అంతు చూస్తాం..పీక కోస్తాం..ఏంటీ ఈ డైలాగులు
నిబంధనలకు విరుద్ధంగా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తేల్చి చెప్పారు.
అంతు చూస్తాం.. పీక కోస్తాం.. రఫ్పా రఫ్పా ఏంటండీ ఈ సినిమా డైలాగులు.. ఏంటివి అంటూ స్పీకర్ అయ్యన్నపాత్రు వైసీపీ తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వాళ్లు ప్రెస్ మీట్లు పెట్టి వారు మాట్లాతున్న డైలాగులు దారుణంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. ఏంటీ ఈ డైలాగులు తనకు అర్థం కావడం లేదంటూ సీరియస్ అయ్యారు. రోజు సోషల్ మీడియాలో కానీ, ప్రెస్ మీట్లలో కానీ వారు మాట్లాడుతున్న తీరు సరిగా లేదన్నారు. మళ్లీ మేమే వస్తాం.. పీకలు కోస్తాం ఏంటండీ ఇదీ.. ఒక రాజకీయ పార్టీ, ప్రజా స్వామ్యంలో గౌరవం ఉన్న వాళ్లెవ్వరూ ఇలా మాట్లాడరు. ఎన్టీ రామారావు దగ్గర నుంచి తాము రాజకీయాల్లో ఉన్నామని, ఇలా ఎప్పుడూ లేదన్నారు. రాజకీయ పార్టీ అన్న తర్వాత ప్రజాస్వామ్యంలో ఓడుతూ ఉంటాం.. గెలుస్తూ ఉంటాం.. మహానుబావుడు ఎన్టీ రామారావు, తాము ఒక సారి ఓడిపోయాం. ఇలా ఎప్పుడైనా మాట్లాడారా? ఇందిరా గాంధీ ఓడిపోలేదా ? కానీ ఆమె ఎప్పుడైనా ఇలా మాట్లాడారా? ఓడిపోతే రఫ్పా రఫ్పా అని మాట్లాడతారా? ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటిని ఖండించాలని, అసెంబ్లీ వేదిక ద్వారా ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు.
ప్రజాస్వామ్యంలో రాష్ట్ర అభివృద్దిని దృష్టిలో పెట్టుకొని ప్రతి రాజకీయ పార్టీ వ్యవహరించాలన్నారు. వైసీపీ ఒక సారి గెలిచింది. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసింది. దీనిని ప్రజలు కళ్లారా చూశారు. అందుకే ప్రజలు గుణపాఠం చెప్పారు. ఇప్పుడు ప్రతిపక్షంగా వైసీపీ డ్యూటీ ఏంటి? వైసీపీ ఏం చేయాలి? ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను అమలు చేయడానికి వైసీపీ ప్రయత్నం చేయాలని, అది రాజకీయపార్టీ లక్షణమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ప్రజలకు ప్రభుత్వం ఎక్కడైనా పొరపాట్లు చేస్తే.. వాటిని అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడాలి. ప్రభుత్వం దానికి రిప్లై ఇస్తుంది.
సభలో మంత్రులు ఉంటారు. వారు సమాధానం చెబుతారు. సీఎం ఉంటారు. ఉప ముఖ్యమంత్రి ఉంటారు. సభ్యులందరూ ఉంటారు. సభలో మాట్లాడి ప్రజలకు పనులు చేయించాలి, నియోక వర్గాలకు పనులు చేయించుకోవాలి. సభకు రారు.. ఎమ్మెల్యేలను సభకు రానివ్వరు.. ప్రశ్నలు మాత్రం పంపుతారు రోజు. సభకు రానప్పుడు ప్రశ్నలు ఎందుకు పంపడం. ఇద్దరి సభ్యుల సమయం వృధా అవుతుంది కదా అని వైసీపీ తీరుపైన అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరు మంచిది కాదు. ప్రజలందరూ దీనిని ఖండించాల్సిన అవసరం ఉందని తాను భావిస్తున్నట్లు స్పీకర్ స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో గౌతు లచ్చన్న స్వతంత్య్ర పార్టీ నాయకుడు నేతృత్వంలో 60 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అప్పుడు ఎమ్మెల్యేల సంఖ్య సరిపోయిందని గౌతు లచ్చన్నకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు.
కానీ అందులో కొంత మంది సభ్యులు ఆ పార్టీని వదిలి వెళ్లి పోయారు. అయినా ప్రతిపక్ష నేత హోదా నుంచి దిగిపొమ్మని సభలో ఎవరూ అడగలేదు. అయితే ఆ సందర్భంలో సభకు వచ్చిన గౌతు లచ్చన్న తన పార్టీని వీడి కొంత మంది సభ్యులు వెళ్లి పోయారు అని, అందువల్ల ప్రతిపక్ష హోదాలో ఉండే అర్హత తనకు లేదని గౌతు లచ్చన్న సభలో ప్రకటించారని, రాజీనామా ఇచ్చి పోతానని చెప్పారని, అది నాయకత్వ లక్షణాలంటే అని స్పీకర్ పేర్కొన్నారు. ప్రస్తుతం వైసీపీ వ్యవహరిస్తున్న సందర్భంలో దీనిని గుర్తు చేస్తున్నట్లు అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. వైసీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే దానిపై నిబంధనల ప్రకారమే చేస్తామని, రూల్స్‌కు విరుద్ధంగా చేయమని, కేసులు పెట్టుకోవచ్చన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని, దానిని దృష్టిలో పెట్టుకుని పని చేయాలని, ఇలాంటి దుర్మార్గాలు చేయడం మంచిది కాదని ఆయన వైసీపీకి, ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌కు సూంచించారు.