కొత్త జీఎస్టీ–8వేల కోట్ల ప్రయోజనం
జీఎస్టీ 2.0 జీవో తెలుగు బుక్‌లెట్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీఎస్టీ సంస్కరణల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రూ. 8వేల కోట్ల ప్రయోజనం కలుగుతుందని అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు ఆదివారం జీఎస్టీ సంస్కరణలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జీఎస్టీ 2.0కి సంబంధించిన విడుదల చేసిన జీవో తెలుగు బుక్‌లెట్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. సోమవారం నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ 2.0 నెక్ట్స్ జెన్ సంస్కరణలు భారత దేశ ఆర్థిక వ్యవస్థను మరింతగా బలోపేతం చేస్తాయని ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ ఏ బాబు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఈ సంస్కరణల వల్ల ఖర్చులను తగ్గించడంతో పాటుగా ఏపీలోని అన్ని వర్గాల ప్రజలను శక్తిమంతం చేయడంతో పాటు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. వస్తువులపై జీఎస్‌టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం ద్వారా ఏపీలోని సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ధరల భారం కూడా తగ్గుతుందని ఏ బాబు సీఎం చంద్రబాబుకు వివరించారు.