మా సచివాలయం ఎక్కడికి పోయింది?

ఈ రూపాంతరం ఎవరి విజయం? ఎవరి ఓటమి? సమాధానం… రాబోయే రోజులు చెప్పాలి. ఈ రాత్రి ఆంధ్రదేశం గ్రామాల్లో ఒక్కటే చర్చ.

Update: 2025-11-09 03:16 GMT

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పాలన చరిత్రలో రెండోసారి భారీ విప్లవం వచ్చింది. గ్రామ-వార్డు సచివాలయాల్లో ‘విజన్ యూనిట్స్’ యుగం మొదలైంది. 2019 అక్టోబర్ 2న మహాత్మాగాంధీ 150వ జయంతి రోజున వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తలపెట్టిన “ప్రతి 2000 మందికీ ఒక సచివాలయం” అనే స్వప్నం… 2025 నవంబర్ 9 నాటికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి చేతుల్లో “విజన్ యూనిట్స్”గా రూపాంతరం చెందబోతోంది. ఇది కేవలం పేరు మార్పు కాదు. ఇది ఒక యుగం ముగిసి, మరో యుగం ప్రారంభమయ్యే సంధి క్షణం.

ప్రజల సేవలపై ప్రభావం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థకు తాజాగా కొత్త రూపం వచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ సచివాలయాలను 'విజన్ యూనిట్స్'గా పేరు మార్చారు. 'స్వర్ణాంధ్ర విజన్-2047'కు అనుగుణంగా ఈ మార్పు జరిగిందని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం పలువురు నిపుణులు, ఉద్యోగ సంఘాలు, ప్రజల నుంచి మిశ్రమ స్పందనలు రేకెత్తిస్తోంది.

ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాలు ఏం చేస్తున్నాయి?

ప్రస్తుతం రాష్ట్రంలో 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఉన్నాయి. మొత్తం కలిపి 15,004 వార్డు, గ్రామ సచివాలయాలు ఉన్నాయి. ఈ సచివాలయాల్లో 1,27,175 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. ఒక్కో సచివాలయంలో 10 నుంచి 12 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గతంలో 1.26 లక్షల పోస్టులు భర్తీ చేశారు. 2025లో 14,500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సచివాలయం 2000 మంది జనాభాకు సేవలు అందిస్తోంది. 36 శాఖల సేవలు ఒకే చోట అందుతున్నాయి. రేషన్ కార్డు, పింఛన్, ఆరోగ్య శ్రీ, భూమి రికార్డులు, సర్టిఫికెట్లు, ఫిర్యాదులు వంటి ఇంకా పలు సేవలు అందుతున్నాయి.

సీఎం చంద్రబాబు నాయుడు గారి "విజన్ సెంటర్స్" అంటే ఏమిటి?

నవంబర్ 6, 2025న సీఎం చంద్రబాబు 'విజన్ యూనిట్స్'గా పేరు మార్చాలని ప్రకటించారు. కారణం ఆన్‌లైన్ సేవలు పెరిగాయి. డబ్బు బ్యాంకులకు వెళ్తుంది కాబట్టి టాప్-డౌన్ అప్రోచ్‌తో డేటా డ్రివెన్ గవర్నెన్స్. AI, డ్రోన్, IoT టెక్నాలజీలు అమలు చేయడం.

ఇప్పటికే ఉన్న 15,004 సచివాలయాలను కాకుండా, కొత్తగా కేవలం 2,802 సెంటర్లు మాత్రమే (ప్రతి 4 మండలాలకు ఒకటి అంటే సగం కంటే తక్కువ) రానున్నాయి. సిబ్బంది సంఖ్య తగ్గనుంది (1.26 లక్షల నుంచి సుమారు 30-40 వేలకు) "ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది కదా" అనే లాజిక్‌తో స్థానిక సేవలు తొలగింపు జరుగుతోంది.

ప్రజలపై నిజమైన ప్రభావం

ప్రస్తుతం సచివాలయం గ్రమ పంచాయతీ, మునిసిపాలిటీల్లో వార్డు పరిధుల్లో ఒకటి నుంచి రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. కొత్తగా 15 కిలో మీటర్లపైగా దూరం పెరిగే అవకాశం ఉంది. విజన్ సెంటర్స్ వద్దకు వెళ్లాలంటే కనీసం వెళ్లిన ప్రతి సారీ రూ. 100 నుంచి 300 వరకు ఖర్చు పెట్టాల్సిందే.

ఇంటర్ నెట్ సమస్య కూడా ప్రధాన మైనది. 40 శాతం గ్రామాల్లో ఇంటర్ నెట్ స్పీడ్ 2ఎంబీపీఎస్ మాత్రమే. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, మహిళలు మొబైల్ యాప్స్ ఉపయోగించ లేరు. గతంలో మూడు రోజుల్లో పూర్తయ్యే పని ఇప్పుడు మూడు వారాలు పట్టే అవకాశం ఉంది. ఇకపై సచివాలయాలు స్కిల్ డెవలప్‌మెంట్, ఇండస్ట్రీ, మార్కెటింగ్, ఉపాధి కేంద్రాలుగా మారనున్నాయి. రియల్ టైమ్ గవర్నెన్స్, డేటా లేక్ ద్వారా నిర్ణయాలు.

ఇక పింఛన్లు, సబ్సిడీలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. గతంలో వాలంటీర్, సచివాలయ ఉద్యోగులు కలిసి రెండు రోజుల్లో ఏ మస్యకైనా పరిష్కారం చెప్పేవారు. ఇప్పుడు అలా సాధ్యం కాదు. ఇప్పుడు మండల కేంద్రానికి వెళ్తే ఫైలు "అధికారి లీవ్‌పై ఉన్నారు" అని 10 రోజులు పట్టే అవకాశం ఉంది.

1.26 లక్షల ఉద్యోగాలు పోతాయి. గ్రామీణ యువతలో 70 శాతం మంది ఇదే ఉద్యోగం మీద ఆధారపడి ఉన్నారు. నిజమైన ఉదాహరణ ను పరిశీలిస్తే పాత విధానం ప్రకారం ఒక 65 ఏళ్ల వృద్ధురాలు పింఛన్ తీసుకోవాలంటే 10 నిమిషాల్లో నడిచి సచివాలయానికి వెళ్లవచ్చు. అక్కడ 20 నిమిషాల్లో పని అయిపోతుంది.

కొత్త విధానం ప్రకారం కనీసం 20 కిలో మీటర్లు వెళ్లాలి. ఆర్టీసీ బస్, లేదా ఆటో ఎక్కాల్సిందే. ఖర్చు రూ. 120లకు తగ్గే అవకాశం లేదు. కనీసం 4 గంటలు వేచి ఉండాల్సిందే.

రేషనలైజేషన్ వివరాలు

జనవరి 2025లో జారీ చేసిన జీవో ప్రకారం సచివాలయాలను జనాభా ఆధారంగా రేషనలైజ్ చేశారు. ప్రతి 2,500 మంది జనాభాకు ఒక సచివాలయం లేదా 5 కి.మీ. రేడియస్‌లో ఒకటి ఉండేలా నిర్ణయం. జనాభా 3,500 ఉన్న సెంటర్స్ 6,054 సచివాలయాలు ఉన్నాయి. ఈ సచివాలయాల్లో 8 మంది సిబ్బంది ఉంటారు.

గతంలో ప్రతి 2,000 మందికి ఒకటి ఉండగా, ఇప్పుడు 2,500కి ఒకటి. దీనివల్ల కొన్ని చోట్ల దూరం పెరిగింది.

గ్రేడులుగా విభజన

కేబినెట్ నిర్ణయం ప్రకారం సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజించారు.

కేటగిరీ-A: జనాభా 3,500 పైబడినవి (8 మంది సిబ్బంది).

కేటగిరీ-B: 2,500-3,500 మధ్య (7 మంది).

కేటగిరీ-C: 2,500 లోపు (కనీస సిబ్బంది).

నిపుణుల అభిప్రాయాలు

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ కె.సి. సూర్యనారాయణ అభిప్రాయం ప్రకారం "రేషనలైజేషన్ ద్వారా ఖర్చు తగ్గుతుంది, కానీ గ్రామీణ సేవలు దెబ్బతినకూడదు. టెక్నాలజీ మంచిదే, కానీ డిజిటల్ లిటరసీ పెంచాలి."

రిటైర్డ్ IAS, గవర్నెన్స్ ఎక్స్‌పర్ట్ డా. ఎం గోపాలకృష్ణ అభిప్రాయం ప్రకారం "విజన్ యూనిట్స్ ఆలోచన స్వాగతించదగినది. రియల్ టైమ్ డేటా ద్వారా స్వర్ణాంధ్ర సాధ్యం, కానీ ఉద్యోగులను తొలగించకూడదు."

ఉద్యోగుల సంఘం అభిప్రాయం

గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు కె. రఘురామిరెడ్డి, పి. శ్రీనివాసులు మాట్లాడుతూ "రేషనలైజేషన్‌తో ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. ఎవరినీ తొలగించబోమని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి హామీ ఇచ్చారు. పనిభారం తగ్గుతుందని చెప్పారు. కానీ ట్రాన్స్‌ఫర్లు, ప్రమోషన్లు సీనియారిటీ ఆధారంగా ఉండాలి."

ప్రజల అభిప్రాయాలు

కృష్ణా జిల్లా రైతు మహిళ కె రమాదేవి అభిప్రాయం ప్రకారం "సచివాలయం దగ్గరలో ఉండేది, ఇప్పుడు 20 కి.మీ. వెళ్లాలా? మొబైల్ యాప్స్ రావు మాకు."

విశాఖపట్నం వ్యాపారి పి సత్యనారాయణ తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ "ఆన్‌లైన్ మంచిదే, కానీ ఇంటర్నెట్ స్పీడ్ లేదు. పేరు మార్చి ఏం లాభం?"

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నివాసి, వ్యాపారి అయిన నాయుడు ప్రభుదాస్ మాట్లాడుతూ ‘‘నేను సివిల్ ఇంజనీరింగ్ చదివాను. నాకు గ్రామ, వార్డు సచివాలయ సేవలపై ఇప్పటి వరకు మంచి అభిప్రాయం ఉంది. ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులతో అభిప్రాయం మారింది. ఈ మార్పులు త్వరలో సచివాలయ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసే వైపుకు వెళతాయి’’ అన్నారు.

సమీప సేవలు కోల్పోతారు

ఈ మార్పులు రాష్ట్రాన్ని డిజిటల్ యుగంలోకి తీసుకెళ్తాయని ప్రభుత్వం చెబుతుండగా, గ్రామీణ ప్రజలు మాత్రం 'సమీప సేవలు' కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం జగన్ ముద్ర తొలగించే ప్రయత్నం కాదు... గ్రామీణ ప్రజలకు"సమీపంలో సేవ" అనే హక్కును లాగేసే నిర్ణయం. ఆన్‌లైన్ సౌకర్యం ఉన్నవాళ్లకు మాత్రమే ప్రభుత్వం అనే భావన వస్తుంది. ఈ నిర్ణయం వల్ల నష్టపోయేది రాజకీయాలు కాదు... గ్రామీణ పేద, వృద్ధ, మహిళలు.

Tags:    

Similar News