమర్థవంతంగా నిర్వహించుకోవాలన్నారు. అది సక్రమంగా నిర్వహించినప్పుడే రాష్ట్రంలో కరువు అనే మాట రాదన్నారు. పోలవరం నిర్మాణంలో అనేక సమస్యలు అధిగమించామన్నారు. గత ప్రభుత్వ హయాంలో డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుని పోయిందన్నారు. దీనికి మళ్లీ రూ. 1000 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా వంశధార వరకు నీళ్లు తరలించొచ్చని, దీని కోసం రూ. 960 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు పనులు 75 శాతం పూర్తి అయ్యాయన్నారు. అక్టోబరులోనే అనకాపల్లి వరకు ఈ జలాలను తీసుకొస్తామని, రూ. 1425 కోట్లతో ఈ ప్రాజెక్టును పోలవరం కుడి కాలువతో అనుసంధానం చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లవించారు. శ్రీశైలంలో నిల్వ చేసిన నీటిని హంద్రీనీవా, గాలేరు–నగరికి, మల్యాల మంచి కుప్పం ప్రాంతానికి హంద్రీనీవా జలాలు తరలించామన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు రూ. 13వేల కోట్లు ఖర్చు చేశామని, దీని ద్వారా 40 టీఎంసీల నీటిని తరలించగలిగామని వెల్లడించారు.

తుంగభద్ర ప్రాజెక్టులో దెబ్బతిన 33 గేట్ల మరమ్మతులు చేశామని, శ్రీశైలం స్పిల్‌వే రక్షణకు రూ. 204 కోట్లతో టెండర్లు పిలిచామని, వీటిని తర్వలోనే పూర్తి చేస్తామని, సోమశిల ప్రాజెక్టుకు కూడా మరమ్మతులు వచ్చే సీజన్‌కి పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారి కోసం రూ. 2,144 కోట్లతో ప్రాజెక్టు చేపట్టారని, దీనిలో నిబంధనలు ఉల్లంఘించడంతో ఎన్‌జీటీ సుప్రీం కోర్టుకు వెళ్లిందని, దీంతో పనులు నిలిపివేసిందని చెప్పారు. వైసీపీ చేసిన నిర్వాకానికి రూ 100 కోట్లు ఫైన్‌ వేసి రూ. 25 కోట్లు కట్టాలని ఆదేశించిందని, అలా వైసీపీ చేసిన తప్పులకు కూటమి ప్రభుత్వం రూ. 25 కోట్లు జరిమానా కట్టిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

Tags:    

Similar News