స్పీకర్ అయ్యన్న సంతృప్తి
ప్రజా ప్రతినిధుల క్వార్టర్స్ పనుల పురోగతిని పరిశీలించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు.;
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణాల పనులు జరుగుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్ భవన సముదాయాల పనుల పురోగతిపై ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బుధవారం సీఆర్‌డీఏ పరిధిలోని హౌసింగ్ – బిల్డింగ్స్ (హౌసింగ్ ప్రాజెక్ట్స్) విభాగ చీఫ్ ఇంజినీర్ ఎన్.శ్రీనివాసులు, ఇతర ఇంజినీరింగ్ విభాగ అధికారులతో కలిసి అమరావతిలో జరుగుతున్న భవన నిర్మాణాల పనుల పురోగతిని పరిశీలించారు. భవనాల నిర్మాణాలలో ఏర్పాటు చేసిన సదుపాయాలను, ఏర్పాటు చేయనున్న వాటి గురించి, లోపల ఇంటీరియర్ డిజైన్ల గురించి స్పీకర్ అయ్యన్న పాత్రుడికి అధికారులు వివరించారు.
మొత్తం 12 టవర్లలో 288 క్వార్టర్లు శాసనమండలి, శాసనసభ సభ్యుల కొరకు నిర్మిస్తున్నట్లు అధికారులు ఆయనకు తెలియజేశారు. ఇంటీరియర్ పనులలో పురోగతి పట్ల స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధికారులు వివరించగా వాటి పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని శాసనసభ్యులకు నివాస సముదాయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే భవన సముదాయాల వద్ద ఏర్పాటు చేస్తున్న పలు సౌకర్యాలను గురించి అధికారులను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి అమరావతిలోని క్వార్టర్స్ లోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉంటారని అయ్యన్న తెలిపారు. క్వార్టర్స్ లో స్విమ్మింగ్ పూల్, ఆసుపత్రి, క్లబ్ హౌస్ వంటి సౌకర్యాలు ఉండే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టులో 10 రోజుల వర్షాకాల సమావేశాలు ఉంటాయని పేర్కొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు సెప్టెంబరులో తిరుపతి వేదికగా చట్టసభల జాతీయ మహిళా సాధికార సభ్యుల సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ర్టాల నుంచి సభ్యులు పాల్గొంటారని పేర్కొన్నారు.