గిరి పుత్రులకు హైడ్రో గుదిబండ .. నోరు మెదపని ప్రజాప్రతినిధులు
రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన హైడ్రో ప్రాజెక్టులు గిరిపుత్రులకు గుదిబండలా మారుతున్నాయి. ఈ విషయాలు తెలిసినప్పటికీ ప్రభుత్వం మౌనమే పాటిస్తోంది.
(శివరామ్)
విశాఖపట్నం: దశాబ్ధాల కాలం నుంచి బాక్సైట్‌పై పోరాటం చేసి అలసిపోయిన విశాఖ మన్యం ఆదివాసీల గుండెలపై హైడ్రో పేరుతో ప్రభుత్వం మరో కొత్త కుంపటిని తెచ్చిపెట్టింది. పచ్చని కొండల్లో ప్రవహించే సెలయేర్ల నుంచి విద్యుత్‌ను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గిరిజనులకు రక్షణ కల్పించే ఉద్దేశంతో ప్రత్యేకంగా తీసుకొచ్చిన అటవీ చట్టాలను కాదని, గిరిజనుల హక్కులను ఉల్లంఘిస్తూ ఈ ప్రాజెక్ట్‌లకు అనుమతులు మంజూరు చేశారు. ఈ సెలయేర్ల ఆధారంగా వ్యవసాయం చేసుకుని జీవించే వేల గిరిజన కుటుంబాలు నష్టపోతున్నా, దిగువ ప్రాంతాల్లో ఉన్న తాండవ, రైవాడ రిజర్వాయర్ల ఆయకట్టుకు నష్టమని తెలిసినా, విశాఖ తాగునీటిపై వీటి ప్రభావం పడుతున్నా పాలకులు తమకు పట్టనట్టే వ్యవహిరిస్తున్నారు. దీంతో ప్రజా సంఘాలు పోరాటం చేసేందుకు నడుం బిగించాయి.
గిరిజనుల మెడకు ఉరి ఈ ఆరు ప్రాజెక్టులు
ఉత్తరాంధ్రలోని గిరిజన జిల్లాల్లో కొండల నుంచి ప్రవహిస్తున్న సెలయేర్ల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆరు హైడ్రో ప్రాజెక్టులు మంజూరు చేసింది. వీటిలో పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు మండలం, కురుకుట్టి, పాచిపెంట మండలం, కర్రివలస సమీపాల్లో 2,200 మెగావాట్స్, అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతపల్లి మండలం ఎర్రవరం, అనంతగిరి మండలం, పెదకోట, చిట్టంపాడు, గుజ్జెలి ప్రాంతాల్లో 5,500 మెగావాట్లు ఉత్పత్తి చేసే హైడ్రో పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్‌లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేశాయి. వీటిని నూతన పునరుద్ధరణ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్ క్యాప్ ) నోడల్ ఏజెన్సీలను ఏర్పాటు చేసి, కార్పోరేట్ కంపెనీలకు అప్పగించే విధంగా చర్యలు తీసుకున్నాయి.
పిసా, వన్ ఆఫ్ సెవెంటీ చట్టాల ఉల్లంఘన
వీటి మంజూరులో గిరిజనులకు రక్షణ కల్పించే పిసా, వన్ ఆఫ్ సెవెంటీ చట్టాలను, అటవీ హక్కుల చట్టాలను ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. గిరిజనులకు ప్రత్యేకంగా సంక్రమించిన పిసా, అటవీ హక్కుల చట్టాల కింద ఆయా ప్రాంతాల్లో ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే ముందు అక్కడ గ్రామ సభలను నిర్వహించి, స్థానికుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంది. 1997లో అప్పటి ఉమ్మడి విశాఖ జిల్లా, అనంతగిరి మండలంలో ఒక ప్రైవేటు కంపెనీకి ఇచ్చిన అనుమతిని సవాల్ చేస్తూ సమతా స్వచ్చంధ సంస్థ వేసిన కేసులో సుప్రీంకోర్టు అనుమతులు రద్దు చేసింది. సమత తీర్పు ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రైవేటు కంపెనీలకు ప్రాజెక్టులు ఇవ్వడం, అక్కడ భూములను లీజుకు తీసుకునే అనుమతులు ఇవ్వడం, అక్కడ వర్తించే భూ బదలాయింపు చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ హైడ్రో ప్రాజెక్టులు మంజూరు చేసిన ప్రాంతాల్లో ఎటువంటి గ్రామ సభలు నిర్వహించకపోవడం, అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించడం జరిగిందని గిరిజన సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. దీంతో పాటు ప్రధానంగా రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ పారా 4 కింద రాష్ట్రంలో ఏర్పాటు చేసిన గిరిజన సలహా మండలి ముందుగా ఇటువంటి ప్రాజెక్టుల మీద చర్చించాల్సి ఉంది. ఆ కౌన్సిల్ అభిప్రాయాలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల మీద నిర్ణయం తీసుకుంటే, రాజ్యాంగాన్ని ధిక్కరించినట్లవుతుంది. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన "జాతీయ హైడ్రో ఎలక్ట్రిక్ విధానం" ప్రకారం, పోటీ లేకుండా హైడ్రో ప్రాజెక్టులను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టే అధికారం లేదని పర్యావరణ నిపుణుడు, ఫోరం ఫర్ బెటర్ విశాఖ వ్యవస్ధాపకులు ఈ ఏ ఎస్ శర్మతో పాటు పలువురు మేధావులు ఆరోపిస్తున్నారు.
40 గ్రామాలు మునుగుతుంటే గ్రామ సభలు పెట్టరా?
స్థానికుల ఆమోదం లేకుండా నిర్మాణం చేసే ప్రాజెక్టుల వల్ల రెండు జిల్లాల్లో 40 వరకు గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదముంది. 15వేల ఎకరాల గిరిజన భూములకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వీటి వల్ల సుమారుగా 10 వేల మంది జనాభా వేరే ప్రాంతానికి తరలిపోవాల్సి ఉంటుంది. వీటి ప్రభావం పరోక్షంగా మరింత ఎక్కువగా ఉంటుంది. ఇంత ప్రభావం చూపే ఆ ప్రాజెక్టులకు సంబంధించి గ్రామ సభల అనుమతులు తీసుకోకపోవడం, ప్రజాభిప్రాయ సేకరణ, పబ్లిక్ హియరింగ్ వంటివి నిర్వహించకపోవడం వివాదాస్పదంగా మారింది.
రిజర్వాయర్లకు నీటి ఎద్దడి
వీటన్నింటితో పాటు ప్రధానంగా చింతపల్లి మండలం, ఎర్రవరం వద్ద ఏర్పాటు చేసే ప్రాజెక్టు వల్ల అనకాపల్లి జిల్లాలో మేజర్ ప్రాజెక్టు తాండవకు వచ్చే ఇన్‌ఫ్లోలు తగ్గనున్నాయి. దీని ప్రభావం ఐదు వేల ఎకరాలకు మించి ఆయకట్టుపై పడనుంది. అనంతగిరి మండలంలో ఏర్పాటు చేసే ప్రాజెక్టుల వల్ల దిగువన ఉన్న రైవాడ రిజర్వాయరుకు వెళ్లే నీటికి గండి పడి, దాని ప్రభావం విశాఖకు తరలించే తాగునీటిపై పడుతుంది. మన్యం జిల్లాలో సైతం ఇదే తరహాలో రెండు సాగు నీటి ప్రాజెక్టులపై వీటి ప్రభావం పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళన ప్రారంభించిన వామపక్షాలు
ఈ విధంగా గిరిజన చట్టాలను ఉల్లంఘించి, ఏర్పాటు చేస్తున్న హైడ్రో ప్రాజెక్టుల వల్ల అన్ని విధాలుగా నష్టం జరుగుతుందని గిరిజన సంఘాలు, వామపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నా, అధికార పార్టీ సభ్యులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వీటిని ఏర్పాటు చేసే ప్రాంతాలైన పాడేరు, అరకు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో గిరిజన ఎమ్మెల్యేలే ఉన్నా వీటిని పట్టించుకోకపోవడం విచాకరం. ఇదే కాకుండా రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్న కొండల్లో నిత్యం జీవనదులు ప్రవహిస్తూనే ఉంటాయి. వీటి ఆధారంగా ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న హైడ్రో ప్రాజెక్టులు విజయవంతమైతే, మరిన్ని ప్రాజెక్ట్ పదుల సంఖ్యలో వచ్చే ప్రమాదముందని పలు ప్రజా సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైతే బాక్సైట్ తరహాలో మరోమారు గిరిజనులంతా సంఘటితపై ఉద్యమం చేయాలని ఒక నిర్ణయానికొచ్చాయి. దీనిపై గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్స మాట్లాడుతూ గిరిజన చట్టాలకు విరుద్ధంగా హైడ్రో ప్రాజెక్టులు ఏర్పాటు శోచనీయమని, దీనిపై గిరిజనులంతా ఐక్యంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఎన్నికలలోనూ ప్రభావం
గతంలో రాష్ట్రంలో గిరజనులకు రిజర్వు అయిన అరకు పార్లమెంటుతో పాటు ఏడు అసెంబ్లీలలో గెలిచిన వైపీపీ గిరిజన వ్యతిరేక నిర్ణయాల కారణంగా ఇప్పుడు గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటుంది. మైదాన ప్రాంత బీసీలైన వాల్మీకీ, బోయ లను గిరిజనులుగా గుర్తించాలని అసెంబ్లీలో తీర్మాణం చేసి ఇప్పటికే వ్యతిరేకతను మూటగట్టుకున్న వైపీపీ ఇప్పుడు హైడ్రో తేనెతుట్టెను కదిపింది. దీని ప్రభావం రానున్న ఎన్నికల ఫలితాలపై ఉంటుందని ఆ పార్టీ నేతలే కలవరపడుతున్నారు.