పద్ధతిని మార్చుకోండి

రాజ్యాంగాన్నే మార్చారు.. ఇక బిజినెస్ రూల్స్ మార్చుకోలేమా అని సీఎం చంద్రబాబు అన్నారు.

Update: 2025-12-10 08:09 GMT

ఏ పని చెప్పినా, ఏ కార్యక్రమం తలపెట్టినా కొందరు ప్రతికూల ఆలోచనలు చేస్తున్నారని, ఎలా ఆ పనిచేయకుండా ఉండాలి అనే విధంగా కొంతమంది ఆలోచిస్తున్నారని, ఈ పద్దతిని విడనాడాలని సీఎం చంద్రబాబు అధికారులను హెచ్చరించారు.  ప్రభుత్వం ఒక కార్యక్రమం తలపెట్టినా, ఒక ఆదేశం ఇచ్చినా సానుకూలంగా తీసుకుని దాన్ని అమలు చేయాలని అన్నారు.  హెచ్వోడీలు, కార్యదర్శులతో బుధవారం సచివాలయంలో సమావేశం అయ్యారు. ఈ సదస్సులో వారిని ప్రేరేపించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సూచనలు చేశారు. అధికారులు ఎవరూ ప్రతికూల ఆలోచనలు చేయవద్దన్నారు.

అధికారులు ఎవరూ ప్రతికూల ఆలోచనలు చేయవద్దన్నారు. ప్రభుత్వంలో ఏ స్థాయిలో అధికారి అయినా పాజిటివ్ ఆలోచనలతో పనిచేయాలని అప్పుడే మంచి ఫలితాలు వస్తాయని సీఎం వ్యాఖ్యానించారు. ”చాలా మంది అధికారులు ఎంతో అద్భుతంగా పనిచేస్తారు...మంచి ఫలితాలు చూపిస్తారు, అయితే వారి వ్యవహార శైలి, అనుసరించే విధానం కూడా బాగుండాలి. ప్రజలు, అర్జీదారుల సమస్యలపై సానుకూలంగా స్పందించే విధానాన్ని అలవర్చుకోవాలి. ఎంత మంచి ఫలితం సాధించినా...ఆ అధికారి ప్రవర్తన కూడా కూడా ముఖ్యమే” అని సీఎం అన్నారు. “ప్రభుత్వంలో అనేక శాఖల్లో 18 నెలల్లో చాలా మార్పులు తెచ్చాం. అయితే దేవాదాయ, రెవెన్యూ శాఖల్లో ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉంది. ఈ రెండు శాఖలు ఇంకా పికప్ అవ్వాలి.  కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత తిరుమల శ్రీవారి ఆలయంలో అనేక మార్పులు తెచ్చాం. ఆ తరహా మార్పులు దేవాదాయ శాఖలోని ప్రతి దేవాలయంలో రావాలి. ప్రభుత్వ శాఖల్లో ప్రతి సేవ ఆన్ లైన్‌లో పొందే పరిస్థితి రావాలి. అన్ని సేవలు ఆన్ లైన్‌లో రావడానికి జనవరి 15 డెడ్ లైన్. దానికి అవసరమైన కసరత్తు పూర్తి చేసి ఆన్ లైన్ సేవలు అందుబాటులో ఉంచాలి”అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

రాజ్యాంగాన్నే సవరించారు... బిజినెస్ రూల్స్ మార్చుకుంటే తప్పేంటి
ఈ మంత్రులు, హెచ్వోడీలు, సెక్రటరీలతో సదస్సులో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాజ్యాంగాన్నే అనేక సార్లు సవరించుకున్నాం.....ప్రజలకు మంచి చేయడానికి బిజినెస్ రూల్స్ మార్చుకుంటే తప్పేంటని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయడమే కాదని...అనవసర ఫైళ్లు సృష్టించే విధానం మారాలని స్పష్టం చేశారు. దీని కోసం అవసరం అయితే బిజినెస్ రూల్స్‌ను మార్చాలని సీఎం అన్నారు. పాలనను సులభతరం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని...దీని కోసం అధికారులు అనవసరంగా ఉన్న నిబంధనలను తొలగించాలన్నారు. శాఖల్లో పూర్తిస్థాయి మార్పులు తీసుకురావాలని..టెక్నాలజీ, డేటాలేక్ ద్వారా మరింత సమర్థంగా పాలన అందించాలన్నారు. ప్రతి శాఖలో ఆడిటింగ్ జరగాలని స్పష్టం చేశారు. ప్రతి అధికారి, ప్రతిశాఖ పనితీరు ఏ విధంగా ఉందో ప్రభుత్వం వద్ద పూర్తిస్థాయిలో సమాచారం అందుబాటులో ఉందని...దీన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ...విజన్‌తో ప్రతి అధికారి పనిచేయాలని సీఎం సూచించారు. 
Tags:    

Similar News