మృత్యువు కబళించింది
మంచి ఉద్యోగం సాధించి కుటుంబానికి తోడుగా నిలవాలని ఆశపడిన రాజ్యలక్ష్మి ఆ కలలు నెరవేకుండానే మరణించింది.
By : The Federal
Update: 2025-11-09 04:44 GMT
బాపట్ల జిల్లా కారంచేడు మండలం కారంచేడు గ్రామానికి చెందిన యార్లగడ్డ రాజ్యలక్ష్మి (23) అమెరికాలోని టెక్సాస్‌లో శుక్రవారం సాయంత్రం అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కుటుంబ సభ్యులు, గ్రామస్తులను కలచివేసింది. ఉన్నత చదువుల కోసం అప్పులు చేసి అమెరికాకు పంపిన కుమార్తె మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే ఈ దుర్ఘటన జరిగింది.
బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన యార్లగడ్డ రామకృష్ణ, వీణాకుమారి దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. వీరిది వ్యవసాయ కుటుంబం. ఈ నేపథ్యం నుంచి వచ్చిన రాజ్యలక్ష్మి విజయవాడలో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఎంఎస్ (మాస్టర్స్) కోసం అమెరికా వెళ్లింది. ఎంతో కష్టపడి మాస్టర్స్ డిగ్రీ సాధించి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. అయితే రాజ్యలక్ష్మి రెండు-మూడు రోజులుగా దగ్గు, ఛాతీ నొప్పితో బాధపడుతోంది. డాక్టర్ అప్పాయింట్మెంట్ కూడా తీసుకుంది. అయితే శుక్రవారం నిద్రలోనే ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. మరుసటి రోజు లేవకపోవడంతో రూమ్ మేట్స్ (స్నేహితులు) గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఛాతీ నొప్పి, దగ్గు లక్షణాలు గుండె సంబంధిత సమస్య లేదా ఇతర అనారోగ్య కారణంగా మరణం సంభవించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అమెరికా అధికారులు పోస్టుమార్టం నిర్వహించి ఖచ్చితమైన కారణాలు వెల్లడించనున్నారు.
తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకుని అప్పులు చేసి పంపిన కుమార్తె... మంచి స్థాయిలో చూడాలని కలలు కన్నారు. ఆ కలలు నెరవేర్చకుండానే రాజ్యలక్ష్మి తనువు చాలించడంతో కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. "చిన్న కుటుంబం... ఎంతో కష్టపడి చదివించారు. ఇలా జరగడం బాధాకరం" అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.