టీడీపీ ఎమ్మెల్యేలలో 'సత్యవేడు' టెన్షన్
తాజాగా సత్యవేడు నియోజక వర్గంలో జరిగిన కొత్త నియామకం పైనే పార్టీలో చర్చ సాగుతోంది;
By : V V S Krishna Kumar
Update: 2025-07-08 11:25 GMT
తెలుగుదేశం రాజకీయాలలో ఆసక్తిర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.తెలుగుదేశం ఎమ్మెల్యేలలో సత్యవేడు టెన్షన్ పట్టుకుంది. తాజాగా సత్యవేడు నియోజక వర్గంలో జరిగిన కొత్త నియామకం పైనే పార్టీలో చర్చ సాగుతోంది.సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నచోట ఇంఛార్జ్‌ను నియమించడం ఆసక్తికరంగా మారింది.తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్‌గా కూరపాటి శంకర్ రెడ్డి ని పార్టీ అధిష్టానం నియమించింది.పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ను పక్కన పెట్టి మరొకరికి పార్టీ పెత్తనం అప్పగించడం నియోజక వర్గ తెలుగు తమ్ముళ్లలో రకకాల ఊహాగానాలకు తావిచ్చింది.
కూరపాటి శంకర్ రెడ్డి తిరుపతికి చెందిన పారిశ్రామికవేత్త.ఆయన గత ఎన్నికల్లో కాళహస్తి టికెట్ ఆశించినా కుదరలేదు. దీంతో తిరుపతి జిల్లాలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌తో శంకర్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే టాక్ వుంది. పేరుకు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ అని చెబుతున్నా,నియోజకవర్గ పగ్గాలు ఆయనకే అప్పగించారని, ఎమ్మెల్యేను డమ్మీ చేశారని చర్చ నడుస్తోంది.శంకర్ రెడ్డి పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా హాజరై హడావుడి చేశారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరి,విజయం సాధించారు.అయితే గతేడాది ఓ మహిళ చేసిన ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్నారు.ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు అధిష్టానం ప్రకటించింది. ఫిర్యాదు చేసిన మహిళ తన ఆరోపణల్ని వెనక్కు తీసుకోవడంతో ఆదిమూలం మళ్లీ టీడీపీలో యాక్టివ్ అయ్యారు.ఈ పరిణామాల నేపధ్యంలో లోకేష్ ఇటీవల సత్యవేడు నియోజక వర్గంలో పర్యటించారు.పార్టీ శ్రేణుల ఫీడ్ బ్యాక్ వచ్చిందో ఏమోగాని ఇప్పడు శంకర్ రెడ్డికి పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించి, ఎమ్మెల్యే ఆదిమూలంకు ముకుతాడు వేశారు.పార్టీలో ఇద్దరు నేతలు కలిసి నడుస్తారా.. చెరో వైపు లాగుతారో చూడాలి.
మిగతా ఎమ్మెల్యేల లోనూ చర్చ
పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే వున్నచోటే కోఆర్టినేటర్ ను నియమించిన అధిష్టానం చర్యతో మిగిలిన నియోజక వర్గాల వారిలోనూ చర్చ సాగుతోంది. హైకమాండ్ తీసుకున్న ఈ చర్య కేవలం సత్యవేడుకే పరిమితం అవుతుందా.. లేక అదను చూసి అవసరమైన చోట ఇదే ప్రయోగం చేస్తారా అన్న సందేహం మొదలైంది.ఇటీవల పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎమ్మెల్యేలకు హెచ్చరిక చేశారు.నలుగురితో ఇప్పటికే మాట్లాడానని మిగతా వారితో సమయానుకూలంగా మాట్లాడతానని గట్టిగానే చెప్పుకొచ్చారు.ప్రజా సమస్యలే ముఖ్యమన్న చంద్రబాబు , వివాదాలలో చిక్కుకునే వారికి చెక్ పెడతానని తేల్చి చెప్పారు.మరి సత్యవేడు నుంచే చంద్రబాబు యాక్షన్ షురూ చేశారేమో చూడాలి.