మాజీ మంత్రి కొడాలి నాని ఇంటిపై టీడీపీ శ్రేణుల దాడి..

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. మాకు చేసినదానికి ఇప్పుడు సమాధానం ఇస్తున్నామంటూ వైసీపీ నేతల కార్యాలయాలు, ఇళ్లపై దాడులు చేస్తున్నాయి.

Update: 2024-06-07 13:02 GMT

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. మాకు చేసినదానికి ఇప్పుడు సమాధానం ఇస్తున్నామంటూ వైసీపీ నేతల కార్యాలయాలు, ఇళ్లపై దాడులు చేస్తున్నాయి. వారికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు కూడా చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. ఈ నేపథ్యంలోనే తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. నాని డౌన్ డౌన్ అంటూ ఆయన నివాసంపైకి కోడిగుడ్లను విసిరారు టీడీపీ కార్యకర్తలు. రాజకీయ సన్యాసం సంగతేంటని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు తెలుగు యువత శ్రేణులు.. కొడాలి నాని ఇంటిపై దాడులు చేస్తూ నిలదీస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని టీడీపీ శ్రేణులను వెనక్కు పంపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది.

రాజకీయ సన్యాసం కథేంటంటే..

2024 ఎన్నికల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా, టీడీపీ గెలిచినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ కొడాలి నాని ప్రకటించారు. ఇప్పుడు ఆ సవాలే కొడాలి నానికి చిక్కులు తెచ్చిపెట్టింది. చేసిన సవాల్ ప్రకారం, ఆడిన మాట ప్రకారం ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవాలని తెలుగు యువత నేత పొట్లూరు దర్శిత్ డిమాండ్ చేస్తున్నారు. ‘‘అధికారంలో ఉండగా అధికారంతో వచ్చిన మదం తలకెక్కి కొడాలి.. ఇష్టారాజ్యాంగా వాగారు. చిన్నా పెద్దా తేడా లేకుండా నీచ పదజాలంతో ప్రతిపక్ష పార్టీ నేతలను తూలనాడారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓడి బయట ముఖం చూపలేక ఇంట్లో మూలన దాక్కున్నారు. దమ్ముంటే కొడాలి నాని ఇప్పుడు బయటకొచ్చి సమాధానం చెప్పాలి. మాట్లాడాలి’’ అని డిమాండ్ చేశారు. ఇకనైనా బుద్ది తెచ్చుకుని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు దర్శిత్.

అసలు ఎవరీ కొడాలి నాని..

రాజకీయాల్లో కొడాలి నాని ఒక సీనియర్ నేత. తెలుగు దేశం పార్టీ ద్వారా ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. హరీకృష్ణతో మంచి స్నేహం ఉంది. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో ఆయన వైసీపీ గూటికి చేరారు. 2014 ఎన్నికల్లో కూడా కొడాలి నాని విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో భారీ మెజార్టితో విజయం సాధించడంతో ఆయనకు జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తున్న నేపథ్యంలో పలువురితో సహా కొడాలి నాని మంత్రిగా తప్పించారు. పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న రెండున్నరేళ్లలో కొడాలి నాని అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉంటే టీడీపీ, చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్ర విమర్శలు చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. 2024లో మరోసారి గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన కొడాలి నాని.. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో చిత్తయ్యారు.

Tags:    

Similar News