రాష్ట్రంలో మహిళల హక్కులను కాలరాస్తే కఠిన చర్యలు
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా డాక్టర్ రాయపాటి శైలజ సోమవారం బాధ్యతలు చేపట్టారు.;
By : The Federal
Update: 2025-05-19 11:56 GMT
రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకు అన్యాయం జరిగినా, వారి హక్కులను కాలరాసేందుకు ప్రయత్నించినా అలాంటి వారిపైన కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా రాయపాటి శైలజ మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారతే ధ్యేయంగా, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తానని తెలిపారు. గత ఐదేళ్లలో మహిళా కమిషన్‌లో ఫిర్యాదులను పట్టించుకోలేదని, పాత ఫిర్యాదుల దుమ్ముదులిపి ఫిర్యాదు చేసిన బాధితులకు న్యాయం చేస్తానని హామి ఇచ్చారు. అవసరమైత వాటిని జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా మహిళలపై అసభ్య పోస్ట్ లు పెడుతున్నారని, అలాంటి వారు తీరు మార్చుకోవాలని, లేని పక్షంలో వారిపైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే మహిళలపట్ల గౌరవం పెంచేలా అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాల మీద ఫిర్యాదుల కోసం తమ శాఖ ఆధ్వర్యంలో ఒక వెబ్ సైట్ రూపొందించనున్నట్లు ఆమె తెలిపారు. ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, అవి ఏయే దశల్లో ఉన్నాయనే వివరాలన్నీ ఆ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. తనపై నమ్మకంతో మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా తనకు బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు, ఇతర నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, ప్రముఖ వ్యాపార, విద్యా వేత్త రాయపాటి గోపాలకృష్ణ, రమేష్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రమేష్ బాబు, టీడీపీ నాయకులు ఈ సందర్భంగా రాయపాటి శైలజకు అభినందనలు తెలిపారు.