'అంకురార్పణం'తో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

సెప్టెంబర్ 23 రాత్రి 7 నుండి 8 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం

Update: 2025-09-21 14:58 GMT
తిరుమల తిరుపతి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి తిరుమలలో ప్రారంభం కానున్నాయి. వైఖానస ఆగమ సాంప్రదాయం ప్రకారం సెప్టెంబర్ 23వ తేదీ రాత్రి 7గంటల నుండి 8 గంటల మధ్యలో నిర్వహించే ''అంకురార్పణ'' ఘట్టంతో ఈ బ్రహ్మోత్సవాలకు బీజం పడనుంది.

ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి వైదిక ఉత్సవానికి ముందు అంకురార్పణ చేపడతారు. నవధాన్యాలను మొలకెత్తించి ఈ భూమండలమంతా పాడిపంటలతో, పశుపక్ష్యాదులతో సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తారు.
సేనాధిపతి ఉత్సవం ….
శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు శ్రీ విష్వక్సేనుల వారిని ఈ సందర్భంగా ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చేపడతారు. జగద్రక్షకుడైన శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు శ్రీ విష్వక్సేనులవారు ఈ విధంగా మాడ వీధుల్లో ఊరేగుతారని ప్రాశస్త్యం.
మేదినిపూజ….
నవధాన్యాలు మొలకెత్తేందుకు అవసరమైన పుట్టమన్ను కోసం ముందుగా భూదేవిని ప్రసన్నం చేసుకునేందుకు మేదినిపూజ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు భూసూక్తాన్ని చదువుతారు.
అంకురార్పణ….
వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ముందుగా పాలికల్లో(మట్టికుండలు) పుట్టమన్ను నింపుతారు. వీటిలో నవగ్రహాలకు సంకేతంగా నవధాన్యాలు పోస్తారు. ఈ విత్తనాలు బాగా మొలకెత్తాలని కోరుతూ ఓషధీసూక్తాలను పఠిస్తారు. ఇందులో గోధుమలు – సూర్యుడు, బియ్యం – చంద్రుడు, కందులు – కుజుడు, పెసలు – బుధుడు, శనగలు – బృహస్పతి, అలసందలు – శుక్రుడు, నువ్వులు – శని, మినుములు – రాహువు, ఉలవలు – కేతువుకు సంకేతంగా భావిస్తారు.


 

అలాగే యాగశాలలో ఈ పాలికల చుట్టూ అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానతోపాటు మొత్తం 49 మంది దేవతలను ఆవాహన చేస్తారు.
అక్షతారోపణ…
ఈ పాలికల్లోని నవధాన్యాలను బ్రహ్మోత్సవాల 9 రోజుల పాటు పెంచుతారు. చివరిరోజున ఈ మొలలను వేరుచేసి స్వామివారికి అక్షతారోపణ చేస్తారు. ఈ మొలకలు ఎంత గొప్పగా చిగురిస్తే బ్రహ్మోత్సవాలు అంత ఘనంగా నడుస్తాయి అన్నది భక్తుల విశ్వాసం.
Tags:    

Similar News