ఆ హెలికాప్టర్‌ను కొనలేదు..అద్దెకు తీసుకున్నది
సీఎం చంద్రబాబు కోసం ఉపయోగిస్తున్న కొత్త హెలికాప్టర్ మీద సీఎం కార్యాలయం స్పష్టత ఇచ్చింది.;
By : The Federal
Update: 2025-09-06 05:31 GMT
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోసం ఉపయోగిస్తున్న అధునాతన హెలికాప్టర్ మీద సీఎం కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొత్త హెలికాప్టర్‌ను కొనలేదని, అద్దెకు తీసుకున్నదని స్పష్టం చేసింది. పాత హెలికాప్టర్‌లో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. అందువల్ల పాత హెలికాప్టర్‌లో ప్రయాణం సురక్షితం కాదు అని భద్రతా వర్గాలు హెచ్చరించాయి. అందువల్ల మరో హెలికాప్టర్‌ను ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నారు. అధునాతన సౌకర్యాలు కలిగిన ఎయిర్‌బస్ హెచ్–160 మోడల్ హెలికాప్టర్‌ను ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నారు. భద్రత కారణాల రీత్యా ఈ హెలికాప్టర్ అయితే సీఎం ప్రయాణాలకు, వీవీఐపీ టూర్లకు కూడా అనువుగా ఉంటుంది. అందువల్ల ఎయిర్ బస్–160 హెలికాప్టర్ మోడల్ వైపు మొగ్గు చూపారు. దీంతో ప్రస్తుతం సీఎం ప్రయాణాలకు దీనిని ఉపయోగిస్తున్నారు.
పాత హెలికాప్టర్ బెల్ కంపెనీకి చెందింది. దీనిని ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పర్యటనల కోసమే కాకుండా ఇతర వీవీఐపీల టూర్‌లకు కూడా అద్దె ప్రాతిపదికనే ఇన్నాళ్లూ ఉపయోగించింది. అయితే ఈ హెలికాప్టర్ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ పర్యటనల్లో పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వీవీఐపీల పర్యటనల సందర్భంగా ఇలా సాంకేతిక సమస్యలు తలెత్తిన హెలికాప్టర్‌ను ఉపయోగించడం సరైంది కాదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పాత హెలికాప్టర్‌ను బెల్ సంస్థ క్షుణ్ణంగా పరిశీలించింది. వీవీఐపీ పర్యటనలకు దీనిని ఉపయోగించడం మంచిది కాదు. దీనికి బదులుగా మరొక హెలికాప్టర్‌ను ఉపయోగించాలని సూచించాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే అధునాత సౌకర్యాలు కలిగిన ఎయిర్‌బస్–160 హెలికాప్టర్‌ను ఉపయోగించాలని, ఆ మేరకు దానిని అద్దెకు తీసుకున్నట్లు సీఎం కార్యాలయం స్పష్టం చేసింది.
అయితే కొత్తగా అద్దెకు తీసుకున్న ఈ అధునాతన హెలికాప్టర్‌లో ఉండవల్లిలోని సీఎం నివాసం నుంచి నేరుగా జిల్లాల పర్యటనలకు వెళ్లొచ్చు. దీని వల్ల కాన్వాయ్‌కు, విమానానికి అయ్యే ఖర్చులు తగ్గుతాయని వివరించింది. ఈ అధునాతన ఎయిర్‌బస్–160 మోడల్ హెలికాప్టర్‌ను వినియోగించడం వల్ల సీఎంతో పాటు ఇతర వీవీఐపీ ప్రయాణాలకు అయ్యే ఖర్చుల్లో దాదాపు 70 శాతం ఖర్చులు ఆదా అవుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. దీనిపైన సోషల్ మీడియాలో అబద్దపు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది.