జూన్ 12 తర్వాత ఎప్పుడైనా తనిఖీలు చేస్తా
ప్రభుత్వ పథకాలు, సేవలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.;
By : The Federal
Update: 2025-05-19 14:25 GMT
జూన్ 12 తరువాత ఎప్పుడైనా రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, వివిధ ప్రభుత్వ సేవలపై సోమవారం సిఎస్, సిఎంవో కార్యదర్శులతో సచివాలయంలో సమీక్ష చేశారు. పథకాలు, సేవలపై ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌ను.. రేషన్, దీపం, ఎపిఎస్‌ఆర్టీసీ, పంచాయతీ సేవలపై వెల్లడైన ప్రజాభిప్రాయాలపైన చర్చించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తుందని... అన్ని శాఖల్లో ప్రభుత్వ పనితీరు, ప్రజా సేవల విషయంలో పూర్తి స్థాయి సంతృప్తి కనిపించాలని సిఎం ఆదేశించారు. కొన్ని శాఖల్లో మార్పు వచ్చిందని... అయితే ఆర్టీసీ వంటి చోట్ల ఇంకా సేవల్లో నాణ్యత పెరగాల్సి ఉందని, దీనికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
రేషన్ పంపిణీలో, నాణ్యతపై ప్రజల సంతృప్తిలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, ఆర్టీసీ సేవల విషయంలో ప్రయాణికుల నుంచి ఆశించన స్థాయిలో సంతృప్తి వ్యక్తం కావడంలేదని దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. బస్సా్టండ్‌లలో తాగునీటి సౌకర్యం, టాయిలెట్ల నిర్వహణ విషయంలో ప్రయాణికుల నుంచి అసంతృప్తి వస్తోందని దీన్ని సరిచేసుకోవాలని సిఎం సూచించారు. ఇక తాగునీటిపై 44 శాతం, టాయిలెట్లపై 55 శాతం మంది అసంతృప్తి వెల్లడించారని, పంచాయతీ సేవలకు సంబంధించి..ఇంటి నంచి చెత్త సేకరణ జరుగుతుందా అనే ప్రశ్నకు 60 శాతం మంది అవుననే చెప్పారని, గతంతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ మెరుగైందని సిఎం అన్నారు. ప్రభుత్వ సేవల విషయంలో డాటా అనలిటిక్స్ ఆధారంగా ఆయా ప్రభుత్వ శాఖల తమ పనితీరును క్షేత్ర స్థాయి నుంచి పరిశీలించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను సమర్థవంతంగా విశ్లేషిస్తే ప్రభుత్వ సేవల్లో అనూహ్య మార్పులు తేవచ్చన్నారు. జూన్ 12వ తేదీ నాటికి 500 సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్‌లో 300 ఎకరాల్లో ఏర్పాటు కానుందని సీఎం చంద్రబాబు తెలిపారు.