అక్కడ ప్రతిచెట్టూ వాళ్లకి కొండంత అండ

రాయలసీమ నిరుద్యోగులను అక్కున చేర్చుకున్న ఎస్వీయు క్యాంపస్ వనం, చేయూత నిస్తున్న తిరుపతి మనసున్న మనుషులు;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-07-11 09:41 GMT

శ్రీవారి పాదాల చెంత ఉన్న శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ ఆవరణ (Sri Venkateswara University: SVU) లోని చెట్లు ఇళ్లయ్యాయి. పై చదవులు పూర్తిచేసిన నిరుద్యోగులెందరినో అక్కున చేర్చుకుంటున్నాయి. పోటీ పరీక్షల యుద్ధానికి సిద్ధమవుతున్న యువకులకు అండగా నిలుస్తున్నాయి. చెట్లే కాదు, క్యాంపస్ లోని సైకిల్ స్టాండులు కూడా మేమూ మీకు తోడంటున్నాయి. సంచుల నిండా కలలు నింపుకుని గ్రామీణ ప్రాంతాల నుంచి ఎస్వీయు క్యాంపస్ కోసం తిరుపతి వస్తున్న వాళ్లందరికి ఈ చెట్టు , ఈ సైకిల్ స్టాండ్ అండగా నిలిచిన దృశ్యం చూపరులను చలించేలా చేస్తుంది.  ఇక్కడ నిరుద్యోగయుకులు పగలు చెట్ల కింద చదువుకుంటారు. సైకిల్ స్టాండ్స్ లో మూటా ముళ్లే దాచుకుంటారు.  రాత్రి హాస్టల్ వరండాల్లోనిద్ర.  మధ్యలో ఖర్చుల కోసం చిరుద్యోగాలు కూడా. క్యాంపస్ లో ఒక వైపు కనిపించే కొత్త ప్రపంచం.బాధమయ ప్రపంచం. 



మార్కెట్ లో ఉద్యోగాలు లేవు. స్టాఫ్ట్ వేర్  రంగంలో కూడా ఉద్యోగాలు బాగా తగ్గిపోయాయి. ప్రైవేట్ సెక్టర్ లో సోషల్ సైన్సెస్, హ్యమానిటీస్ చదివిన వాళ్లకు ఉద్యగాలు రావు.  ఇక  మిగిలింది. ఎపుడో పదేళ్లకో, పదిహేనేళ్లకో జరిగే ఎపి పిఎస్ సి (APPSC) పరీక్షలు, బ్యాంకు పరీక్షలే దిక్కు. టీచర్ పోస్టులు, కాన్  స్టేబుల్ ఉద్యోగాలు, గ్రూప్స్ ఎపుడు పడతాయని ఎదరుచూస్తూ రాష్ట్రంలో లక్షలాది వాటి కోసం జరిపే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ఎపుడో రాబోయే నోటిఫికేషన్ కోసం ఇప్పటినుంచే నగరాలలో ఉంటూ కోచింగ్ తీసుకునే వాళ్లు కొందరైతే, ఇళ్లదగ్గిరే ప్రిపేర్ అవుతున్నవాళ్లు మరి కొందరు. ఇళ్ల దగ్గిర వసతులు లేని వాళ్లు ఇలా క్యాంపస్ చెట్లకింద స్థిరపడుతున్నారు.

పేదల విద్యాలయాలు

ఆంధ్రప్రదేశ్ విశ్యవిద్యాలయాలలో గొప్ప సామాజిక పరివర్తన జరిగింది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో చదువుతున్న వాళ్లంతా పేదల పిల్లలే. రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నీ పేదల విద్యాలయాలే. ఎస్ సి, ఎస్ టి, బిసి లేదా అల్పాదాయ వర్గాల వారే. పేదరైతుల పిల్లలు, కులవృత్తుల చేసుకునే వారి పిల్లలే వారిలో ఎక్కువ. చదువుతున్నపుడు వీళ్లంతా హాస్టళ్లో ఉంటూ కోర్సు పూర్తి చేస్తారు. చదువు అయిపోయాక ఇలా పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంటారు.వీళ్లవరికి హోటళ్లలో భోజనం చేసి చదువుకునే స్తోమత్తు ఉండదు. ఆర్థాకలితోనే ముందుకు సాగుతూ ఉంటారు. నోటిఫికేషన్ పడుతుందని, పరీక్ష బాగా రాస్తామని, ఏదో ఒక  ప్రభుత్వోద్యోగం రాకపోదని ఆశే వీళ్లకి ఇంధనం. అదే ముందుకు నడిపిస్తూ ఉంది. ఇపుడు ఎస్వీయు చెట్లకింద కనపడుతున్న పేద విద్యార్థులంతా నిలువెత్తు భవిష్యత్తు మీద  కుటుంబం మొత్తం పెంచుకున్న ఆశల రూపాలు.

 తిరుపతి విద్యాకేంద్రం కాబట్టి ఈ వూరికొచ్చి చెట్లకిందనైనా ఉండి చదువుకుంటూ ఉంటే  పుసక్తాలు అందుబాటులో ఉంటాయి. యూనివర్శిటీల్లో చదువుతున్న స్నేహితుల అండవుటుంది.  సొంత వూరికి దగ్గరగా ఉంటారు. వీరంతా హైదరాబాద్ వెళ్లి గదులు అద్దెకు తీసుకుని, కోచింగ్ కేంద్రాల ఖర్చు భరంచలేని రాయలసీమ పేద పిల్లలు వీరంతా. 

యూనివర్సిటీలోని ఖాళీ గదుల్లో పునరావాసం కల్పించడానికి వీల్లేదు. వీళ్లిలా చెట్టకింద, సైకిల్ స్టాండ్స్ లో, హాస్టల్ వరండాల్లో కష్టపడి చదవడం చూసి చాలా మంది  దాతలు చలించి  వాళ్లకి సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. వాళ్లే వీళ్లకి  భోజనం అందిస్తున్నారు. ఇలా చదువుతూనే ఇటీవల జరిగిన పోటీ పరీక్షల్లో కొందరు ఉద్యోగాలు కూడా సాధించారు. ఇది మిగతావాళ్లందరిని ఉత్తేజపరిచే పరిణామం.
భోజనం వడ్డిస్తున్న ఎస్వీయూ చీఫ్ లైబ్రరియన్ ఆచార్య సురేంద్రబాబు
ఈ నిరుద్యోగులు చెబుతున్నది ఒకటే..
"మా బతుకులు చాలా చిన్నవి. కూలీనాలి పనులతో మా అమ్మ నాన్న సహకారం అందించారు. ఉన్నత ఉద్యోగాలు సంపాదించాలనేదే మా లక్ష్యం. పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి మాకు ఈ కష్టాలు అడ్డు కాదు" అని అంటున్నారు.
తిరుపతి ఎస్వీయూలో ఉన్నత చదువులు పూర్తయ్యాక హాస్టల్ గదులు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇంటికి వెళితే, భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని దాదాపు 400 మందికి పైగానే ఉన్నత విద్యావంతులు క్యాంపస్ ఆవరణను ఆశ్రయంగా మార్చుకున్నారు. అందుకు ప్రధాన కారణం ఎస్వీయూ లైబ్రరీలో అన్ని రకాల పుస్తకాలు ఉండడమే.
హౌస్ షిప్టింగ్ పనికి పోతా..

సోమనాథ్

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన సోమనాథ్ ఏమన్నారంటే..
"నేను ఏంఏ పాపులేషన్ స్టడీస్ పూర్తి చేశా. ఊరికి వెళితే.. చదువుకోవడానికి ఇబ్బంది. అందుకే ఎస్వీయూ ఆవరణలోనే గడుపుతున్నా" అని సోమనాథ్ చెప్పారు.
"చిన్నపాటి ఖర్చులకోసం హౌస్ షిప్టింగ్, ఇతర పనులకు నా మిత్రులతో కలిసి వెళతాం. తిరిగి వచ్చాక విశ్రాంతి తీసుకుని, చదువుకుంటాం" అని నవ్వుతూనే విశ్వనాథ్ చెప్పారు.
మాకు ఎకరన్నర భూమి ఉంది. పండించేది కష్టమే. నాకు చెల్లి ఉంది. మా అమ్మానాన్న పనులకు వెళతారు. వారికి ఇంకా కష్టం కలిగించకూడదు. అందుకే ఇంటి వద్ద ఉన్న కష్టాలతో పోలిస్తే. నేను చదువుకోవడానికి పడే కష్టాలు పెద్దవి కాదు" అని సోమనాథ్ వ్యాఖ్యానించారు.
"ఎస్వీయూలో చీఫ్ లైబ్రరియన్ వల్ల సహకారం బాగుంది. చదువుకోవడానికి అనుమతిస్తారు. ప్రముఖులు వస్తే, వారికి మా కష్టాలు చెప్పి, ఆహారం భోజనం కూడా పెట్టించారు" అని సోమనాథ్ వివరించారు.
"రైల్వేస్ లో ఎన్టీపీసీ ప్రిలిమ్స్ పాస్ అయ్యాను. మెయిన్స్ కోసం మళ్లీ ప్రిపేర్ అవుతున్నా. కానిస్టేబుల్ పరీక్ష కూడా రాశా" ఏది వచ్చినా ఓకే. ఉద్యోగం సాధించడం నా లక్ష్యం. ఆ తరువాత కూడా చదువుతా ఉన్నతస్థాయిలో ఉద్యోగం సంపాదిస్తా" అని సోమనాథ్ ధీమా వ్యక్తం చేశారు.
క్యాంపస్ లో మాకు బాగానే ఉంది. ఎవరి నుంచి ఇబ్బంది లేదు. కష్టపడకుంటే, భవిష్యత్తు లేదు అని రాజశేఖర్ అనే యువకుడు వ్యాఖ్యానించాడు.

"యూనివర్సిటీలో నిరుద్యోగుల కోసం వసతి కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మేలు జరుగుతుంది" అని రాజశేఖర్ తన కోరికను వెల్లడించాడు.
ఆకలిరాజ్యం..
రాయలసీమలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన నిరుద్యోగులు ఓ కుర్చీ కొనుకుని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలోని చెట్ల నీడను ఆశ్రయం చేసుకున్నారు. పుస్తకాల్లో తలదూర్చేసిన నిరుద్యోగులు అలసిసోతే, బ్యానర్లు పరుపులుగా సేదదీరుతున్నారు. ఉంటే తింటున్నారు. లేదంటే పస్తులతో పడుకుంటున్నారు. ఆకలి బాథ భరించలేకుంటే కుళాయి వద్ద నీటితో సేదదీరుతున్నారు. కొన్ని నెలలుగా అష్టకష్టాలు పడుతున్న నిరుద్యోగులను పట్టించుకున్న వారు తక్కువ.
మంచిని పెంచుతూ..
ఈ స్లోగన్ తో పతంజలి యోగ ప్రతినిధులు సామాజిక కార్యక్రమాలలో కరోనా నుంచి మమేకమయ్యారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (Sri Venkateswara institute of medical sciences), ప్రసూతి వైద్యశాల (maternity hospital), SVRR ఆసుపత్రి వద్ద రోగులకు ఆ సంస్థ ప్రతినిధులు దాతల సహకారంతో భోజనం పెట్టేవారు. దీనికి ఆర్యవైశ్య సంఘం, కిట్టు ఖాదీ బాండార్ స్నేహ హస్తం అందించాయి. క్యాంపస్ ఆవరణలోని నిరుద్యోగులకు శుక్రవారం మధ్యాహ్నం భోజనం వడ్డించడానికి వెళుతూ ఓటర్ కృష్ణ మాట్లాడారు.
ఒకరోజు రుయా ఆసుపత్రి వద్ద భోజనం వడ్డిస్తుంటే, నలుగురు యువకులు కూడా వచ్చారు.
"అన్నా మాకు భోజనం పెట్టండి అని అడిగారు" అని వేదాంతపురం మాజీ ఉపసర్పంచ్, ఏఐఎస్ఎఫ్ మాజీ నేత ఓటేరు కృష్ణ చెప్పారు. వారు తమాషాగా అంటున్నారని భావించా. విషయం తెలుసుకుంటే..
"ఎస్వీయూలో చదువు అయిపోయింది. పోటీ పరీక్షలకు చదువుకుంటున్నాం. మావి పేద కుటుంబాలు" అని చెప్పడంతో చాలా బాధేసింది అని ఓటేరు కృష్ణ 'ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్' ప్రతినిధితో తన అనుభవాన్ని పంచుకున్నారు.
"మొదట వారు పరిహాసం చేస్తున్నారని భావించాను. దాతలను వెంట తీసుకొని ఎస్వీయూలోకి వెళితే, 400 మందికి పైగానే విద్యార్థులు ఆశ్రయం కనిపించారు."అని కృష్ణ వివరించారు.
క్యాంపస్ లో కొన్ని నెలల కిందటి వరకు 180 నుంచి 200 మంది ఉండేవారు. చెట్ల కింద చదువుకోవడం. హాస్టల్ ఆవరణలో నిద్రించడం. యూనివర్సిటీ లైబ్రరీలో చదువుకోవడం వారి దినచర్యగా మార్చుకున్నారు.
"ఇటీవల జరిగిన పోటీ పరీక్షల్లో ఎనిమిది మంది ఉద్యోగాలు సాధించారు. ఒక యువకుడు రెసిడెన్షియల్ గురుకులాల్లో మూడు పోస్టులు సాధించాడు. ఏడు మంది పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు" అని ఓటేరు కృష్ణ వివరించారు.
"ఇప్పుడు క్యాంపస్ ఆవరణలో చెట్ల కింద చదువుకుంటున్న విద్యార్థులకు ఆర్యవైశ్య సంఘం దాత నుంచి బెడ్షీట్లు కూడా అందించాం" అని చెప్పారు.
హాస్టల్ గదులు ఖాళీ
ఎస్వీ యూనివర్సిటీలో ఐ బ్లాక్ ( I- Block) లో 98 గదులు ఉంటే 25 రూములు పీహెచ్డీ (Phd) విద్యార్థులకు ఇచ్చారు. గతంలో ఒకరు మాత్రమే ఉండే గదిలో ఇప్పుడు ఇద్దరికీ ఇచ్చారు.
హెచ్ బ్లాక్ (H-Block) హాస్టల్లో 250 గదుల్లో ఇది విద్యార్థులను ఖాళీ చేయించి ఆర్ట్స్ విద్యార్థులకు కేటాయించారు. డ్యూయల్ డిగ్రీలు చేసేవారికి పేమెంట్ సీట్ ఉన్నవారికి మాత్రమే కేటాయించారు. క్యాంపస్ లోని జనార్ధన్ భవన్ లో గదులు వికలాంగ విద్యార్థులకు మాత్రమే కేటాయించాలి.
దీనిపై ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకుడు జనార్దన్ ఏమంటున్నారంటే..
"పాసింగ్ అవుట్ విద్యార్థులకు అధికారికంగా రూములు కేటాయించరు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఎస్వీ యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజీ హాస్టల్ లో ఆశ్రయం కల్పించాలి. దీనివల్ల నష్టం ఏమిటి?" అని జనార్ధన్ ప్రశ్నించారు.
"రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పి4 (P4) వంటి కార్యక్రమం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు వర్తింపచేయాలి" అని జనార్ధన్ సూచించారు.
మా విద్యార్థులే కదా..

ఎస్ వి యూ క్యాంపస్లో చెట్ల కింద చదువుకుంటున్న విద్యార్థులు కూడా మా పిల్లలే. వారికి అవసరమైన మేరకు సహకారం అందిస్తున్నామని ఎస్వీయూ చీఫ్ లైబ్రరీన్ సురేంద్రబాబు చెప్పారు.
"లైబ్రరీలో చదువుకోడానికి వచ్చే విద్యార్థులకు పుస్తకాలు ఇస్తున్నా. ఆవరణలో కూడా మంచినీటి క్యాన్లు ఏర్పాటు చేయించా. యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్, రిజిస్టర్ కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు" అని చీఫ్ లైబ్రరీ సురేంద్రబాబు చెప్పారు. రిజిస్ట్రార్ ఓ బంగళా ఉచితంగానే కేటాయిస్తానని కూడా చెప్పినా, యువకులు క్యాంపస్ లో ఉండేందుకే ఇష్టపడుతున్నారని వివరించారు.
అన్నా క్యాంటీన్ మంజూరు
చెట్ల కింద చదువుకుంటున్న విద్యార్థుల్లో చాలామంది పేద వారే. వారి పట్టుదల మాటల్లో చెప్పలేం. యూనివర్సిటీ, లైబ్రరీని సందర్శనకు ప్రముఖులు కూడా వస్తుంటారు. వారి ద్వారా కూడా నిరుద్యోగ యువతకు సహకారం అందిస్తున్నారు.
"ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తో మాట్లాడించాను. వారు దరఖాస్తు కూడా ఇచ్చారు. దీంతో ఎస్ వి ఏ కు సమీపంలో అన్నా క్యాంటీన్ కూడా మంజూరు అయింది" అని చీఫ్ లైబ్రరీన్ సురేంద్రనాథబాబు చెప్పారు.
తిరుపతి జిల్లా కలెక్టర్ నుంచి కూడా అనుమతి వచ్చిందని, ఆర్ట్స్ కాలేజీకి సమీపంలో ఏర్పాటు చేసే క్యాంటీన్ వల్ల మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎస్వీయూ ఆవరణలో నిరుద్యోగ యువతకు ఓటేరు మాజీ ఉప సర్పంచ్ (సిపిఐ నేత) రెండేళ్లుగా భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఇదంతా దాతల సహకారం వల్లే జరుగుతుంది. ఖాదీ కిట్టు భాండార్, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు మొదట కాస్త ఇబ్బంది పడ్డారు. యూనివర్సిటీ, విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని వారు భావించారు.
ఓటేరు కృష్ణ సూచన మేరకు విద్యార్థులు పడుతున్న ఇక్కట్లను వీడియో చేసి వారి గ్రూపుల్లో వైరల్ చేశారు. దీంతో సానుకూల స్పందన లభించింది. పతంజలి యోగ, ఆర్యవైశ్య సంఘం లో పుట్టినరోజు వేడుకలు లేదా ఇంకా ఏదైనా ప్రత్యేక సందర్భం ఉంటే వారే వచ్చి విద్యార్థులకు భోజన సదుపాయాలు కల్పించడానికి ఏర్పాటు చేశారు.
టిటిడి స్పందించాలి

నిరుద్యోగుల సేవలో సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ

దాతల సహకారంతో సిపిఐ నాయకుడు ఓటేరు కృష్ణ చేస్తున్న సామాజిక సేవను ఆ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అభినందించారు. రెండు రోజుల కిందట క్యాంపస్లో దాతలు, నిరుద్యోగులతో ఆయన భేటీ అయ్యారు.
"మా వినతి మేరకు సిద్ధాంతాలు వేరైనా నిరుద్యోగుల కోసం దాతలు ముందుకు రావడం అభినందనీయం" అని సిపిఐ నారాయణ వ్యాఖ్యానించారు. ఇంకొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చి నిరుద్యోగ యువతకు అండగా నిలవాలని ఆయన అభ్యర్థించారు.
"తిరుపతి, తిరుమల లో వేలాది మందికి ఆకలి బాధ తీరుస్తున్న టిటిడి స్పందించాలి" అని సిపిఐ నారాయణ కోరారు. ఎస్ వి యూ క్యాంపస్ లో చెట్ల కింద చదువుకుంటున్న విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించాలని ఆయన సూచించారు.
పరువు, ప్రతిష్ట అనే పట్టుదలకు పోకుండా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం యంత్రాంగం కూడా నిరుద్యోగ యువతకు ఉతంగా నిలవాలని ఆయన కోరారు. దేశ భవిష్యత్తును నిర్దేశించే యువకులకు సాయం అందించాల్సిన అవసరాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగ యువకుల కోసం ప్రత్యేకంగా పునరావాస భవనాలు ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని Tirupati Sri Venkateswara University లోని పరిస్థితి చెప్పగానే చెబుతోంది.
వారికోసం యూనివర్సిటీ యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం, TTD అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూద్దాం.

Similar News