శ్రీకాళహస్తీశ్వరాలయ ఈఓగా బాపిరెడ్డి..

శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయం దక్షిణకాశీగా ప్రసిద్ధి. ఈ క్షేత్రం ఈఓగా బాపిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

Update: 2024-11-03 08:49 GMT

దేశంలోనే చిత్తూరు జిల్లా ఆధ్యాత్మిక ఆలయాలకు నిలయం. తిరుమల శ్రీవారిక్షేత్రం తరువాత శ్రీకాళహస్తి దేవస్థానానికి అంతటి ప్రాధాన్యం ఉంది. దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ శైవ క్రేత్రాల్లో శ్రీకాళహస్తి ప్రధానమైంది. ఈ ఆలయ కార్యనిర్వహణాధికారి (Executive Officer)గా టీ. బాపిరెడ్డి ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు.


శ్రీకాళహస్తి పట్టణం తిరుపతి-విజయవాడ జాతీయ రహదారిపై ఉంది. ఆలయం పేరే ఊరికి కూడా సార్థకమైంది. దక్షిణ కైలాసంగా భావించే ఆ ఆలయం తిరుపతికి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణానికి బస్సు, రైలు మార్గాలు కూడా ఉన్నాయి. రాహు-కేతు పూజలకు ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు వస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ముక్కంటి క్షేత్రానికి నెల్లూరు జిల్లాకు చెందిన బాపిరెడ్డి కార్యనిర్వహణాధికారిగా నియమితులయ్యారు. ఆయన రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ గా ఉన్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఇప్పటి వరకు ఈఓగా ఉన్న ఎస్ఎస్. చంద్రశేఖర్ ఆజాద్ స్థానంలో డిప్యూటీ కలెక్టర్ బాపిరెడ్డిని రాష్ట్ర దేవాదాయ శాఖ నియమించింది. దీంతో..

ఈఓ బాపిరెడ్డి కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి చేరుకున్నారు. డిప్యూటీ ఈఓ ఎన్ఆర్. కృష్ణారెడ్డి వారికి స్వాగతం పలికి, శ్రీజ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మేధా గురుదక్షిణామూర్తి సన్నిధానం వద్ద శేష వస్త్రంతో సత్కరించి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వరాలయానిక సమీపంలోనే ఉన్న పరిపాలన భవనంలో టి.బాపిరెడ్డి కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Tags:    

Similar News