మరికొందరు వైసీపీ ఎంపీలు జగన్ కి గుడ్ బై చెబుతారా?

రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. నిన్నటి వరకు ఉన్న వాళ్లు రేపు అదే పార్టీలో ఉంటారన్న నమ్మకం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అదే జరుగుతోంది.

Update: 2024-10-07 10:47 GMT

వైసీపీ పార్లమెంటరీ పార్టీకి గండి పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి వేరే పార్టీల వైపు చూస్తున్నారు. మరికొంత మంది కూడా ఇదే దారి పట్టే అవకాశాలు ఉన్నాయని సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ కాశీ విశ్వనాథరాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీకి చెందిన కీలక ఎంపీలు కొందరు ఆ పార్టీని వీడే అవకాశం ఉందన్నారు కాశీ విశ్వనాథరాజు. దీంతో త్వరలో వైసీపీని వీడేవారు ఎవరనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వైసీపీ రాజ్యసభ సభ్యులు కొందరు బీజేపీ అధిష్టానంతో టచ్‎లో ఉన్నారని తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలు ఓడినపుడల్లా ఆయా పార్టీల సభ్యులు వేరే పార్టీల్లో చేరడం ఇటీవలి కాలంలో తరచూ చూస్తున్నదే. టీడీపీ ఓడినపుడు ఆ పార్టీ ఎంపీలు నలుగురు నేరుగా వెళ్లి బీజేపీలో చేరారు. వారెవ్వరూ తమ పదవులకు రాజీనామా చేయలేదు. అయినా వారిని ఆ పార్టీ చేర్చుకుంది. ఇప్పుడూ అదే జరగబోతుందన్నది కాశీ విశ్వనాథ్ వాదన.

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజ్యసభలో వైసీపీ ఎంపీల సంఖ్య 11. వైవీ సుబ్బారెడ్డి, వి. విజయసాయిరెడ్డి, మేడ రఘునాధ రెడ్డి, గొల్ల బాబూరావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమాల్ నత్వానీ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోసు, ఎస్.నిరంజన్ రెడ్డి. వీళ్లలో ముగ్గురు వైసీపీ నుంచి తప్పుకున్నారు. మోపిదేవి, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్య ఇటీవల రాజీనామా చేశారు. వీరు ఏ పార్టీలో చేరతారన్నది ఇంకా తేలలేదు. మోపిదేవీ, బీద మస్తాన్ రావు టీడీపీలో చేరనున్నట్టు ప్రకటించారు. ఆర్.కృష్ణయ్య మాత్రం ఇంకా తన నిర్ణయం ప్రకటించలేదు. ఆయన తెలంగాణవాసి. అందువల్ల కాంగ్రెస్ లో చేరతారని భావిస్తున్నారు. అయితే ఈలోగా ఆయన కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డితో భేటీ కావడం చర్చనీయాంశమైంది.
మిగిలిన వారిలో వైవీ సుబ్బారెడ్డి, గొల్లబాబూరావు, మేడ రఘునాధరావు పదవి కాలం 2030 ఏప్రిల్ ఒకటి వరకు ఉంది. విజయసాయిరెడ్డి, ఎస్.నిరంజన్ రెడ్డి 2028 జూన్ 21న రిటైర్ కావాలి. పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వానీ పదవీ కాలం 2026 జూన్ 21తో ముగుస్తుంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం మున్ముందు రాజ్యసభ సీట్లన్నీ టీడీపీకే దక్కుతాయి. అయితే అప్పటి వరకు వీళ్లు ఆగుతారా? అనేది సందేహాం. కనీసం ఇద్దరు త్వరలో పార్టీ మారే సూచనలు ఉన్నాయి. ఇప్పుడు అధికారంలో టీడీపీ 2029 మే నెల వరకు అధికారంలో ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే 2029 తర్వాత వైసీపీకి మిగిలేది ముగ్గురే కావొచ్చు.
పిల్లి సుభాష్ చంద్రబోస్ చాలాకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే వైసీపీ అధిష్టానంతో ఆయన విభేదించారు. ఆ పంచాయితీని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిష్కరించి సర్దుకు పోవాలని గట్టిగానే చెప్పారు.
రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు గనుక నిన్నటి వరకు ఉన్న వాళ్లు రేపు అదే పార్టీలో ఉంటారన్న నమ్మకం లేదు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పార్టీ నుంచి వెళ్లిపోవడం, చీలిపోవడం వంటివి మామూలే. కానీ ఎటువంటి తీవ్రవైన విభేదాలు లేకుండా కేవలం రాజకీయ స్వార్థంతోనో, ఆస్తుల పరిరక్షణ కోసమో, బెదిరింపులకు భయపడో పార్టీ ఫిరాయించడం వేరు. చట్టానికి దొరకకుండా పని జరుపుకోవడం ప్రస్తుతం నడుస్తున్న తీరు. ఒక పార్టీ సభ్యుడు మరో పార్టీ మీటింగ్ లో కనిపిస్తాడు. మాట్లాడతాడు. కండువా కూడా కప్పుకుంటాడు కాని అధికారికంగా రాజీనామా చేయడు. సొంత పార్టీ విప్ ను పాటించడు. పార్టీపై విమర్శలు మామూలే. మరికొందరైతే రాజీనామా చేస్తారు గాని వాటిని స్పీకర్ ఆమోదించరు. ఇంకొందరైతే ఏ పార్టీ గుర్తుపై గెలిచారో ఆ పార్టీని వీడి అవతలి పార్టీలో మంత్రి అయిన సంఘటనలూ ఉన్నాయి. అందువల్ల వైసీపీకి మిగిలిన 8 మందిలో ఎవరు ఏవైపు చేరతారో, ఎందరు సొంతపార్టీపై విశ్వాసం ఉంచుతారో ఇప్పుడే ఊహించడం కష్టం.


Tags:    

Similar News