US VISA రిజెక్ట్ అవుతున్న అమెరికన్ వీసాలలో తెలుగు విద్యార్థులే ఎక్కువ!

అమెరికాలో ఉన్నత చదవాలనుకునే ఆశలపై యూఎస్ ప్రభుత్వం నీళ్లు చల్లుతోంది. రిజెక్ట్ అవుతున్న విద్యార్థి వీసాలలో తెలుగు వారివే ఎక్కువగా ఉంటున్నాయి.;

Update: 2025-04-02 12:50 GMT
వీసా తిరస్కరణ (ప్రతీకాత్మక చిత్రం)
-రాజేష్.. గుంటూరుకు చెందిన యువకుడు. బీటెక్ పూర్తయింది. ప్రస్తుతం డిమాండ్ ఉన్న ఐటీ కోర్సుల్లో శిక్షణ పొందాడు. ఐఎల్స్ పాసయ్యాడు. దాదాపు 6 నెలల కిందటే అమెరికాలో స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ ఏడాది మార్చి రెండో వారంలో ఇంటర్వ్యూకి వెళ్లారు. అన్ని అర్హతలు ఉన్నా రాజేశ్ కి వీసా రిజెక్ట్ అయింది.
-వెంకటరెడ్డి.. నల్లగొండ జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి. అమెరికా న్యూయార్క్ లో పేరున్న ఓ యూనివర్శిటీలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంలో ఇంటర్వ్యూకి వెళ్లారు. దురదృష్టం వెంటాడింది. వీసా రిజెక్ట్ అయింది.
ఇలా ఒకరిద్దరు కాదు వందలాది మంది విద్యార్థుల విదేశీ విద్య ఆశలపై అమెరికన్ కాన్సులేట్ నీళ్లు చల్లింది. ప్రత్యేకించి కన్సలెంట్ల ద్వారా వెళ్లిన విద్యార్థులెవ్వరికీ వీసాలు రావడం లేదంటున్నారు. అమెరికన్ కాన్సులేట్ ఇటీవల భారతదేశంలో సుమారు 2వేల వీసా ఇంటర్వ్యూలను రద్దు చేసిన నేపథ్యంలో అమెరికా ఇచ్చే ఎఫ్ 1 స్టూడెంట్ వీసాలు రిజెక్ట్ కావడం తెలుగు రాష్ట్రాల విద్యార్థులను కలవరపరుస్తోంది.
ఓ అంచనా ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి ఇంటర్వ్యూలకు వెళ్లిన విద్యార్థుల్లో సగం మంది కంటే ఎక్కువగా రిజెక్ట్ అయ్యాయి. విద్యార్థి వీసా దరఖాస్తులను యుఎస్ అధికారులు ఎడాపెడా తిరస్కరించారు. ఐవీ లీగ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో (అమెరికాలో బాగా పేరున్న 8 విశ్వవిద్యాలయాలు) అడ్మిషన్ పొందిన విద్యార్థుల వీసా దరఖాస్తులు కూడా ఎక్కువగానే తిరస్కరణకు గురికావడం విశేషం. గత 20 ఏళ్లలో ఈ తరహాలో వీసాలు రిజెక్ట్ కావడం ఇదే తొలిసారి అని అమెరికన్ స్టడీస్ కన్సెల్టెంట్ ఒకరు చెప్పారు.
నిజానికి ఇండియాలోని ఇతర రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థులు ఎక్కువ మంది యూఎస్ వీసాలు పొందుతుంటారు. భాషతో పాటు టెక్నికల్ స్కిల్స్ కూడా తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సొంతం. కోవిడ్-19 సమయంలోనూ ఎక్కువ మంది తెలుగు విద్యార్థులు అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లారు. అలాంటిది ఇప్పుడు పరిస్థితి తారు మారు అయినట్టుంది.
అమెరికాలో కన్సెల్టెన్సీ నడుపుతున్న ఓ ఎన్ఆర్ఐ ది ఫెడరల్ ప్రతినిధికి చెప్పిన దాని ప్రకారం ఈ సీజన్ లో రావాల్సిన విద్యార్ధులు అనేక మంది రాలేదు. రాబోయే సమ్మర్ సీజన్ కూడా ఇంతకన్నా భిన్నంగా ఉంటుందని భావించడం లేదు. బహుశా ఈసారి ఇండియా నుంచి ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థుల సంఖ్య తగ్గే అవకాశమే కనిపిస్తోంది.
వీసా ఎందుకు రిజెక్ట్ అయిందో ఎవరూ చెప్పరు...
విద్యార్ధులు వీసా ఇంటర్వ్యూకి వెళ్లినపుడు ఒకవేళ దరఖాస్తును తిరస్కరిస్తే అందుకు కారణాలు ఎవరూ చెప్పరు. రిజెక్ట్ అయితే ఆమేరకు స్టాంప్ వేసి ఇస్తారు. నోటి మాటగా చెబుతారే తప్ప అది ఎందుకు తిరస్కరించారో కారణాలు ఇంటర్వ్యూ అధికారి చెప్పరు. నెక్ట్స్ అనే మాట మాత్రమే వస్తుంది. తిరస్కరణకు గురి కాకపోతే పాస్ట్ పోర్ట్ ను తర్వాత కలెక్ట్ చేసుకోండి అనే మాట చెబుతారు.
మధ్యవర్తులు, కన్సెల్టీల బెడదను పూర్తిగా నియంత్రించాలని అమెరికన్ నూతన అధ్యక్షుడు ట్రంప్ పాలకవర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగానే భారతీయ విద్యార్థుల వీసాలు రిజెక్ట్ అవుతున్నాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కన్సల్టెన్సీ అని ఏ మాత్రం అనుమానం వచ్చినా నిర్దాక్షణ్యంగా తిరస్కరిస్తున్నారు. వ్యక్తిగత వివరాలు, చదివిన యూనివర్శిటీ, దాని రికార్డులో ఏ మాత్రం తేడా కనిపించినా వీసాలు రావడం లేదు. గతంలో వీటిని పెద్దగా పట్టించుకునే వారు కాదని ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చాక దీనిపై నిఘా పెరిగిందని చెబుతున్నారు.
2023-24 విద్యా సంవత్సరంలో 6.79 లక్షల ఎఫ్-1 వీసా దరఖాస్తులు వస్తే వీటిలో 2.79 లక్షలు అంటే 41% రిజెక్ట్ అయ్యాయి. దీంతో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు అమెరికా ఆశలు వదిలేసుకుని యూకే, జర్మనీ, చైనా, పోలెండ్ వంటి ఇతర దేశాల వైపు చూస్తున్నారు అని వార్సాలో చదువుతున్న సాయి ఫణి కుమార్ అనే విద్యార్థి తెలిపారు. గత ఏడాది కంటే 2024-2025 విద్యాసంవత్సరంలో భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగిందని అన్నారు.

2018 నుంచి 2024వరకు హైదరాబాద్ లోని యూఎస్ కాన్సలేట్ కార్యాలయం మంజూరు చేసిన వీసాల సంఖ్య (గ్రాఫ్)

US డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ (DoS) ప్రతి ఏటా ఒక్కో దేశానికి ఎంతమేరకు F1 వీసాలు ఇవ్వాలో ముందే నిర్ణయిస్తుంది. నిర్దిష్ట దేశం లేదా కాన్సులేట్/ఎంబసీలో ఏదైనా వీసా తిరస్కరణకు గురైతే అధికారిక వివరణ ఇవ్వదు.
2023లో హైదరాబాద్ లో 32,703 మందికి ఎఫ్ 1 వీసాలు వస్తే 2024లో 20,411 మందికి మాత్రమే వచ్చాయి.

2024లో హైదరాబాద్ కాన్సులేట్ కార్యాలయం నెలవారీ మంజూరు చేసిన వీసాలు

2023 నవంబర్ 1,606 మందికి, డిసెంబర్ లో 2567మందికి వీసాలు వస్తే 2024 నవంబర్, డిసెంబర్ లో ఏ ఒక్కరికీ వీసాలు రాకపోవడం గమనార్హం. 2025లోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చునని భావిస్తున్నారు.
ఓవర్ స్టే కూడా ఓ సమస్యే..
ఎఫ్ 1 వీసా గడువు ముగిసినా అమెరికాలోనే కొందరు ఉండిపోవడం కూడా కొత్తగా వెళ్లాలనుకునే వారి ఆశలపై నీళ్లు చల్లుతోందని టెక్సాస్ రాజధాని ఆస్టిన్ ఉంటున్న కృష్ణమాచార్య చెప్పారు.
"2023లో దాదాపు 7,000 మంది భారతీయ విద్యార్థులు USలో తమ వీసాల కంటే ఎక్కువ కాలం గడిపారు (2023 ఆర్థిక సంవత్సరానికి US డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కాంగ్రెస్‌కి ఇచ్చిన నివేదిక ప్రకారం 7,081). వారిలో చాలా మంది ఉద్యోగాన్వేషణలో నిమగ్నమైన వారేనని ఆయన వివరించారు. ఏ కొద్దిమందో తప్ప అమెరికా వచ్చిన ప్రతి విద్యార్థీ ఇక్కడే ఉండిపోవాలనుకోవడం కూడా సమస్యగానే మారుతోంది. ఈ పరిస్థితిని పసిగట్టే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని, గ్రీన్ కార్డులు ఉన్నవాళ్లని కూడా వదలకుండా సెర్చ్ చేస్తోందని చెప్పారు.
US కాన్సులేట్ ఏమంటోందంటే...
"మా వీసా ప్రక్రియ మాది. దానికో విధానం ఉంది. దేశ భద్రత, ప్రజా భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో రాజీ ఉండదు. వీసాలు ఎన్ని ఇవ్వాలనేది ముందే నిర్ణయం అవుతుంది. ఆప్రకారమే జారీ చేస్తుంటాం. 2023-2024 విద్యా సంవత్సరంలో భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. యూఎస్ కి విద్యార్థులను పంపే దేశాలలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది" అని యుఎస్ కాన్సులేట్ ఒక ప్రకటనలో తెలిపింది.
విద్యార్థులే ఆసక్తి చూపడం లేదా?
ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న హడావిడి చూసి చాలామంది విద్యార్థులే యూఎస్ కి దరఖాస్తు చేసుకోవడం లేదని హైదరాబాద్ అమీర్ పేటలో కన్సల్టెన్సీ నడుపుతున్న విశేష్ చెప్పారు. అమెరికన్ లో ఉన్నత విద్య ఖరీదు కావడం, చదువు పూర్తయిన తర్వాత అధికారికంగా పార్ట్ టైమ్ జాబ్ చేసుకునే గడువును కుదించడం, విదేశీ విద్యార్థులపై దాడులు వంటివి కూడా విద్యార్థులపై ప్రభావం చూపుతున్నాయి.
Tags:    

Similar News