శ్రీకాకుళం పోరాట యోధుడు సుబ్బారావు పాణిగ్రహి సతీమణి మృతి
శ్రీకాకుళం సాయుధ పోరాటంలో మరణించిన సుబ్బారావు పాణిగ్రాహి జీవిత భాగస్వామి సురేఖ పాణిగ్రాహి జూలై 24న మరణించారు.;
By : The Federal
Update: 2025-07-24 14:27 GMT
శ్రీకాకుళం సాయుధ పోరాటంలో మరణించిన సుబ్బారావు పాణిగ్రాహి జీవిత భాగస్వామి సురేఖ పాణిగ్రాహి జూలై 24న మరణించారు. శ్రీకాకుళం జిల్లా, పలాస మండలం, స్వగ్రామం బొడ్డపాడులో చనిపోయారు. ఆమె మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
సాంప్రదాయక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పాణిగ్రాహి సాంప్రదాయ పద్ధతుల్లో సురేఖను వివాహం చేసుకున్నారు. మొదట సోంపేటలో నివాసం వున్నారు. నక్సలైట్ల పిలుపు మేరకు ఆ దంపతులు బొడ్డపాడు చేరి అక్కడి శివాలయంలో పూజారిగా చేరారు. పార్టీ నిర్ణయం మేరకు పరిసర గ్రామాల్లో యువతరాన్ని సాంస్కృతి రంగం వైపు మళ్ళించి చైతన్యం చేశారు. ఆమె తన భర్తకు సహకారంగా నిలిచారు. స్వయంగా ఆమె విప్లవోద్యమంలో పాల్గొనక పోయినా, పూర్తి సహకారం అందించారు. ఆమె పీడిత ప్రజల్ని ప్రేమించింది. విప్లవం పట్ల అకుంఠిత విశ్వాసంతో ఉండేవారు. తన భర్తతో పాటు వందలాది మంది అమరత్వం చెందినప్పుడు ఆమె ఈ త్యాగాలు వృధా కావని నమ్మారు. ఆమెను పరామర్శకు వెళ్లిన నాయకులు కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు విప్లవం పట్ల చెక్కు చెదరని విశ్వాసం ప్రకటించేది. ఆమె విప్లవోద్యమంలో నేరుగా పాల్గొనకపోయినా తన వంతు పాత్రను పోషించారు. పాణిగ్రాహి తీసుకున్న రాజకీయ సైద్దాంతిక పోరాట పంథాను కొనసాగించారు.
పాణిగ్రహి ఉద్యమంలో ఉన్న కాలంలో ఆమె పోలీసు వేధింపులను ఎదుర్కొన్నారు. అయినా తన భర్త పట్ల, ఆయన నమ్మిన విప్లవం పట్ల నమ్మకం సడలకుండా ఉండేవారు. సురేఖ పాణిగ్రహి అనేక కష్టాలు ఎదుర్కొన్నారు.
ఆమె మరణం పట్ల సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఏపీ రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. ఆమె చివరి జీవితంలో ప్రేమతో సేవాభావంతో పోషించిన నిరంజన్ కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.