మోదీ కేబినెట్‌లో టీడీపీకి రెండు బెర్త్‌లు ఖాయం.. మరో రెండికి ఛాన్స్!

కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడనుంది. నరేంద్ర మోదీ కూడా మూడో సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని సన్నాహాలు చేసుకుంటున్నారు.

Update: 2024-06-09 08:47 GMT

కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడనుంది. నరేంద్ర మోదీ కూడా మూడో సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని సన్నాహాలు చేసుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో భారీ విజయం సాధించిన చంద్రబాబు.. కేంద్రప్రభుత్వ ఏర్పాటులో కూడా అత్యంత కీలకంగానే ఉన్నారు. దీంతో కేంద్ర కేబినెట్‌లో ఏపీ నుంచి ఎవరికి అవకాశాలు దక్కుతాయి? ఎన్ని దక్కుతాయి? దక్కితే ఏ పదవులు, ఏ శాఖలు దక్కొచ్చు? చంద్రబాబు డిమాండ్స్ ఏంటి? అన్న అంశాలపై కొన్ని రోజులు ఆంధ్రలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఏపీ పాత్రపై ఒకమోస్తర్ క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది. టీడీపీకి రెండు కేంద్ర పదవులు ఇవ్వాలని బీజేపీ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇప్పటికే అందుకు అభ్యర్థులు కూడా ఖరారు అయ్యారని, వారికి ముందస్తు సమాచారం కూడా వెళ్లిందని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. కానీ అధికారికంగా మాత్రం ఇంకా ఈ విషయంపై క్లారిటీ రాకపోవడంతో కేంద్ర మంత్రి పదవులను చేపట్టే నేతలపై ఆకాశాన్నంటేలా చర్చలు జరుగుతున్నాయి.

కేంద్ర పదవుల రేసులో వీరే

ఏపీకి మొత్తం నాలుగు ఎంపీ సీట్లు ఇవ్వడానికి బీజేపీ ఫిక్స్ అయిందని, వాటిలో రెండు టీడీపీకి, ఒకటి జనసేనకు, మరొకటి ఏపీ బీజేపీకి అందించాలని పార్టీ పెద్దలు నిర్ణయించారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ పదవుల కోసం భారీ పోటీనే జరుగుతోంది. ఫలానా నేతకే కేంద్ర మంత్రి పదవి అంటూ సోషల్ మీడియా వేదిగా జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. వీటిలో కామన్‌గా వినిపిస్తున్న పేర్లలో.. జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి, బీజేపీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, టీడీపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. వీరిలో బీజేపీ, జనసేన అభ్యర్థుల విషయంలో పెద్దగా చర్చ లేదు కానీ టీడీపీ అభ్యర్థుల విషయంలో చర్చ భారీగానే జరుగుతుంది. కానీ రామ్మోహన్ నాయుడు, పెమ్మసానికి కేంద్ర పదువులు ఖరారు అయ్యాయన్న ప్రచారం కూడా బాగానే జరుగుతోంది. మరోవైపు వీరు ఖరారైపోయారు. మరో రెండు పదవులు ఏపీకి ఇవ్వడానికి బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం.

కలిసొచ్చిన అదృష్టం, నేపథ్యం

కేంద్రమంత్రి పదవికి చంద్రబాబు.. కంజరాపు రామ్మోహన్ నాయుడు పేరును సిఫార్సు చేసినప్పుడు బీజేపీ వెనకడుగు వేసిందని, అతడు కుర్రవాడు.. కేంద్రపదవికి అతడు.. అంటూ ఆలోచనలో పడిందని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఆ సమయంలోనే రామ్మోహన్‌నాయుడు కుర్రవాడు అయినా అనుభవజ్ఞుడు, మూడుసార్లు విజయం సాధించిన నాయకుడు, ఇప్పటికీ ఎంపీగా పార్లమెంటులో తన మార్క్ చూపించుకున్నాడని చంద్రబాబు వివరించారని సమాచారం. ఆ తర్వాత అన్నీ బేరీజు వేసుకుని రామోహన్నాయుడికి కేంద్ర పదవి ఇవ్వడానికి బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూటమి వర్గాలు చెప్తున్నాయి.

అయితే కేంద్ర మాజీ మంత్రి, దివంగత ఎర్రనాయుడి కుమారుడిగా రామ్మోహన్‌నాయుడు రాజకీయ అరంగేట్రం చేశారు. ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా మూడుసార్లు శ్రీకాకుళం ఎంపీగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా ఫ్యాన్ జోరు సాగినా శ్రీకాకుళంలో మాత్రం సైకిల్ నిలబెట్టిన నేత రామ్మోహన్‌నాయుడు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడయిన ఎర్రాన్నాయుడి కుమారుడు, ఉత్తరాంధ్రలో వరుసగా విజయం సాధిస్తున్న యువ నేత, పార్లమెంటు వ్యవహారాల్లో మంచి అనుభవం ఉన్న నాయకుడిగా పేరొందిన రామ్మోహన్‌నాయుడికి కేంద్ర బెర్త్ కన్‌ఫార్మ్ అయినట్లే కనిపిస్తోంది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకునే చంద్రబాబు కూడా రామ్మోహన్‌నాయుడి పేరును బీజేపీ ముందు వెల్లడించారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.

సాధారణ వైద్యుడి నుంచి పార్లమెంటు స్థాయికి

కేంద్ర పదవులకు దాదాపు ఖరారయిన అభ్యర్థుల్లో పెమ్మసాని చంద్రశేఖర్ పేరుగా కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఈయన గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లిన పెమ్మసాని చంద్రశేఖర్.. అనతికాలంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు. అమెరికాలో వైద్యవిద్య లైసెన్సింగ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ‘యు వరల్డ్’ అనే ఫ్లాట్ ఫార్మ్‌ను సిద్దం చేసి, దీని ద్వారా అతి తక్కువ వ్యయంతోనే వారిని శిక్షణ అందించారు. ఈ సంస్థ ద్వారా వివిధ కోర్సుల్లో పరీక్షలకు‌ ఆన్‌లైన్ ద్వారా శిక్షణ అందిస్తున్న ఈ సంస్థ అనతికాలంలోనే రూ.వేల కోట్ల విలువైన సంస్థగా ఎదిగింది. అంతర్జాతీయంగా ఆయనకు ఉన్న అనుభవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం, ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో బాగానే పనిచేస్తుందని చంద్రబాబు విశ్వసించారు. అందుకే కేంద్ర పదవుల రేసులో ఆయన పేరును కూడా బాబు సిఫార్సు చేసినట్లు సమాచారం.

వేమిరెడ్డికి సహాయక మంత్రి!

ఈ క్రమంలోనే టీడీపీకి మరో రెండు కేంద్ర పదవులు ఇవ్వొచ్చని, అవి సహాయక మంత్రి పదవులు కానున్నాయని సమాచారం. వాటిలో ఒక సహాయక మంత్రి పదవిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అందించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు కేంద్ర కేబినెట్‌లో ఉండే ఏపీ నేతల గురించి కేవలం సమాచారమే తప్ప వారు ఏ శాఖలు అందుకోనున్నారు? వారే మంత్రులు అవుతారా? చంద్రబాబు సిఫార్సులను బీజేపీ అంగీకిరంచిందా? అన్న అంశాలపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. కానీ పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్‌నాయుడు ఇద్దరూ కలిసి ఢిల్లీ వెళ్లడంతో వారికి కేంద్ర కేబినెట్‌లో స్థానం ఖరారయిపోయినట్లే కనిపిస్తోంది. దాని గురించి మాట్లాడటానికే వారికి ఢిల్లీకి పిలిపించారని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకారం రోజునే కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుంది కాబట్టి ఈ అంశాలపై క్లారిటీ రావొచ్చని విశ్లేషకులు చెప్తున్నారు.

Tags:    

Similar News