రాష్ట్రాభివృద్ది మా బాధ్యత
ప్రజలు మాపై పెద్ద బాధ్యత పెట్టారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించి ముందుకు తీసుకెళతాం. ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేస్తాం. చరిత్రలో ఈ తీర్పు మరువలేనిది.
Byline : G.P Venkateswarlu
Update: 2024-06-05 08:49 GMT
రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకు పోయింది. ఎలా బాగుచేయాలో లోతుల్లోకి వెళ్లి పరిశీలించాలి. ప్రజలు గెలిపించారు. వారి బాధ్యత అయిపోయిందనిపించారు. ఇక మా బాధ్యత ఉంది. అలాగని మేము చేసిన పనిని చూసి మంచో చెడో చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. బుధవారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో జరిగే ఎన్‌డీఏ కూటమి మీటింగ్‌కు వెళ్లేందుకు ముందుగా మొదటి సారి మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడం కోసం నిరంతరం పనిచేస్తామని చెప్పటం విశేషం.
ఊహించని విధంగా ఫలితాలు. కారణాలు అనుభవించే ప్రజలకు తెలుస్తుంది. ప్రాథమిక హక్కు, మాట్లాడే స్వేచ్చ, బతికే స్వేచ్చ, ఆస్తులు పోగొట్టుకునే పరిస్థితి రావడాన్ని వారు సహించలేకపోయారు. అందుకే మార్పును కోరుకున్నారు.
అందరం కలిసాం. ప్రజలు గెలవాలి అనుకున్నాం. నాజీవితంలో ఇంత చరిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు. ఎక్కడో అమెరికాలో ఉన్న వారు లక్షలకు లక్షలు చార్జీలు పెట్టుకుని, పక్క రాష్ట్రాల్లో కూలి పనులు చేసుకునే వ్యక్తులు సొంత చార్జీలు పెట్టకుని, భోజనం కూడా ప్యాక్ చేసుకుని వచ్చి వారు తెచ్చుకున్న భోజనం తిని, ఓటేసి వెళ్లారు. ఈ కమిట్ మెంట్‌ను ఏ విధంగా వర్ణించాలి. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లికించదగిన ఎన్నిక ఇది అంటూ ఓటర్లను చంద్రబాబు ప్రశంశించారు.
పోలయిన ఓట్లు 55.38 శాతం, తెలుగుదేశం పార్టీకి 45.60 శాతం రాగా వైఎస్సార్‌సీపికి 39.67 శాతం పోలయ్యాయి. అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనం, ఏదంటే అది చేస్తామనుకుంటే ప్రజలు క్షమించే పరిస్థితి లేదు. అవినీతి, అహంకారంతో ఉండే వారిని ప్రజలు క్షమించరు. చాలా మంది కార్యకర్తలు కంటినిండా నిద్రపోని పరిస్థితి. జై జగన్ అనలేదని చంద్రయ్యను చంపారు.
మీడియాను వేదించిన విధానం తలుచుకుంటే ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలవంచుకోవాలి. ఎవరిని ఏమైనా చేయోచ్చని దుర్మార్గాలు చేశారు. పవన్‌కళ్యాణ్ స్వేచ్చను హరించారు. విశాఖ వెళితే తిరిగి వచ్చేట్లు చేశారు. కేసులు ఎందుకు పెట్టారంటే ముందు అరెస్ట్ చేసి తర్వాత కేస్ డీటెయిల్స్ ఇస్తామంటున్నారు.
పాలకులమే కాదు.. సేవకులం.. గుర్తుపెట్టకుని పనిచేస్తాం. సూపర్ సిక్స్ ఇచ్చాం. ప్రజలు మాపై నమ్మకాన్ని ఉంచారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పవన్‌కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఎంతో అభినందనీయం. కూటమిలో మూడు పార్టీలు కలిసి పనిచేశాయి. ఐదేళ్ల విధ్వసం 30 సంత్సరాల డ్యామేజ్. అప్పులైతే ఎంత చేశారో లోతుకుపోతే తప్ప తెలియదు. సంబంధంలేని వ్యవస్థపై డబ్బులు తీసుకొచ్చి సంబంధం లేని వాటిపై ఖర్చుపెట్టారు. బాధ్యత ఉంది. ఏవిధంగా చేయాలో ప్రణాళిక తయారు చేసుకుంటాం. వ్యవస్థలు విధ్వంసమయ్యాయి. ఎకానమీ కుప్పకూలిపోయింది. వ్యవస్థలన్నీ పునరుద్దరించాల్సిన బాధ్యత ఉంది. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాల్సి ఉందని బాబు అన్నారు.
ఇప్పుడు 9సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. ఎందుకు పెంచారో రీజనే లేదు. సంబంధంలేని వ్యవస్థతో డబ్బులు తెచ్చి సంబంధంలేని శాఖలకు ఇచ్చారు. ప్రజలకు దారి చూపిస్తాం.
నాకూ నాకుటుంబానికి, నా భార్యపై జరిగిన దాడిని మరిచిపోలేను. నాపై బాంబుల దాడిజరిగినప్పుడు కూడా నేను భయపడలేదు. ఇలాంటి కౌరవ సభలో ఉండటం మంచిది కాదని సభలో చెప్పి క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ చేసి మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతానన్నాను. నేను చాలా ఎన్నికలు చూశాను. ఓడినప్పుడు కుంగలేదు. గెలిచినప్పుడు గెంతులేయలేదు. చెప్పింది చేసి చూపించి అసెంబ్లీకి వెళుతున్నాము. పవన్‌కళ్యాణ్‌కు అభినందనలు తెలుపుతున్నా. ఆయన పొత్తుపెట్టుకుని మంచి పనిచేశారు. బిజెపితో కలిసి కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని ముగించారు.