Knife in the Classroom | తరగతిలో కత్తితో కలకలం రేపిన విద్యార్థి
ఓ విద్యార్థి బడికి కొడవలి తీసుకుని వెళ్లడం కలకలం చెలరేగింది.;
By : SSV Bhaskar Rao
Update: 2024-12-09 16:10 GMT
విద్యార్థుల దాడిలో అన్నమయ్య జిల్లా రాయచోటిలో మరణించిన విషయం తెలిసిందే. ఈ మంటలు ఆరకముందే ఇదే జిల్లా మదనపల్లెలో ఓ విద్యార్థి పుస్తకాల బ్యాగులో కొడవలి తీసుకుని వెళ్లడం కలకలం రేపింది.
వినోదాన్ని గ్రహించాల్సిన పసిమనసులు నేర ప్రవృత్తిని త్వరగా మెదడుకు ఎక్కించుకుంటున్నాయి. ప్రశ్నించే స్వభావం, దండిస్తే తిరగబడడం కూడా పిల్లల్లో ఎక్కువ అవుతోంది. ఆ కోవలోనే అన్నమయ్య జిల్లా రాయచోటిలో మందలించిన ఉపాధ్యాయుడు విద్యార్థుల దాడిలో మరణించిన విషయం తెలిసిందే. దీనికి విద్యార్థులు దాడి చేయడం వల్ల అనే ఆరోపణలతో పాటు సహచర టీచర్లు బాధిత కుటుంబ సభ్యులకు సకాలంలో సమాచారం ఇవ్వకపోవడంలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా,
అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి సోమవారం పుస్తకాలతో పాటు కొడవలి తీసుకుని వెళ్లడం కలకలం రేపింది. పాఠశాలలోని పదో తరగతి విద్యార్థి పుస్తకాల బ్యాగులో ఓ కొడవలి పెట్టుకుని వెళ్లాడని తెలిసింది. ఆ కత్తి చూపించి బెదిరించడంతో భయపడిన విద్యార్థినులు పరుగులు తీసినట్లు చెబుతున్నారు.
రాయచోటిలో జరిగిన సంఘటనను గుణపాఠంగా తీసుకున్న పాఠశాల హెచ్ఎం స్పందించారని చెబుతున్నారు. కత్తి తీసుకుని వచ్చిన విద్యార్థిని స్టాఫ్ రూంకు తీసుకుని వెళ్లి, కౌన్సెలింగ్ ఇచ్చారని తెలిసింది. అదే సమయంలో ఎందుకైనా మంచిదని ముందుజాగ్రత్తగా మదనపల్లె పోలీసులకు సమాచారం కూడా ఇచ్చారు. వెంటనే ఎస్ఐ వెంకటశివ సిబ్బందితో కలసి పాఠశాల వద్దకు చేరుకుని, విద్యార్థితో మాట్లాడడంతో పాటు, వారి తల్లిదండ్రులను కూడా పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.దీనిపై మదనపల్లె వన్ టౌన్ ఎస్ఐ వెంకటశివను 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధి సోమవారం రాత్రి పలకరించారు.
"పదో తరగతి విద్యార్థి తరగతిలోకి కొడవలి తీసుకుని వచ్చిన విషయం వాస్తవమే" అని నిర్ధారించారు. "పేదలైన ఆ విద్యార్థి తల్లిదండ్రులతో పాటు బడికి రాకముందు కట్టెలు కొట్టడంలో సాయం అందించాడు. బడి సమయం కావడంతో అలాగే వచ్చేశాడు" అని ఎస్ఐ వివరించారు. విద్యార్థితో పాటు, అతని తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చామని, పనులతో పాటు పిల్లల కదలికలపై కూడా ప్రత్యేకంగా దృష్టిసారించాలని హితవు చెప్పామన్నారు. ఆ విద్యార్థి ఆలోచనలు పక్కదారి పట్టలేదనే విషయం అర్థమైందని ఎస్ఐ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.