తిరుమల ఘాట్ రోడ్డులో హాలీవుడ్ స్టంట్..
పల్టీ కొట్టిన కారులో ప్రయాణిస్తున్న తమిళనాడు యాత్రికులకు గాయాలు.
Byline : SSV Bhaskar Rao
Update: 2025-11-16 06:56 GMT
తిరుమల ఘాట్ రోడ్ లో హాలీవుడ్ స్టంట్ సీను తలపించింది. మితిమీరిన వేగంతో వెళుతూ ఒక కారు మలుపు వద్ద పిట్టగోడలను ఢీకొనడంతో పల్టీలు కొట్టింది. సమీప ప్రదేశాలనుంచి ప్రయాణిస్తున్న వాహనదారులు తృట్లో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తమిళనాడు కారు పల్టీ కొట్టిన తీరును చూస్తున్న వాహనదారులు కూడా అవాక్కయ్యారు.
తమిళనాడుకు చెందిన యాత్రికులు నలుగురు ఓ కారులో తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. అలిపిరి తనిఖీ కేంద్రం దాటుకున్న వారు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్నారని తెలిసింది. వేగంగా ప్రయాణిస్తున్న కారణంగా మలుపు వద్ద అదుపు చేయలేక పిట్టగోడను ఢీకొట్టిన ఈ కారు రోడ్డుపై అడ్డంగా బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం సిబ్బంది స్పందించారు. గాయపడిన బాధితులను తిరుమలలోని టిటిడి అశ్వని ఆసుపత్రికి తరలించారు.
19 కిలోమీటర్లు 40 నిమిషాల ప్రయాణం
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లాలంటే రెండో ఘాట్ రోడ్లో ప్రయాణం చేయాలి. 19 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం వాహనాల వేగానికి కళ్లెం వేసే దిశగా నిర్దిష్ట సమయాన్ని నిర్ణయించింది. ప్రతి వాహనం 30 నుంచి 40 నిమిషాల పాటు ప్రయాణించడానికి వీలుగా ఆంక్షలు విధించారు. అంటే వాహనం మెల్లగా నడుపుతూ ప్రమాదాలను నివారించాలని ఇందులో ప్రధాన ఉద్దేశం.
తిరుపతి నుంచి తిరుమలకు కానీ, తిరుమల నుంచి తిరుపతికి రావడానికి ఇదే సమయం వర్తిస్తుంది. తిరుమలకు వెళ్లే సమయంలో మొదటి ఘాట్ రోడ్లో ప్రకృతి ఆహ్లాదంగా ఉంటుంది. అయితే సరైన నిఘా లేకపోవడం వల్ల వాహనదారులు ఇష్టానుసారంగా ర్యాష్ర డ్రైవింగ్ చేయడం పరిపాటిగా మారుతుంది. ముందు వెళ్లే వాహనాలను అధిగమించే ప్రయత్నంలో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.
తిరుమల రెండో ఘాట్ రోడ్ లో ఆదివారం జరిగిన ప్రమాదంలో కారు బోల్తా పడిన ఘటనకు దారి తీసిన పరిస్థితి కూడా అలాగే ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మితిమీరిన వేగంతో వెళ్లడం, రోడ్డు గ్రిప్ లేకపోవడం వల్ల వాహనం నడిపే డ్రైవరు తత్తర పాటు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. గాయపడిన బాధ్యతలు వివరాలు తెలియలేదు. తిరుమల ఘాట్ రోడ్ లో కూడా వాహనాలు వేగ నియంత్రణకు మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరాన్ని తాజాగా జరిగిన ఈ సంఘటన కూడా ప్రస్తావిస్తోంది.