ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోండి..కేంద్రం సాయం చేసేలా చూడండి

ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసి ఆర్థిక సంఘం ప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్‌ అవసరాలను వివరించిన సీఎం చంద్రబాబు.;

Update: 2025-04-16 09:03 GMT

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాక్‌లో ప్రత్యేకంగా ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జబిషన్‌ ద్వారా కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించారు. ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలను కూడా వారికి చూపించారు. ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం, వాటి ప్రాముఖ్యత, అవసరమైన నిధుల గురించి వారికి తెలియజేశారు. పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాముఖ్యతను, దాని ప్రాధాన్యతను కూడా కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించారు. దీంతో పాటుగా అమరావతి రాజధాని నిర్మాణం, దీనిపైన కూటమి ప్రభుత్వ ఆలోచలనలు, ప్రణాళికలను సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించారు.

అంతేకాకుండా ప్రత్యేకంగా తయారు చేసిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ కూడా సీఎం చంద్రబాబు ఇచ్చారు. స్వర్ణాంధ్ర విజన్‌ 2047, కూటమి ప్రభుత్వ లక్ష్యాలు, వాటిని చేరుకునేందుకు అవసరమైన ప్రణాళికలు, వాటిని అమలు చేసేకుందుకు అవసరమైన నిధులు వంటి కీలక అంశాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్ర విభజన, విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, ఆర్థిక పరమైన కష్టాలును కూడా వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గట్టెక్కాలంటే, అమరావతి నిర్మాణం సజావుగా సాగాలంటే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలంటే ఆర్థిక వనరులు అవసరమని, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అదనంగా సాయం చేసేందుకు చొరవ తీసుకోవాలని, ఆ మేరకు ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి ఇవ్వాలని కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులను సీఎం చంద్రబాబు కోరారు. ఈ కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యవుల కేశవ్, నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. అంతకు ముందు ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వచ్చిన పనగారియా నేతృత్వంలోని 16వ కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధుల బృందానికి పూల బొకేలు అందజేసి సాదరంగా ఆహ్వానం పలికారు. నాలుగు రోజుల పాటు ఈ బృందంలో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనుంది. విజయవాడ, తిరుపతి, నగరాల్లో కూడా ఈ బృందం టూర్‌ చేయనుంది.
Tags:    

Similar News