పిపిపి మెడికల్ కాలేజీల్లో నియామకాలు ఎవరు చేస్తారు?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ డాక్టర్ ఆలావెంకటేశ్వర్లు ప్రశ్న

Update: 2025-11-22 11:47 GMT

పీపీపీ (ప్రైవేట్, పబ్లిక్ పార్ట్ నర్ షిప్) విధానంలో మెడికల్ కళాశాలల ఏర్పాటు చేసినా 70 శాతం పేదలకు వైద్యం అందుబాటులో ఉంటుందని, ప్రభుత్వ నియంత్రణలోనే వైద్య కళాశాలలు పనిచేస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం పట్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రయివేటు రంగం ప్రవేశించాక ఇదెలా సాధ్యమో చెప్పాలని ఆయన కోరారు.

ఈ మధ్య వైద్య ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశంలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి పిపిపి మెడికల్ కాలేజీల్లో కూడా " నాణ్యమైన వైద్య విద్య, ఆధునిక వైద్యం పేదలకు  అందుతుందని పేర్కొన్నారు. దీనిని డాక్టర ఆలా వెంకటేశ్వర్లు తప్పు పట్టారు. పిపిపి మెడికల్ కాలేజీల గురించి మీద ఉన్న అనేక అనుమానాలను ఆయన వెల్లడించారు.

"పిపిపి మెడికల్ కాలేజీలు ప్రభుత్వ నియంత్రణలో కొనసాగితే,  ఈ వైద్య కళాశాలల్లో ఉద్యోగ నియామకాలు ప్రభుత్వం చేపడుతుందా?  ప్రైవేట్ యాజమాన్యమే చేపడుతుందా? అదేవిధంగా ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు అమలు అమలవుతాయా, లేదా?,"  అనే విషయాలను ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆయన కోరారు.

ఒకవేళ ఉద్యోగ నియమాకాలు ప్రైవేట్ యాజమాన్యమే చేపడితే అప్పుడు ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు, పీపీపీ మెడికల్ కళాశాలకు ఉన్న వ్యత్యాసం ఏమిటో తెలపాలని కోరారు.

ఇటీవల ముఖ్యమంత్రి ఓ సమావేశంలో మాట్లాడుతూ వైద్యులను హాఫ్ నాలెడ్జ్ డాక్టర్లంటూ ఎద్దేవా చేయడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  నేడు పీపీపీ విధానంలో ప్రతిభ లేకపోయినా కేవలం 15% మార్కులు మాత్రమే సాధించి కోట్లాది రూపాయలు వెచ్చించి మరీ వైద్య విద్యను అభ్యసించే వారి నుండి ఏ విధమైన సామర్థ్యాన్ని ఆశించవచ్చునో ముఖ్యమంత్రి  తెలపాలని  ఆన కోరారు.



జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ ప్రైవేట్ కార్పొరేట్ వైద్య సంస్థలకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కట్టబెట్టి రాజకీయ, ఆర్థిక లబ్ధి పొందాలని ప్రయత్నించడం తగదన్నారు. ఓవైపు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతిరోజూ వేలాది మంది రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తూ, వందలాది మంది మహిళలకు ప్రసూతి సేవలను అందిస్తూ, వేల సంఖ్యలో వైద్య విద్యార్థులకు ఉచితంగా వైద్య విద్యను అందిస్తుంటే, అలాంటి ప్రభుత్వ ఆసుపత్రులను, ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్వీర్యం చేస్తూ పీపీపీ పేరుతో కార్పోరేట్ వైద్య సంస్థలకు కట్టబెడితే పేదలు అప్పులు పాలవుతారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కేవలం పది కార్పొరేట్ వైద్య సంస్థలకు మాత్రమే టెండర్లలో పాల్గొనే అవకాశం లభించే విధంగా నిబంధనలను రూపొందించి, ప్రభుత్వ వైద్య కళాశాలలను వాళ్లకు కట్టబెట్టే ప్రయత్నాన్ని విరమించుకోవాలని కోరారు.

దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్ ప్రసంగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పీపీపీ విధానంలో ప్రభుత్వమే 50 ఎకరాల స్థలం కేటాయించి, అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెబుతుండగా కేవలం 50 శాతం సీట్లు మాత్రమే కన్వీనర్ కోటా కింద తీసుకోవడం ఎవరికి మేలు చేస్తుందో తెలపాలన్నారు. దళిత, గిరిజన, బలహీన వర్గాల ప్రజలు అత్యధికులు ప్రభుత్వ ఆసుపత్రులను వినియోగించుకుంటున్న పరిస్థితుల్లో వాటిని మరింత బలోపేతం చేయకుండా ప్రైవేట్ పరం చేయాలని పథక రచన చేయడం సబబు కాదన్నారు. ఈ అంశం పట్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విధాన ప్రకటన చేసి ప్రజలలో నెలకొని ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు. పీపీపీ పేరుతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసే ఆలోచన విరమించుకునేంతవరకు భావసారూప్యత గల రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలతో కలిసి ఐక్యంగా ఉద్యమిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. ధనుంజయ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.

Tags:    

Similar News