అనుమానంతో భార్యను కొట్టి చంపేశాడు

పెనుభూతంగా మారిన అనుమానం పచ్చని కాపురంలో చిచ్చు రేపింది.;

By :  Admin
Update: 2025-01-13 07:40 GMT

ఒకటి కాదు.. రెండు కాదు.. 26ఏళ్ల క్రితం పెళ్లైంది. ముగ్గురు బిడ్డలు ఉన్నారు. ఆ ముగ్గురు బిడ్డలకీ పెళ్లిళ్లు కూడా చేశారు. అయితే భార్యపై భర్తకు అనుమానం మాత్రం తొలిగి పోలేదు. పెనుభూతంలా వెంటాడుతూనే ఉంది. పచ్చని సంసారంలో చిచ్చు రేపింది. దీంతో భార్యా భర్తల మధ్య అన్యోన్యం కొరవడింది. తరచూ గొడవలు పడేవారు. తాజాగా మరో సారి గొడవ పడిన భర్త.. భార్యను కొట్టి చంపేశాడు. తర్వాత పోలీసు స్టేషన్‌కు వెళ్లి తప్పైపోయిందని లొంగి పోయారు. ఈ బాధాకరమైన దుర్ఘటన ప్రకాశం జిల్లా కంబంలో ఆదివారం చోటు చేసుకుంది.

కంభం పట్టణంలోని సాదుమియా వీధికి చెందిన శివగంగయ్యతో కంభం మండలం తురిమెళ్ల గ్రామానికి చెందిన ఆర్థవీటి నాగ అంజలకి 26 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశారు. శివగంగయ్య లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. దీంతో పాటుగా చిన్న పాటి ఫైనాన్స్‌ వ్యాపారాలు కూడా నడుపుతున్నాడు. భార్య అంజలి కంబం పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆయాగా పని చేస్తోంది. సంసారం చక్కగా సాగుతున్నా.. భర్త శివగంగయ్య, భార్య అంజలిపైన అనుమానాం పెంచుకున్నాడు. దీంతో పిల్లల ముందే భార్య, భర్తలు గొడవలు పడేవారు. పిల్లలకు పెళ్లైన తర్వాత కూడా వారిద్దరి మధ్య గొడవలు ఆగలేదు. అదే క్రమంలో శనివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో అంజలి, శివగంగయ్యలు గొడవలు పడ్డారు. కోపంతో ఊగి పోయిన భర్త శివగంగయ్య, పక్కనే ఉన్న చెక్కతో బలంగా కొట్టడంతో భార్య అంజలికి తీవ్ర గాయాలు కావడంతో మంచపైన పడి మృతి చెందింది.
విషయం తెలుసుకున్న అంజలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమార్తె అంజలిని అనుమానంతోనే అల్లుడు శివగంగయ్య కొట్టి చంపేశాడని కేసు పెట్టింది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. మార్కాపురం డీఎస్పీ నాగరాజు, సీఐ కే మల్లికార్జున, ఎసై నరసింహరావు ఘటన స్థలానికి వెళ్లి మృత దేహాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ వేలి ముద్రలు సేకరించారు. కంబం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టు మర్టం నిర్వహించిన తర్వాత అంజలి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరో వైపు భార్య అంజలి మరణించిందని నిర్థారించుకున్న తర్వాత భర్త శివగంగయ్య ఆదివారం తెల్లవారు జామున పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
Tags:    

Similar News