TTD -Central Home Department | తిరుమలపై పారని కేంద్ర హోంశాఖ పాచిక

టీటీడీపై కేంద్ర హోంశాఖ పెత్తనానికి అడ్డుకట్టపడింది. ఆ శాఖ కార్యదర్శి పర్యటన రద్దుకు వెనుక ఆసక్తికర విషయాలు తెలిశాయి.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-01-19 08:26 GMT

తిరుపతిలో జరిగిన భక్తుల తొక్కిసలాటలో ఆరుగురు మరణం. ఇటీవల లడ్డు పోటులో జరిగిన అగ్నిప్రమాద ఘటనలపై కేంద్ర హోం శాఖ నివేదిక కోరింది. అంతేకాకుండా, ఆదివారం నుంచి రెండు రోజుల పాటు తిరుపతి, తిరుమలలో ఆ శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ పర్యటనకు షెడ్యూల్ కూడా ఇచ్చారు. శనివారం రాత్రే ఆయన పర్యటన రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ నుంచి లేఖ అందడం చర్చనీయాంశమైంది.

"వాస్తవానికి శ్రీవారి దర్శనం చేసుకోవాలనే కోరికతో కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి నడిపిన కథ" అడ్డం తిరిగిందనేది టీటీడీలో ఓ సీనియర్ అధికారి చెప్పిన సమాధానం. కేంద్ర హోంశాఖ పెత్తనానికి టీటీడీ అధికారులు సమర్ధవంతంగా అడ్డుకోగలిగారని కూడా చెబుతున్నారు. ఈ పరిణామాల వెనుక ఆసక్తికర విషయాలు తెలిశాయి.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అమరావతి పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. శనివారం సాయంత్రమే ఆయన సీఎం ఎన్. చంద్రబాబుతో భేటీ కూడా అయ్యారు. ఈ పరిస్థితుల్లో తిరుపతి, తిరుమలలో జరిగిన దుర్షటనలకు దారితీసిన పరిస్థితిని సమీక్షించడానికి రావాల్సిన హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ పర్యటన రద్దు కావడం వెనుక కారణం ఏమటనేది ఆసక్తి రేపింది.
టీటీడీ అధికార వర్గాల కథనం ఏమిటంటే..
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంట ఆ శాఖ అదనపు అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ కూడా ఢిల్లీ నుంచి వచ్చారని సమాచారం. ఎలాగూ వచ్చాం కదా. తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవాలని భావించారని చెబుతున్నారు. సాధారణంగా వచ్చిన ప్రొటోకాల్ దర్శనానికి అవకాశం ఉంటుంది. కానీ, ప్రొటోకాల్, ఆన్ డ్యూటీ కల్పించుకోవడానికి ఢిల్లీ కేంద్ర కార్యాలయం నుంచి టీటీడీకి ఓ లేఖ అందింది. అందులో..
"హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ వస్తున్నారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ఘటననను పరిశీలిస్తారు. టీటీడీ అధికారులతో సమీక్షిస్తారు" అనేది ఆ లేఖ సారాంశం. "కేంద్ర అధికారికి వాహన సదుపాయం. వసతి కల్పించండి" అని కూడా లేఖలోని సారాంశం. దీంతో టీటీడీ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ఏర్పాట్లు చేయడంతో పాటు ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఈఓ కార్యాలయాలు స్పందించాయి. హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ పర్యటన, విచారణ విషయాలను సీఎంఓ (Chief Minister's Office ) కు చేరవేశాయి.
అమరావతి పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి ఇదే విషయాన్ని తీసుకుని వెళ్లిన సీఎం ఎన్. చంద్రబాబు అభ్యంతరం చెప్పారని విశ్వసనీయవర్గాల సమాచారం.
"తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించాను" అని సీఎం చంద్రబాబు చెప్పడంతో పాటు ఘటన జరిగిన తరువాత టీటీడీ జేఈఓ, సీవీఎస్ఓ, తిరుపతి ఎస్పీని బదిలీ చేయడం, ఓ డీఎస్పీ, మరో టీటీడీ అధికారిని సస్పెండ్ చేసిన విషయాలు కూడా సీఎం చంద్రబాబు వివరించారని తెలుస్తున్నది. దీనికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎలా స్పందించారో తెలియదు. కానీ, హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ పర్యటన రద్దు అయింది. ఇదే వ్యవహారం ప్రస్తుతం టీటీడీలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
మొదటి అడుగే పడనివ్వు లేదు...
టీటీడీలో అనేక వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వమే స్పందించింది. కేంద్రం జోక్యానికి ఆస్కారం ఇవ్వలేదు. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మరణించిన వ్యవహారంపై మొదటిసారి కేంద్ర హోంశాఖ స్పందించడంపై టీటీడీ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. అదృశ్యం పనిచేసిన శక్తులు బాహాటంగా తెలిసినప్పటికీ, టీటీడీ వ్యవహారాలపై కేంద్రం జోక్యం చేసుకోకుండా నివారించడంలో మొదటి ప్రయత్నానికి సమయస్ఫూర్తితో అడ్డకట్ట వేశారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
టీటీడీపై పెత్తనం చెలాయించాలనే ప్రయత్నానికి ఆదిలోనే చెక్ పెట్టినట్లు కనిపిస్తోంది.
నివేదిక కోరిన కేంద్రం
తొక్కిసలాటలో ఆరుగురు యాత్రికుల మరణం, తిరుమల లడ్డు ప్రసాదాల తయారీ కేంద్రంలో జరిగిన చిన్నపాటి అగ్నిప్రమాదంపై ఘటనల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆరా తీసినట్లు సమాచారం. ఈ వరుస ఘటనలపై కేంద్ర హోం శాఖ టీటీడీని నివేదిక కోరింది. అయితే ఏకంగా కేంద్ర హోమ్ శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ విచారణకు రానున్నారనే విషయంపై మొదట కలకలం చెలరేగినా, సుతిమెత్తగానే అడ్డుకట్ట వేశారని భావిస్తున్నారు.
ఉలికిపాటుకు కారణం?
తిరుమల క్షేత్రానికి రోజూ సుమారు లక్ష మందికి పైగా యాత్రికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఏడు వేల గదుల్లో బస చేసే యాత్రికులతో పాటు నిత్యాన్నదానం, ఆలయ రోజు నీటి అవసరాలకు కొండల్లో నిర్మించిన డ్యాంలే ఆధారం. వాటిల్లో చంద్రగిరి సమీపంలోని కల్యాణి డ్యాం. తిరుమలలోని గోగర్భం, ఆకాశగంగ, కుమారధార - పసుపుధార జంటప్రాజెక్టుల నుంచి నీటిని శుద్ధి చేసి పంపింగ్ చేస్తుంటారు. వాటి భద్రత, పర్యవేక్షణను తన పరిధిలోకి తీసుకోవాలని కేంద్రం ప్రయత్నాలు చేసింది. దీనికి టీటీడీ సుముఖంగా లేదు. కారణం ఏమిటంటే..
తిరుమల క్షేత్రానికి ఐదంచెల భద్రతా వ్యవస్థ ఉంది. ఇందులో ఏఆర్, ఏపీఎస్పీ (Armed Reserve, APSP) అధికారులు, సిబ్బందితో కూడిన విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ప్రధానమైనది. వారి సారధ్యంలోనే కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన మాజీ సైనికులు ఉంటారు. అనుకోని సంఘటన జరిగితే కనురెప్ప పాటులో సమర్ధవంతంగా బరిలోకి దూకే అక్టోపస్, వారి కంటే ముందు టీటీడీలో సెక్యూరిటీ గార్డులు (మాజీ సైనికోద్యోగులు) ఉంటారు. టీటీడీలోని వాటర్ వర్క్స్ విభాగం పర్యవేక్షణ కూడా ఉంటుంది. ఇంతటి పటిష్ట వ్యవస్థ కలిగిన టీటీడీలోని నీటి ప్రాజెక్టుల భద్రతను తమ ఆధీనంలోకి తీసుకోవాలనే కేంద్ర ఆలోచనకు అభ్యంతరం చెప్పారనేది అధికారుల ద్వారా సమాచారం. ఈ పరిస్థితుల్లో ఇటీవల చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ప్రమేయాన్ని ఆదిలోనే ఆపగలిగారని భావిస్తున్నారు.
Tags:    

Similar News