చంద్రబాబు కట్టుకునే సొంత ఇల్లు ప్రత్యేకతలు ఇవే!

5.17 ఎకరాల్లో ఇల్లు, సకల సౌకర్యాలు, బోలెడన్ని గదులు, నౌకర్లు, చాకర్లు, భద్రతా సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు.. ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలతో చంద్రబాబు ఓ ఇంటివారవుతున్నారు;

Update: 2025-04-09 04:52 GMT
CBN and his proposed new house site
విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేలా నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధాని అమరావతిలో సొంతింటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి నిర్మాణానికి ఏప్రిల్ 9న ఘనంగా శంకుస్థాపన జరిగింది. బుధవారం ఉదయం శంకుస్థాపనలో భాగంగా భూమి పూజ నిర్వహించారు. చంద్రబాబు భార్య భువనేశ్వరీ, ఆయన కుమారుడు నారా లోకేశ్, ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వెలగపూడి సచివాలయం వెనుక E 9 రహదారి పక్కనే ఈ ఇంటిని నిర్మిస్తున్నారు.
చంద్రబాబు ఇంటి ప్రత్యేకలు ఏమిటంటే...
చంద్రబాబు E-9 రహదారి పక్కనే ఇల్లు కట్టుకుంటున్నారు. భద్రతా పరంగా ఇది మంచి లొకేషన్. సచివాలయానికి దగ్గరగా ఉంది. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పటికీ వివిధ కారణాల రీత్యా ఆయన ఇప్పటి వరకు సొంతింటిని కట్టుకోలేదు. కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని లింగమేనని ఎస్టేట్స్ వారి ఇంట్లోనే అద్దెకు ఉంటూ వచ్చారు. దీనిపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి.ఉండేది హైదరాబాదు ముఖ్యమంత్రి మాత్రం ఆంధ్రప్రదేశ్ లోనా అని వైసీపీ నేతలు జగన్ మోహన్ రెడ్డి మొదలు చోటా మోటా నాయకులకు వరకు ఎందరెందరో విమర్శించారు. ఇటీవల కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు ఇల్లు పెద్ద సమస్య అయింది. సరిగ్గా ఈ నేపథ్యంలో ఆయన సొంతింటికి శ్రీకారం చుట్టారు. తనకు బాగా అనుకూలంగా ఉన్న వెలగపూడి గ్రామానికి సమీపంలో ఈ ఇల్లు నిర్మాణం అవుతోంది. చంద్రబాబు భార్య భువనేశ్వరి ఇప్పటికే ఈ స్థలాన్ని పరిశీలించి ఎంపిక చేశారు.

తన ఇంటి నిర్మాణం రాజధాని అమరావతికి ఒక భరోసా, నమ్మకంగా ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. వెలగపూడికి చెందిన రైతుల నుంచి 5 ఎకరాల 17 సెంట్ల స్థలాన్ని చంద్రబాబు కొనుగోలు చేశారు. సువిశాల ప్రాంగణంలో విలాసవంతమైన భవనాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం విస్తీర్ణం 2500 గజాలు కాగా 1,455 చదరపు గజాల విస్తీర్ణంలో జి ప్లస్‌ 1లో ఇంటిని నిర్మించనున్నారు. స్థలంలో ఎక్కువ భాగం పచ్చదనం, మొక్కలు పెంచాలని నిర్ణయించారు. ఇంటి నిర్మాణ బాధ్యతను ఎస్‌ఆర్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి అప్పగించారు. పనుల్ని ఏడాదిలోపు పూర్తి చేసి గృహప్రవేశం చేయాలని భావిస్తున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయం, నివాసంతో పాటు కారు పార్కింగ్, నౌకర్లు, భద్రతా సిబ్బందికి కూడా గదులు ఉండేలా నిర్మాణం ఉంటుందని భావిస్తున్నారు. నారా భువనేశ్వరి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇంటి నిర్మాణం జరుగుతోంది.
భూమి పూజ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి వెలగపూడి గ్రామస్తులు పట్టు వస్త్రాలు సమర్పించారు. రాజధాని ఉద్యమ సమయంలో తమకు నారా భువనేశ్వరి ధైర్యం చెప్పారని, దానికి కృతజ్ఞతగా పట్టువస్త్రాలు సమర్పించామని రైతులు చెప్పారు. రైతులు అమరావతి రాజధాని కోసం ఉద్యమిస్తున్న తరుణంలో ఆమె తన గాజులను దానంగా అందజేశారని, ఆ కుటుంబానికి తమ గ్రామం ఎంత ఇచ్చినా తక్కువేనని, ఉడతా భక్తి కింద ఆ దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పించామని వెలగపూడి రైతులు చెప్పారు.
ఉదయం 8.51 గంటలకు ఉండవల్లిలోని సీఎం నివాసం నుంచి చంద్రబాబు భార్య భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మణి, దేవాన్ష్‌లతో కలిసి ఉదయం 7.15 గంటలకు బయలుదేరారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2024 డిసెంబరులో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలోని నివాస ప్లాట్‌ను ఇదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేశారు. ఇటీవలే ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కూడా పూర్తయింది. ఐదు రోజుల కిందట భూమిని చదును చేశారు.
2019 ఎన్నికలకు ముందు రాజధాని అమరావతికి మద్దతుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో ఇంటిని నిర్మించుకున్నారు. రాజధాని అమరావతికి మద్దతుగా ఆయన ఈ నిర్మాణాన్ని చేపట్టారని వైసీపీ నేతలు అప్పుడు చెప్పేవారు. చంద్రబాబుకు అమరావతిపై నమ్మకం లేకనే ఇల్లు కట్టుకోలేదని కూడా విమర్శలు చేసేవారు. అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి మూడు రాజధానులంటూ కీలక ప్రకటన చేశారు. దీంతో రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఉద్యమం చేపట్టారు. ఆ ఉద్యమం వందల రోజుల పాటు కొనసాగింది. ఇక 2024లో ఎన్నికల్లో జరిగాయి. ఈ ఎన్నికల్లో కూటమిలోని పార్టీలు మొత్తం 164 స్థానాలకు కైవసం చేసుకున్నాయి. అనంతరం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఆ తర్వాత రాజధాని అమరావతి పనులు ఊపందుకున్నాయి.
చంద్రబాబుకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో పెద్ద సొంత ఇల్లు ఉంది. 2014లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భారీ వ్యయంతో ఆ ఇంటికి భారీ మార్పులు చేర్పులు చేశారు. ఆయన సొంత ఊరు నారావారి పల్లె లో కూడా ఆమధ్య సొంతింటిని నిర్మించుకున్నారు. ప్రతి సంక్రాంతిని ఆయన అక్కడే నిర్వహించుకుంటున్నారు.
Tags:    

Similar News