Shock to Revanth|రేవంత్ ప్రభుత్వానికి సుప్రింకోర్టు షాక్
తెలంగాణలో సంచలనం సృష్టించిన టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మొదటిసారి షాక్ తగిలింది.;
తెలంగాణలో సంచలనం సృష్టించిన టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మొదటిసారి షాక్ తగిలింది. కేసులో బెయిల్ పిటీషన్ను విచారించిన సుప్రింకోర్టు నిందితుల్లో ఒకడైన అడిషినల్ ఎస్పీ తిరుపతన్నకు బెయిల్ మంజూరుచేసింది. నిందితుడికి బెయిల్ ఇవ్వటాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంత వ్యతిరేకించినా సుప్రింకోర్టు(Supreme court) జడ్జీలు బీవీ నాగరత్న, సతీష్ చంద్రశర్మ పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వవాదనను జడ్జీలు ఎందుకు పట్టించుకోలేదంటే కస్టడీలోనే ఉంచాలనేందుకు అవసరమైన కారణాలను చూపలేకపోయింది. కారణం ఏమిటంటే గడచిన పదిమాసాలుగా తిరుపతన్న జైలులోనే ఉన్నాడు. కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేకపోవటంతోనే ఎక్కువకాలం కస్టడీలో ఉంచటం సాధ్యంకాదని సుప్రింకోర్టు స్పష్టంగా చెప్పింది.
ఈకేసులో ఇంకా చాలామంది సాక్ష్యులను విచారించాలని, దర్యాప్తు జరుగుతున్న నేపధ్యంలో కీలకనిందితుడైన తిరుపతన్నకు బెయిల్ మంజూరుచేయవద్దని తెలంగాణ ప్రభుత్వం(Telangana government) తరపు లాయర్ సిద్ధార్ధ లూథ్రా చేసిన వాదనలను జడ్జీలిద్దరు కొట్టిపారేశారు. విచారణలో పురోగతిలేకుండా పదినెలలుగా తిరుపతన్న జైలులోనే ఉన్న విషయాన్ని జడ్జీలు గుర్తుచేశారు. ట్యాపింగ్ కేసు(Telephone tapping)లో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, డీఎస్పీ ప్రణీత్ రావుతో పాటు మరికొందరు కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు ప్రత్యర్ధుల పేరుతో కొన్ని వేలమంది మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయించిన విషయం తెలిసిందే. తమ ఫోన్లను కేసీఆర్ ట్యాపింగ్ చేయిస్తున్నట్లు ప్రతిపక్షంలో ఉన్నపుడే రేవంత్ రెడ్డి(Revanth) తదితరులు గోలగోల చేశారు. అయితే వీళ్ళ ఆరోపణలను అప్పట్లో కేసీఆర్(KCR) లెక్కేచేయలేదు.
విచిత్రం ఏమిటంటే రాజకీయ ప్రత్యర్ధుల ఫోన్లనే కాకుండా సెలబ్రిటీలు, వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులు, జర్నలిస్టులు, జడ్జీలతో పాటు వాళ్ళకుటుంబసభ్యుల ఫోన్లను కూడా కేసీఆర్ ట్యాప్ చేయించినట్లు బయటపడింది. ఏ స్ధాయిలో ట్యాపింగ్ జరిగిందంటే బీఆర్ఎస్ లోని అనుమానిత నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ట్యాపింగ్ అంశంపై చేయించిన విచారణలో చాలావిషయాలు బయటపడ్డాయి. ట్యాపింగ్ ఆరోపణలను విచారించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది. దాంతో ట్యాపింగులో కీలకంగా వ్యవహరించిన నలుగురు పోలీసు అధికారులను దర్యాప్తు బృందం అరెస్టుచేసింది. విచారణలో తాముచేసిన ట్యాపింగ్ విషయాలు మొత్తాన్ని బయటపెట్టారు.
అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన టీ ప్రభాకరరావు ఆదేశాలతోనే తాము వేలాది మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు అంగీకరించారు. వీళ్ళ వాగ్మూలం ఆధారంగా ప్రభాకరరావును అరెస్టు చేయటానికి జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎందుకంటే ట్యాపింగులో ఎప్పుడైతే ప్రణీత్ రావును దర్యాప్తు బృందం అరెస్టుచేసిందో మరుసటి రోజే ప్రభాకరరావు అమెరికాకు పారిపోయారు. అప్పటినుండి విచారణకు సహకరించకుండా, ఇండియాకు తిరిగిరాకుండా ప్రభాకరరావు అమెరికా(America)లోనే ఉండిపోయారు. మాజీ చీఫ్ ను ఇండియాకు రప్పించేందుకు హైదరాబాదు పోలీసులు ఎంతప్రయత్నిస్తున్నా పెద్దగా ఉపయోగంలేకపోతోంది. ప్రభాకరరావు దొరికితే కాని ట్యాపింగ్ కేసు కొలిక్కిరాదు. దొరకటంలేదు కాబట్టి కొన్నినెలలుగా ట్యాపింగ్ దర్యాప్తులో పెద్దగా పురోగతికనబడలేదు. ఈకారణంగానే ఇపుడు తిరుపతన్నకు సుప్రింకోర్టు బెయిల్ మంజూరుచేసింది. మరి అరెస్టులోనే ఉన్న మిగిలిన అధికారుల విషయంలో కోర్టు ఏ విధంగా వ్యవహరిస్తుందో చూడాలి.