పోటీగా ప్రచారానికి దిగిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయులు

టిడిపి అభ్యర్థిపై గందరగోళం ఏర్పడింది. అధికార అభ్యర్థి, తిరుగుబాటు నేత, వేరువేరుగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

Update: 2024-04-11 03:53 GMT
(ఎస్.ఎస్.వి.భాస్కర్ రావ్)
తిరుపతి: అసంతృప్తి ఆగలేదు...అసమ్మతి తగ్గలేదు... అభ్యర్థి ఒకవైపు... ఆశావాహులు మరో వైపు ఎవరికి వారు వేరుగా ప్రచారం ప్రారంభించారు. ఒకరు అధినేత అధికారికంగా ప్రకటించిన అభ్యర్థి. మరోకరు టికెట్ ఆశించి భంగపడ్డవారు. ఒకరు సాయిబాబా ఆలయంలో పూజలు చేసి ఇంటింటి ప్రచారం చేస్తే... మరొకరు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అందరూ ఒక పార్టీ వారే.. అందరి చేతిలో పసుపు జెండాలే కావడంతో పార్టీ క్యాడర్‌లో అయోమయం నెలకొంది.

కడప జిల్లా రాజంపేట టీడీపీలో అయోమయం నెలకొంది. ఇటీవల రాజంపేట టీడీపీ శాసనసభ అభ్యర్థిగా సుగవాసి సుబ్రహ్మణ్యంను టీడీపీ అధినేత ప్రకటించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బత్యాల చంగల రాయుడు అప్పటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని, పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. 2024లో టికెట్ తనకే వస్తుందని ఆశించారు. అనూహ్యంగా పార్టీ అధినేత రాయచోటికి చెందిన సుగవాసి బాల సుబ్రహ్మణ్యంకు కేటాయించింది. దీన్ని పార్టీలో ఉన్న బత్యాల వర్గం వ్యతిరేకించింది. బాబు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ వచ్చారు.
బల ప్రదర్శన...
స్థానిక నేత అయిన తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇటీవల బత్యాల తన బల నిరూపణకు రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గలలో ర్యాలీలు నిర్వహించారు. టిడిపి చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు నుంచి ఆయనకు ఎలాంటి సానుకూల సంకేతాలు అందలేదు. టీడీపీ అధికారికంగా ప్రకటించిన అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం నియోజకవర్గంలో అందరిని కలుపుకుని ప్రచారానికి సిద్దమయ్యారు. బుధవారం ఆయన పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు.

బత్యాల కూడా ప్రచారం...
రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ బత్యాల చంగల రాయుడు కూడా పట్టణంలోని సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. టీడీపీ బలపరిచిన అభ్యర్థి తానేనని అధినేత ఎంపిక చేసిన తనకు ఓటు వేయాలని సుబ్రహ్మణ్యం కోరగా. అధినేత నిర్ణయం పునఃసమీక్షిస్తారని. నియోజకవర్గంలో బలమైన నేతను తానే అని తనకు ఓటు వేయాలని బీసీఆర్ కోరారు. ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారు. ఇద్దరిదీ ఒకే జెండా.. దీంతో క్యాడర్‌లో అయోమయం నెలకొంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీకి నష్టం జరిగే ప్రమాదం లేకపోలేదనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
వైఎస్ఆర్సీపీ నుంచి అసంతృప్తి నాయకులు భారీగా టీడీపీలోకి వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అంతర్గత కుమ్ములాటను చక్కదిద్దడానికి టిడిపి అధిష్టానం ప్రత్యేక చొరవ తీసుకోవాలని స్థానిక నాయకులు కోరుతున్నారు. అధికారికంగా అభ్యర్థిత్వం దక్కించుకున్న సుగవాసి బాలసుబ్రమణ్యం ఒకపక్క, తనకే టికెట్ ఇవ్వాలని పట్టుదలతో పోటీ ప్రచారం చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్ రాయుడు. వీరిద్దరి పట్ల టిడిపి అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.
Tags:    

Similar News