ముందు ఏపీలో రిపోర్టు చేయాల్సిందే..హైకోర్టు ఆదేశాలు

హైకోర్టు తీర్పు నేపధ్యంలో గత్యంతరం లేనిస్ధితిలో ఏపీలో రిపోర్టు చేయాల్సిన ఐఏఎస్ అధికారులు చీఫ్ సెక్రటరీ శాంతికుమారితో భేటీ అయ్యారు.

Update: 2024-10-16 12:29 GMT

వ్యక్తులకన్నా వ్యవస్ధలే గొప్పవని మరోసారి రుజువైంది. క్యాట్ తీర్పును చాలెంజ్ చేస్తు ఐదుగురు ఐఏఎస్ అధికారులు దాఖలు చేసిన కేసును తెలంగాణా హైకోర్టు కొట్టేసింది. తెలంగాణాలో పనిచేస్తున్న ఐదుగురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఈనెల 16వ తేదీలోగా ఏపీలో రిపోర్టు చేయాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ర ట్రైనింగ్ (డీవోపీటీ) ఈనెల 9వ తేదీన ఇదే పద్దతిలో ఏపీలో పనిచేస్తున్నముగ్గురు ఐఏఎస్ అధికారులను తెలంగాణాలో రిపోర్టు చేయాలని చెప్పింది. అయితే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్) ఆదేశాలను చాలెంజ్ చేస్తు తెలంగాణాలోని నలుగురు, ఏపీకి చెందిన ఒక ఐఏఎస్ అధికారి క్యాట్ లో కేసు వేశారు. అయితే వీళ్ళ కేసును క్యాట్ కొట్టేసింది. హైకోర్టు తీర్పు నేపధ్యంలో గత్యంతరం లేనిస్ధితిలో ఏపీలో రిపోర్టు చేయాల్సిన ఐఏఎస్ అధికారులు చీఫ్ సెక్రటరీ శాంతికుమారితో భేటీ అయ్యారు.

క్యాట్ తీర్పును చాలెంజ్ చేస్తు ఐఏఎస్ లు బుధవారం తెలంగాణా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వీళ్ళ పిటీషన్ను విచారించిన హైకోర్టు జస్టిస్ అభినందన్ కుమార్ శావలే విచారించారు. రెండువైపుల వాదనలు విన్న శావలే క్యాట్ తీర్పునే సమర్ధించారు. పైగా సర్వీసు వ్యవహారాల్లో న్యాయస్ధానాలు జోక్యం చేసుకోదని కూడా స్పష్టంగా చెప్పింది. ముందు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని తర్వాత విషయం తర్వాత చూసుకోవచ్చని కూడా గట్టిగానే సూచించింది. అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారుల సర్వీసు విషయాల్లో డీవోపీటీ నిర్ణయమే ఫైనల్ అని కూడా స్పష్టంగా ప్రకటించింది. ఇపుడు గనుక ఐఏఎస్ అధికారుల రిక్వెస్టుకు సానుకూలంగా స్పందిస్తే ఇది చెడు సంప్రదాయం అవుతుందని కూడా కోర్టు అభిప్రాయపడింది. క్యాట్, హైకోర్టు తీర్పులతో వ్యక్తులకన్నా వ్యవస్ధలే గొప్పవని మరోసారి నిరూపణైంది.

ఈ విషయం ఇంతగా ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే కొన్ని సంవత్సరాల క్రితం అంటే 2014 రాష్ట్ర విభజనే తర్వాత పై అధికారుల్లోని కొందరు డీవోపీటీ ఆదేశాలను చాలెంజ్ చేస్తు క్యాట్ లో కేసు వేశారు. అప్పుడు కూడా అధికారుల వాదనలను క్యాట్ కొట్టేసింది. డీవోపీటీ చెప్పిందే ఫైనల్ అని స్పష్టంగా ప్రకటించింది. దాంతో అధికారులు సుప్రింకోర్టులో రివ్యు పిటీషన్ దాఖలుచేశారు. వీళ్ళ వాదనలు విన్న సుప్రింకోర్టు సర్వీసు విషయాల్లో జోక్యం చేసుకోవటానికి నిరాకరించింది. డీవోపీటీ నిర్ణయమే ఫైనల్ అన్నట్లుగా వ్యాఖ్యానించింది. అయితే అప్పట్లో ఏవో కారణాలతో వీళ్ళు తమకు కేటాయించిన రాష్ట్రాలకు వెళ్ళకుండా ఎలాగో మ్యానేజ్ చేసుకున్నారు. ఇంతకాలానికి డీవోపీటీ వీళ్ళ విషయంలో సీరియస్ అయ్యింది. అందుకనే 16వ తేదీకల్లా కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాల్సిందే అని గట్టిగా చెప్పింది.

ఇపుడు కూడా ఏదోలా మ్యానేజ్ చేసుకోవచ్చన్న ఉద్దేశ్యంతో కొందరు ఐఏఎస్ అధికారులు మళ్ళీ క్యాట్ లో చాలెంజ్ చేశారు. అక్కడ కేసుకొట్టేస్తే తెలంగాణా హైకోర్టులో కేసు వేసి రెండోసారి కూడా భంగపడ్డారు. దీన్ని బట్టి అర్ధమవుతున్నది ఏమంటే వ్యక్తులకన్నా వ్యవస్ధలే గొప్పవని. ఇదే విషయాన్ని హైకోర్టు చెప్పింది. తమ కేసులను విచారించి స్టే ఇవ్వాలని ఐఏఎస్ అధికారులు కోర్టును కోరారు. అప్పుడు స్పందించిన కోర్టు ఐఏఎస్ అధికారులు అయినంత మాత్రాన అర్జంటుగా స్టే ఇచ్చేయాలా అని నిలదీసింది. కనీసం 15 రోజులైనా తమకు వెసులుబాటు కల్పించాలని రిక్వెస్టు చేసుకున్నా కోర్టు అంగీకరించలేదు. తాము ఈ విషయంలో జోక్యం చేసుకుంటే చెడు సంప్రదాయం అవుతుందని కోర్టు అభిప్రాయపడింది.

ఐఏఎస్ ల సమస్యేంటి ?

తెలంగాణా నుండి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మల్లెల ప్రశాంతి, వాకాటి కరుణ, ఎ. వాణీప్రసాద్, డీ. రొనాల్డ్ రాస్, కాటా అమ్రపాలితో పాటు ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష బిస్త్, అభిఫేక్ మహంతి ఏపీకి వెళ్ళాలి. అలాగే ఏపీ నుండి ఐఏఎస్ అధికారులు జీ. సృజన, సీ. హరికిరణ్, తోలేటి శివశంకర్ తెలంగాణాలో రిపోర్టుచేయాలి. నిజానికి అఖిలభారత సర్వీసు అధికారి అంటేనే దేశ అవసరాల దృష్ట్యా కేంద్రహోంశాఖ పరిధిలో పనిచేసే డీవోపీటీ వీళ్ళ సేవలను ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. కాకపోతే వీళ్ళని సర్వీసులోకి తీసుకున్నపుడే ఏదో ఒక రాష్ట్రానికి కేటాయిస్తుంది. నిజానికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎక్కడున్నా పెద్ద సమస్యలుండవు. ఎందుకంటే వీళ్ళకి పోస్టింగ్ రాగానే సదరు డిపార్ట్ మెంటులోని కిందిస్ధాయి ఉద్యోగులో మరొకళ్ళో వీళ్ళకు అన్నీ సౌకర్యాలు కల్పిస్తారు.

ప్రభుత్వం కూడా వీళ్ళకు క్వార్టర్సుతో పాటు నౌకర్లు, డ్రైవర్లు అందరినీ సమకూరుస్తుంది. అయినా పై ఉన్నతాధికారులు ఏపీ, తెలంగాణాలో పనిచేయమని డీవోపీటీ ఆదేశిస్తే వెళ్ళటానికి ఎందుకింతగా బాధపడుతున్నారో అర్ధంకావటంలేదు. వీళ్ళు జిల్లాల్లో కలెక్టర్లుగా, ఎస్పీలుగా పనిచేసినపుడు కిందస్ధాయి సిబ్బందిని బదిలీలు చేసి వాళ్ళు తమకు కేటాయించిన ప్రాంతాల్లో చేరేంతవరకు వదిలిపెట్టరు. సరే, ఎవరి సమస్యలు ఎలాగున్నా క్యాట్, హైకోర్టు తీర్పుల ద్వారా డీవోపీటీ ప్రిస్టేజి కూడా నిలిచిందనే చెప్పాలి. లేకపోతే భవిష్యత్తులో ప్రతి అధికారి డీవోపీటీ ఆదేశాలను క్యాట్, కోర్టుల్లో చాలెంజులు చేయటం మొదలుపెడితే ఇక డీవోపీటీ ఉండటమే దండగన్నట్లుగా తయారవుతుంది అనటంలో సందేహంలేదు.

Tags:    

Similar News