హైదరాబాద్ టెకీల్లో పెరిగిపోతున్న ‘14 గంటల’ టెన్షన్

కర్నాటకలో జరుగుతున్న పరిణామాల దెబ్బకు హైదరాబాద్ హైటెక్ సిటీలో టెన్షన్ పెరిగిపోతోంది. కర్నాటకలో జరుగుతున్న పరిణామాలకు హైదరాబాద్ కు ఏమి సంబంధం ?

Update: 2024-07-30 12:21 GMT

కర్నాటకలో జరుగుతున్న పరిణామాల దెబ్బకు హైదరాబాద్ హైటెక్ సిటీలో టెన్షన్ పెరిగిపోతోంది. కర్నాటకలో జరుగుతున్న పరిణామాలకు హైదరాబాద్ కు ఏమి సంబంధం ? అని అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడో స్విచ్చేస్తే ఇంకెక్కడో బల్బు వెలిగినట్లుగా ఉంటుంది వ్యవహారాలు. ఇంతకీ విషయం ఏమిటంటే బెంగుళూరుంటేనే సాఫ్ట్ వేర్ పార్కులు, సాఫ్ట్ వేర్ కంపెనీలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. దేశంలోని సాఫ్ట్ వేర్ పరిశ్రమకు బెంగుళూరు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి కర్నాటకలో తొందరలోనే సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పనిగంటలు పెరగబోతున్నాయి.

ఇపుడు ఇతర రంగాల్లోని ఉద్యోగుల లాగే సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు కూడా పనిగంటలు 8 గంటలే. ఇలాంటి కర్నాటకలో తొందరలోనే సాఫ్ట్ వేర్ రంగంలోని ఉద్యోగుల పనిగంటలు 8 నుండి 14 గంటలకు పెరగబోతోంది. పేరుకు తొమ్మిది గంటల పనివేళలే అయినా మధ్యలో లంచ్ అవర్ తీసేస్తే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పనిచేసేది మాత్రం 8 గంటలే. అలాంటిది పనిగంటలను యాజమాన్యాలు ఒక్కసారిగా 8 నుండి 14 గంటలు అంటే 6 గంటలు పెంచేయబోతున్నాయనేటప్పటికి ఉద్యోగుల గుండెలు గుభేలుమంటున్నాయి. అందుకనే 14 గంటల పనివేళలను నిరసిస్తు రాబోయే శనివారం బెంగుళూరులోని వివిధ ప్రాంతాల నుండి ఫ్రీడమ్ పార్కు వరకు భారీ ర్యాలీకి ఉద్యోగులు రెడీ అవుతున్నారు.



పనిగంటలను 14 గంటలకు పెంచటాన్ని నిరసిస్తు కర్నాటక స్టేట్ ఐటి ఎంప్లాయీస్ యూనియన్ (కేఐటీయూ) ఫ్రీడమ్ పార్కు దగ్గర భారీ ఆందోళనకు పిలుపిచ్చింది. తమ ఆందోళన సక్సెస్ అవటానికి వీలుగా గడచిన రెండు వారాలుగా అన్నీ సాఫ్ట్ వేర్ కంపెనీల దగ్గర ఉద్యోగుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కేఐటీయూ చాలా కార్యక్రమాలను నిర్వహించింది. కేఐటీయూ ప్రధాన కార్యదర్శి సుహాస్ అడిగ మాట్లాడుతు శనివారం ఆందోళనలో 300 ఐటి, ఐటి సంబంధిత కంపెనీలు, బీపీఓల్లో పనిచేసే ఉద్యోగులు పాల్గొనబోతున్నట్లు చెప్పారు. పనిగంటలను 8 నుండి 14 గంటలకు పెంచటం వల్ల ఉద్యోగుల్లో బీపీ, షుగర్, గుండె సంబంధిత సమస్యలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఒకసారి పనివేళలు 14 గంటలకు పెరిగితే ఇపుడు మూడుషిఫ్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులను రెండు షిఫ్టులకు తగ్గించేయటం ఖాయమన్నారు. దీనివల్ల లక్షలమంది టెక్కీలకు ఉద్యోగాలు పోవటమే కాకుండా పనిచేసేవారికి అనారోగ్య సమస్యలు పెరిగిపోవటం ఖాయమని ఆందోళన వ్యక్తంచేశారు.

హైదరాబాద్ కు ఏమి సంబంధం ?

సంబంధం చాలా ఉంది. ఎలాగంటే దేశంలోని ఏ ప్రాంతంలో సాఫ్ట్ వేర్ కంపెనీలు లేదా బ్రాంచీలు ఏర్పాటుచేసినా యాజమాన్యం మాత్రం ఒక్కటే ఉంటుంది. ఉదాహరణకు బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబాయ్ ఇలా ఏ నగరంలో ఇన్ఫోసిస్ బ్రాంచీలున్నా యాజమాన్యం మాత్రం ఒక్కటే. అలాగే యాక్సెంచర్, టీసీఎస్ యాజమాన్యాలు తమ అవసరాలకోసం దేశంలో ఎక్కడెక్కడో బ్రాంచీలను ఓపెన్ చేస్తాయి. ఎక్కడ ఎంతస్ధాయిలో బ్రాంచీలు ఓపెన్ చేసినా యాజమన్యంలో మార్పుండదు. కాబట్టి ఇపుడు బెంగుళూరులోని సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగుల పనివేళలు 8 నుండి 14 గంటలకు పెరిగితే దాని ప్రభావం తొందరలోనే హైదరాబాద్ మీద కూడా పడుతుంది. ఎందుకంటే పైన చెప్పుకున్నట్లు బెంగుళూరులోని బ్రాంచీల్లో పనిచేసే ఉద్యోగులు 14 గంటలు పనిచేస్తున్నపుడు హైదరాబాద్ లోని ఆఫీసు ఉద్యోగులు కూడా 14 గంటలు ఎందుకు పనిచేయరని యాజమాన్యం ఆలోచిస్తుంది.

వెంటనే బెంగుళూరులో అమలైన కార్మిక చట్టాలనే హైదరాబాద్ లో కూడా అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవటం ఖాయం. అప్పుడు విధిలేక కార్పొరేట్ శక్తుల ఒత్తిడికి ప్రభుత్వం లొంగిపోయి సాఫ్ట్ వేర్ కంపెనీలకు పనివేళలకు సంబంధించిన చట్టాలను సవరించటం ఖాయం. ఎందుకంటే ఒక రాష్ట్రంలో సక్సెస్ ఫుల్లుగా అమలవుతున్న కార్మిక చట్టాలనే పక్క రాష్ట్రంలో కూడా అమలుచేయాలని ప్రభుత్వాలు ఆలోచిస్తాయి. పైగా కర్నాటకలో ఉన్నది తెలంగాణాలో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే. కాబట్టి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పనివేళలను 14 గంటలకు పెంచటం చాలా సులభం. పనివేళలు పెంచే విషయంలో బెంగుళూరు పరిణామాలను హైదరాబాద్ లోని టెక్కీలు కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. అందుకనే ఇక్కడ టెక్కీల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

ప్రభుత్వం పాత్రేమిటి ?

నిజానికి ప్రైవేటు రంగంలోని ఉద్యోగుల పనివేళ్ళల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. ఎందుకంటే ప్రైవేటు కంపెనీల్లోని ఉద్యోగులు ఎన్నిగంటలు పనిచేసినా ప్రభుత్వానికి వచ్చే నష్టమూ లేదు లాభమూ లేదు. కంపెనీల లాభ, నష్టాలు, ఉద్యోగుల జీతబత్యాలు, పనివేళలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు. అయితే ఉద్యోగుల పనివేళలను 8 నుండి 14 గంటలకు పెంచాలని సాఫ్ట్ వేర్ కంపెనీల యాజమాన్యాలే డిసైడ్ అయ్యాయి. ఎందుకంటే ఉద్యోగులకు ఇచ్చే జీత బత్యాలు, కల్పిస్తున్న సౌకర్యాలతో పోల్చితే వాళ్ళనుండి వస్తున్న ఔట్ పుట్ తక్కువగా ఉంటోందని యాజమాన్యాలు భావిస్తున్నాయి. పైగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వారానికి ఐదురోజులే పనిచేస్తున్నారు. ఇలాంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న యాజమాన్యాలు పనిగంటలను 8 నుండి 14 గంటలకు పెంచాలని డిసైడ్ అయ్యాయి. అయితే తమంతట తాముగా కంపెనీలు పనివేళలను 8 నుండి 14 గంటలకు పెంచేందుకు లేదు. ఎందుకంటే కార్మిక చట్టం అడ్డొస్తుంది. ప్రభుత్వం గనుక షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టానికి సవరణ చేస్తే అప్పుడు పనివేళలను మార్పులు చేసుకోవచ్చు. అందుకనే చట్టంలో సవరణలు చేసేట్లుగా యాజమాన్యాలు ప్రభుత్వంపైన బాగా ఒత్తిడి తెచ్చాయి.

ఇదే విషయమై కర్నాటక కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ మాట్లాడుతు సాష్ట్ వేర్ కంపెనీ ఉద్యోగుల పనిగంటలు పెంచేట్లుగా చట్టసవరణ చేయాలని ప్రభుత్వంపై బాగా ఒత్తిడి తెస్తున్నట్లు చెప్పారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే చిన్నా, పెద్దా కలిపి 1500 కంపెనీలున్నాయి. వీటిల్లో సుమారు 9 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పనిగంటల పెంచే విషయమై యాక్సెంచర్ కంపెనీలో పనిచేస్తున్న రఘువీర్ అనే ఉద్యోగి ‘తెలంగాణా ఫెడరల్’ తో మాట్లాడుతు ‘ఉద్యోగి రోజుకు 14 గంటలు పనిచేస్తే పిచ్చిపట్టడం ఖాయమ’న్నారు. ‘పనిగంటలు పెంచాలని ఆలోచిస్తున్న కంపెనీలు జీతాలు పెంచినా ఉద్యోగులు ఎక్కువకాలం పనిచేయటం అసాధ్యమ’న్నారు. ‘దీనివల్ల ఉద్యోగుల్లో అనారోగ్య సమస్యలు పెరిగి మొదటికే మోసం వస్తుంద’ని అభిప్రాయపడ్డారు. ‘అప్పుడు ఉద్యోగులకే కాదు సంస్ధలకు కూడా తీరని నష్టం ఖాయమ’న్నారు.

Tags:    

Similar News